Site icon వసుంధర అక్షరజాలం

ఈగ – చిత్రసమీక్ష

ఆడవాళ్లను ప్రేమించడం కాదు, అనుభవించాలనుకునే ఓ కోటీశ్వరుడు సుదీప్ బిందూమీద మనసు పడ్డాడు. ఆమె చేసే సమాజసేవకు లక్షల్లో విరాళాలిచ్చి ఆమెకు దగ్గిర కావాలనుకున్నాడు. కానీ ఆమెను మనసారా ప్రేమించిన ఓ సామాన్యుడు నాని – నిజమైన ప్రేమతో ఆమె మనసును గెల్చుకున్నాడు. ఆమె తనకు దక్కదన్న అనుమానంతో సుదీప్ నానిని చంపేశాడు. నాని ఈగగా పునర్జన్మ ఎత్తి సుదీప్‍ని వేధిస్తాడు. ఆ ఈగ నాని అని తెలిసేక బిందు కూడా అతడికి సహకరిస్తుంది. సుదీప్‍పై ఈగ ప్రతీకారం తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది.

ఇలా వింటే ఏదో చిన్న చిన్నపిల్లల కథ అనిపిస్తుంది. కానీ తెరమీద రెండున్నర గంటలు నిరవధికంగా వినోదింపజేసే మహత్తర చిత్రమిది. ఇలాంటి కథలు, చిత్రాలు హాలీవుడ్‍కి కొత్త కాదు. వారిని అనుకరిస్తూ మనం మన భాషలో తియ్యడమూ కొత్త కాదు. కానీ తొలిసారిగా అచ్చ తెలుగు దర్శకుడు – ఏ ఇతర భాషాచిత్రాన్నీ అనుకరించకుండా తీసిన తొలి తెలుగు ఒరిజినల్ చిత్రమిది. ఈ చిత్రం గొప్పతనం ఒరిజినాలిటీ.

నాని కాసేపే కనిపిస్తాడు. కానీ ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేస్తాడు. ఆదిలో అతడికీ సమంతాకీ మధ్య చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు – నటీనటుల ప్రతిభకీ, దర్శకుడి సామర్ధ్యానికీ నిదర్శనం. రెండో సగంలో తను అంతగా రాణించలేకపోవడానికి కారణం సమంతా సమాలోచించుకోవాలి. వారిద్దరికీ మించి ఈ చిత్రం సుదీప్‍ది. మొత్తం చిత్రమంతా అతడే కనిపిస్తాడు. సహజంగా అనిపించకపోయినా, కాస్త అతిగా కూడా ఉన్నప్పటికీ అతడి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ముందుముందు ఈ చిత్రానికి విభిన్నమైన నటన ప్రదర్శిస్తేనే ఇతడికి భవిష్యత్తు ఉంటుంది. మిగతా నటీనటులు తమ పాత్రలకు అతికినట్లు సరిపోయారు. ఐతే నటుల్ని మించి గ్రాఫిక్స్ ఈ చిత్రానికి ప్రత్యేక అలంకారం. ఒక ఈగ చేత ఎన్ని విన్యాసాలు చేయించొచ్చో ఊహించగలిగిన దర్శకుడికి జోహారు.

మాటలు ప్రతిభావంతం. పాటలు చిత్రంలో కలిసిపోయాయి. కీరవాణి సంగీతం – సమ్ గీతాలకే కాక నేపధ్యానికీ ప్రత్యేక శోభనిచ్చింది. ఈ చిత్రంలో సాంకేతిక నిపుణులందరికీ అభివందనాలు చెప్పాలి.

ఆద్యంతం రసవత్తరం. కొన్నిచోట్ల నవ్విస్తుంది. కొన్నిచోట్ల కంటతడి పెట్టిస్తుంది. కొన్నిచోట్ల వళ్లు గగుర్పొడుస్తుంది. మొత్తంమీద ప్రేక్షకుడు థియేటర్ నుంచి సంతృప్తిగా బయటకు వస్తాడు. ఈగ చిత్రానికి పూర్తి ఘనత నిస్సందేహంగా దర్శకుడు రాజమౌళిది. అతడికి ప్రత్యేక అభివందనాలు.

చాలా బాగున్న ఈ చిత్రానికి మరో రెండు అంశాలు జతపడితే బాగుండేదని స్వాభిప్రాయం. ఒకటి – ఈ చిత్రం చివరలో ఈగ – చిరంజీవి, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ పాటలను అనుకరిస్తూ రీమిక్స్ డాన్సులు చేస్తుంది. అది కేవలం వినోదానికి పెట్టినట్లుంది. క్లైమాక్స్ లో సుదీప్ ఈగకి రెక్కలు కత్తిరించి వేధించే సీన్ ముందు – (షోలే చిత్రంలో అంజాద్ ఖాన్ హేమమాలినిచేత చేయించినట్లు) ఈగచేత బలవంతంగా డాన్స్ చేయించి ఉంటే – ఆ డాన్సులు కథలోనూ కలిసేవి. వినోదానికి వినోదమూనూ.

రెండు – కరకు కసాయి విలన్‍గా, సీమ బాంబులమధ్య నడిచిన మర్యాదరామన్న చిత్రంలో కూడా గొప్ప సందేశం ఇమిడ్చిన రాజమౌళి ఈ చిత్రంలోనూ అంతర్లీనంగా సందేశంకోసం ప్రయత్నించాల్సింది. వాల్ట్ డిస్నీ చిత్రాలు, ఇటీవలి నీమో కూడా యానిమేషన్ లోనూ సందేశవంతం. ఈగ మాత్రం కేవలం వినోదం అనిపించింది.

ఏదిఏమైనా ఈగ తో రాజమౌళి తన అభిమానుల్ని ఆరాధకులుగా మార్చుకున్నాడని ఒప్పుకోక తప్పదు. అతడినించి మరో గొప్ప ఒరిజినల్ చిత్రం కోసం ఎదురుచూద్దాం.

Exit mobile version