Site icon వసుంధర అక్షరజాలం

జులాయి – చిత్రసమీక్ష

తెలివి రెండు రకాలు. ఒకటి మానసికంగా ఎదగడానికీ, సమాజ శ్రేయస్సుకి ఉపయోగించే జ్ఞాన విజ్ఞాన వికాసానికీ ఉపయోగపడుతుంది. రెండు అడ్డదారులు పట్టడానికి ప్రోత్సహిస్తుంది. ఈ రెండవ తెగలో మళ్లీ రెండు రకాలు. ఒకటి నేరాలకు ప్రోత్సహించేది. ఆ నేరాల పరిధి చిన్న దొంగతనాలనుంచి, తీవ్రవాదం దాకా ఉండొచ్చు. బిట్టు (సోనూ సూద్) ఈ రకం. రెండు చట్టం పరిధిలోనే సమాజానికి హాని చేసే అడ్డదార్లు. రవీందర్ నారాయణ (అల్లు అర్జున్) ఈ రకం. వీరిద్దరి ఎత్తులూ పై ఎత్తులే 2012 ఆగస్ట్ 9న విడుదలైన జులాయి చిత్రం.

ఒక బ్యాంకులో ఎందరో సామాన్యులు దాచుకున్న డబ్బు 1500 కోట్లు దాకా చేరింది. అది కాజేయడానికి ఓ పెద్ద మనిషి (కోట శ్రీనివాసరావు) నియోగించిన వ్యక్తి బిట్టు. అతగాడు తన అనుచరులతో బ్యాంకు దోపిడికి బయల్దేరడంతో కథ మొదలు. బెట్టింగులో రాత్రికి రాత్రి లక్షలార్జించాలని బయల్దేరిన రవి, అనుకోకుండా ఆ బ్యాంకు దోపిడిని పసికట్టడం కథకి తొలి మలుపు. బిట్టు, రవిల సంఘర్షణ కథకి నడక. ఈ మధ్యలో అర్థవంతంగా ఇమిడిన మధు (ఇలియానా) పాత్ర కథనానికి అందం, చందం.  ఇద్దరు తెలివైనవాళ్ల ఈ పోరాటంలో ఆసక్తికరమైన ఎన్నో మలుపులు. చివరికి దర్శకుడి దృష్టిలో న్యాయం, ధర్మం అనుకున్నవి విజయం సాధించడం కథకి ముగింపు. అత్యాశకి పోకుండా, అడ్డదార్లు తొక్కకుండా ఉన్నదానితో తృప్తిపడి ప్రశాంతంగా జీవించండి – అన్నది ఈ చిత్రం ఇచ్చే సందేశమని నమ్మించే ప్రయత్నం చెయ్యడం కొసమెరుపు. ఆ సందేశంలో చిత్తశుద్ధి ఉంటే ఈ చిత్రాన్ని దర్శకుడు ఇలా కాక మరోలా రూపొందించి ఉండేవాడని గ్రహించేందుకు – ఈ చిత్రంలో హీరో, విలన్లకున్నంత తెలివి అవసరం లేదు. సగటు తెలివి చాలు.

ఈ చిత్రానికి వన్నె తెచ్చినవాడు అల్లు అర్జున్. భాష, ఉచ్చారణలో హుందాతనం లేకపోయినా – ఆ లోటుని అభినయంతో, డైలాగ్సులో టైమింగుతో కప్పిపుచ్చగలగడం విశేషం. ఇక అడుగులు, కదలికలు, నృత్యాలు – అతడికి అభిమానులు కానివారిని కూడా మెప్పిస్తాయి. ఈ విషయమై ప్రస్తుతం తెలుగు చలన చిత్రసీమలో అతడికి సాటి రాగలవారు లేరనిపిస్తుంది. తెలుగువాడు కాదు కాబట్టి సోనూ సూద్ భాష, ఉచ్చారణ గురించి ఎవరూ ఎలాగూ పట్టించుకోరు. విలన్ కాబట్టి నృత్యాలుండవు. మరి ఇతరత్రా అన్నివిధాలా హీరోకి దీటు వచ్చాడు సోనూ సూద్. ఇలియానా నటిగా కాక ఆకర్షణిగా ఎన్నుకోబడిందని అర్థమౌతుంది కానీ – వంటి మిసమిస కాస్త తగ్గింది. ముఖం కాస్త కళ తప్పింది. గత చిత్రాలు తెలియనివారికైతే ఈ అమ్మాయినెందుకు తీసుకున్నారూ అనిపించేలా ఉంది. కోట పాత్ర చాలా చిన్నది. తనికెళ్ల, బ్రహ్మానందం, ఎమ్మెస్, హేమ ప్రభృతులు ఏ సినిమా ఐనా తమకొకటే అనిపించే పాత్రలకు న్యాయం చేకూర్చారు.  బ్రహ్మాజీ నటుడిగా వైవిధ్యాన్ని ప్రదర్శించడాన్ని కొనసాగించాడు. రావు రమేష్ తెలుగు తెరకు మరో మంచి నటుడిగా ఎదుగుతున్నాడు. ప్రత్యేక పాత్రలో రాజేంద్రప్రసాద్ ఒక తరహా కామెడీలో తనకి తనే సాటి అనిపించుకున్నాడు. ఐతే పోలీసు శాఖలో ఒక ఉన్నతాధికారి ఆయనకిలా కమేడియన్‍లా ఉంటే అది ఆ శాఖకి తీరని అవమానం.  గబ్బర్‍సింగ్ చిత్రంలో పోలీసు అధికారిగా పవన్ వేసుకున్న డ్రస్ గురించి గొడవ చేసిన పోలీసు సంఘాలు – ఈ పాత్ర గురించి మాటవరసకైనా అభ్యంతరం చెప్పకపోవడాన్నిబట్టి – రెండు అనుమానాలొస్తాయి. ఒకటి – మన పోలీసు ఉన్నతాధికారులు ఈ చిత్రంలో లాగే ఉంటున్నారా? రెండు – పోలీసు సంఘాలు పాత్ర దుస్తులకే తప్ప, చిత్రణకు ప్రాధాన్యమివ్వవా? ఏది ఏమైనా హాస్యం పేరిట ఈ తరహా పాత్రచిత్రణ కనీసం ఐపిఎస్ లకి తగదు.

కథలో సోనూ సూద్ అనుచరిణి మూగ, చెవుడు కావడం కథనానికి కొత్త ఆకర్షణ. ఇది ఏ విదేశీ చిత్రంనుంచీ సంగ్రహించి ఉండకపోతే దర్శకుడు అభినందనీయుడు. బ్యాంకు దోపిడీ వంటి కొన్ని సన్నివేశాలకు మూలాలు ఉన్నాయని కొందరు సినీ పండితులు అంటున్నారు.    

పాటల చిత్రీకరణ గొప్పగా ఉంది. కొంత కోరియోగ్రఫీ, కొంత ఫొటోగ్రఫీ, కొంత అర్జునోగ్రఫీ. మాటల్లో ఒరేయ్, ఒసేయ్ వగైరా సంబోధనలు ప్రధానం కావడం ఇటీవల హెచ్చయింది. అది హుందాగా ఉండదనీ, అనుసరణీయం కాదనీ సినిమా వారు గ్రహించాలి. ఈ చిత్రంలో ఒసేయ్ ఒసేయ్ అన్న పాట హీరో ఉదాత్తతకీ, హీరోయిన్ మర్యాదకీ కూడా భంగకరం. ఆధునికత కొత్త పుంతలు తొక్కాలనుకుంటే మరింత మెరుగైన మార్గాలు ఎంచుకోవడం బాగుంటుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం లయబద్ధంగా, హుషారుగా ఉంది. పాటలన్నీవినడానికి బాగున్నా, చిత్రం నడిచినంతకాలం మాత్రమే గుర్తుండొచ్చు.

కథనం వేగంగా, గొప్పగా ఉంది. క్లైమాక్స్‍లో ఉత్కంఠలో హాస్యాన్ని జోడించిన విధం ప్రతిభావంతం. ఆద్యంతం అర్థవంతమైన సస్పెన్సు.  చూస్తూండగా విసుగు పుట్టదు. చూసేక ఎందుకు చూశామా అనిపించదు. కథ (ఉంటే?!) మాత్రం  అసంతృప్తికరం. ఈ చిత్రంలో హీరో తెలివిలో, చాతుర్యంలో, సమయస్ఫూర్తిలో, ఫైట్స్‍లో తనకి తనే సాటి. కానీ డబ్బు సంపాదనకు మార్గాన్నెంచుకోవడంలో అవేమీ సహకరించలేదు. అదిప్పుడు మనదేశంలో నడుస్తున్నచరిత్రగా కొంతవరకూ చెప్పుకోవచ్చు.  ఆ కోణంలో ఈ చిత్రాన్ని తియ్యవచ్చు. బ్యాంకు దోపిడికంటే ఘోరంగా – బ్యాంకుల పేరిట సామాన్యుల డబ్బుని దోచుకుంటున్న అంశం ఈ చిత్రంలో ప్రస్తావించబడడం విశేషం. ఐతే హృదయాల్ని కదిలించేలా కాక, కేవలం కథకో ఊతగా ఆ అంశం స్పృశించబడింది. సామాజిక సమస్యలపట్ల సినీ దర్శకులు ప్రదర్శించే ఈ నిర్లిప్తత దురదృష్టకరం. దర్శకుడు ఈ చిత్రాన్ని కేవలం అల్లు అర్జున్ కోసం తీసినట్లు అనిపిస్తుంది. అందుకే కథనం బాగున్నా, కథలో పస లేదు. మాటల్లో తెలివి ఉన్నా, లోతు లేదు. హీరోకి ప్రాధాన్యమున్నా, హీరో కోసమే తీసినట్లు అనిపించని పోకిరి, అతడు (ఇది త్రివిక్రమ్ చిత్రమే!) వంటి చిత్రాల్ని – కనీసం త్రివిక్రమ్ వంటి ప్రతిభావంతులు, మేధావులు ఆదర్శంగా తీసుకోవాలి. లేకుంటే వారి ప్రతిభ బాక్సాఫీసుకి అడ్డదారి ఔతుంది. ఆ విధంగా ఈ చిత్రదర్శకుణ్ణి జులాయి అనవచ్చు. ఈ చిత్రంలో సందేశం ఆయనకే! అదాయనపై ఎంత ప్రభావం చూపిందో ఆయన తదుపరి చిత్రాలు చెబుతాయి. ఈ చిత్రం ఘనవిజయం సాధించినప్పటికీ, దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి ‘అతడు’ మళ్లీ మళ్లీ ‘జులాయి’ కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడనే ఆశ!

Exit mobile version