ఆగస్ట్ 21, 2012

అంతర్జాతీయ చిత్రకారుడు శ్రీ కాపు రాజయ్యకు అక్షర నీరాజనం!

Posted in శాస్త్రీయం at 6:12 సా. by వసుంధర

ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారుడు, కళారత్న అవార్డు గ్రహీత శ్రీ కాపు రాజయ్య 20-08-2012 న సిద్ధిపేటలో తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1993లో కళాప్రవీణ, 1997లో కళావిభూషణ్, 2000లో హంస, 2007లో లలిత కళారత్న అవార్డులు  అందుకున్నారాయన. సిద్దిపేటలో జన్మించిన రాజయ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా తన చిత్రాలద్వారా ఎన్నో అవార్డులందుకున్న రాజయ్య సిద్దిపేటను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రాజయ్య చిత్రాలను పార్లమెంటు, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, సాలార్ జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లోని లలితకళా అకాడమిలో ప్రదర్శనకు ఉంచారు. సిద్దిపేటలో ఓ కళా పరిషత్ ను  కూడా శ్రీ రాజయ్య  స్థాపించారు. ఆధునిక చిత్రకళలో తెలంగాణ గ్రామీణ జీవితానికి కాపు రాజయ్య చిత్రం ప్రతిబింబం అయ్యింది. బీద కుటుంబంబంలో ఇద్దరు అక్కలకు తమ్ముడిగా చిన్న వ్యాపారస్తుడైన శ్రీ రాఘవులుకు 1925 ఏప్రిల్ 6వ తేదీన సిద్ధిపేటలో జన్మించిన రాజయ్య లలితకళా అకాడెమీ అవార్డు గ్రహీతగా జాతీయ స్థాయి చిత్రకారుడిగా ప్రఖ్యాతి చెందారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో దిక్కుతోచని కుటుంబాన్ని తండ్రి స్నేహితుడు శ్రీ చంద్రయ్యగౌడ్ ఆదుకున్నాడని రాజయ్య తన జీవితాంతం గుర్తు చేసుకునేవారు. కాపు రాజయ్య జీవితంతో పోరాటం చేసి కళాకారుడయ్యారు. తనకు ఇష్టమైన చిత్రకళలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. ప్రపంచీకరణ నేపధ్యంలో పల్లె జీవితం చెరిగిపోకుండా, గుర్తుండేటట్లు, తన కుంచెతో తెలంగాణా పల్లె జీవనానికి ప్రాణంపోసిన చేయితిరిగిన చిత్రకారుడు శ్రీ రాజయ్య. ఈయన చిత్రాలు ముందు తరాలవారికి, తెలంగాణా పల్లె జీవితాన్ని,సంస్కృతిని  మరచిపోకుండా చేస్తాయి అని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.రేఖా చిత్రాలతో,మనసును ఆకట్టుకునే రంగులతో ఈయన చిత్రాలు మురిపిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో చిత్రకళను అభ్యసించిన శ్రీ  రాజయ్య దక్షిణాది ప్రాంతాలన్నిటినీ తిరిగి అన్నిరకాల చిత్రకళారీతులను పరిశీలించి, తనదైన సొంత బాణీని ఏర్పరుచుకున్నారు. తక్కువ గీతలలో ఎక్కువ అర్ధం వచ్చేటట్లుగా ఆయన చిత్రాలు ఉంటాయి. లండన్ నుంచి వెలువడే ‘స్టుడియో’ అనే పత్రిక రాజయ్య వర్ణచిత్రాన్ని ప్రచురించుకుని నీరాజనం పలికింది. ఆయన కళానైపుణ్యాన్ని  ప్రతిబింబించే ఈ క్రింది చిత్రాలను పరిశీలించండి.

శ్రీ రాజయ్య మరణించలేదు.ఆయన చిత్రాలలో చిరంజీవిగా నిలిచిపోయారు.

శ్రీ రాజయ్యకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించుదాం!

                                                                                టీవిఎస్ శాస్త్రి

1 వ్యాఖ్య »

  1. చక్కని వ్యాసం. చాల విషయాలున్నాయి… ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: