ఆగస్ట్ 13, 2012
అంబల్ల జనార్దన్ – ఒక ఆదర్శం
ప్రముఖ రచయిత అంబల్ల వసుంధరకు వ్రాసిన లేఖనూ వారు పంపిన ఫొటోలనూ ఈ క్రింద జత పర్చుతున్నాం. ప్రయోజనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీ జనార్దన్‌కి అక్షరజాలం అభివందనాలు.
వసుంధర గార్లకు,
నమస్కారం. స్వప్న మాస పత్రిక, జులై, 2012 లో వచ్చిన మీ పార్థుడూ పార్థివమూ ఆలోచింప జేసేదిగా ఉంది. నేను అది కనీసం నాలుగు సార్లు చదివాను, ప్రతిసారీ ఏదో కొత్తదనం కనిపిస్తోంది. పార్థివ దేహానికి అంతిమ సంస్కారం విషయంలో మీ భావాలను సున్నితంగా ప్రకటించారు.
ఉద్వేగమునకు లోనైన పార్థసారథి, మంచి మనసున్నా,ప్రాక్టికల్ గా అలోచించి, ఆచరించే విశ్వం పాత్రలు పాఠకులపై చెరగని ముద్ర వేస్తాయి. పనిలో పనిగా నేటి ప్రచార మాధ్యమాల పనితీరుపై వ్యంగాస్త్రం సంధించారు. అభినందనలు.
సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. డిసెంబర్,2008 లో,నేను నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా పార్థివ దేహాన్ని గ్రాంట్ మెడికల్ కాలేజి, ముంబయి వారికి ఇస్తానని తెలిపాను.
మీ సమాచారంకోసం దానికి సంబంధించిన పత్రాలు జతపరిచాను.
మీ అభిమాని,
అంబల్ల జనార్దన్
రాజశేఖర రాజు said,
ఆగస్ట్ 14, 2012 at 3:57 సా.
శ్రీదేవి గారూ,
చక్కటి మాట. వైద్య పరిశోధనల కోసం చరమదశలో నా శరీరాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రాణం విడిచిన తర్వాత కూడా ఏదో ఒక ఉపయోగం దేహం వల్ల జరిగితే చాలు. దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏవో అర్థమైతే తిరుపతిలో కాని చెన్నయ్‌లో కాని తప్పక దీని విధివిధానాలు పూర్తి చేస్తాను.
ధన్యవాదాలు.
7305018409
TVS SASTRY said,
ఆగస్ట్ 14, 2012 at 7:20 ఉద.
వసుంధర గారికి,
‘ప్రాణమున్నంత సేపే ఈశరీరానికి విలువ’ అనే సత్యాన్ని ‘పార్దుడూ -పార్దివమూ’అనే మీ కథలో అత్యద్భుతంగా చెప్పారు.కథ చదివిన తరువాత తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి.ఒక మంచి సందేశాత్మక కథ సమాజాన్ని చైతన్యవంతం చేస్తుందనటానికి మీ కథే ఉదాహరణ.మంచి సందేశాత్మక కథ వ్రాసిన మీకూ,కథ చదివి చలించి ఒక మనీషిగా స్పందించిన శ్రీ అంబల్ల జనార్దన్ గారి ఆదర్శానికి అభినందనలు,శతకోటి వందనాలు.
భవదీయుడు,
టీవీయస్.శాస్త్రి