సెప్టెంబర్ 11, 2012

దేవుడు చేసిన మనుషులు – చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 11:15 ఉద. by వసుంధర

‘నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది’ అంటాడు గబ్బర్ సింగ్‍ చిత్రంలో పవన్ కల్యాణ్. ‘నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికే లెక్కా లేదు’ అని తన గురించి నిరూపించుకున్నాడు ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో పూరీ జగన్నాథ్. అదెలాగో తెలుసుకుందుకు ఈ ఆగస్ట్ 15న ఆ చిత్రాన్ని తెలుగు నాట థియేటర్లలో వదిలాడు.

పోకిరిగా, బిజినెస్‍మాన్‍గా మహేష్‍బాబుతో రాణించిన పూరీ జగన్నాథ్, రవితేజతో మాత్రం నేనింతే అనిపించుకోవాలనే ఈ చిత్రం తీసినట్లు తోస్తుంది.

‘దేవుడున్నాడని మనస్ఫూర్తిగా నమ్మి ఈ చిత్రం చూస్తే మీకే సందేహాలూ రావు’ అంటుంది చిత్రం ఆరంభంలో ఓ నేపధ్య కంఠం. వినోదాన్ని ఆశించి ఈ చిత్రానికి వెళ్లినవారిలో అంతవరకూ దేవుడున్నాడని మనస్ఫూర్తిగా నమ్మినవారికి కూడా దేవుడున్నాడా అన్న అనుమానం కలుగుతుంది. 

చిత్రం వైకుంఠంలో లక్ష్మీనారాయణులతో మొదలౌతుంది. ఆ పాత్రల్లో ఎన్టీఆర్, అంజలి వంటి అద్భుత రూపాలకి అలవాటుపడ్డ జనాలకి – బ్రహ్మానందం, కోవై సరళ ఆ పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రంలో హాస్యం అపహాస్యం కానున్నదని పూరీ ముందుగా చేసిన హెచ్చరిక అది.

ఇండియాలో రవితేజకి సెటిల్మెంట్లు బ్రతుకుతెరువు. బాంగ్‍కాక్‍లో ఇలియానా ఓ కారు డ్రైవర్. వీళ్లిద్దర్నీ కలపడానికి పనిలేని పాపన్న ఎమ్మెస్ నారాయణ విసిరిన అరటిపండు తొక్క ఎలా దారి తీసిందో విశ్రాంతికి ముందు కథ. మళ్లీ కథని మొదటికి తెచ్చి, ఎమ్మెస్ ఆ తొక్క విసరకపోతే ఏం జరుగుతుందో చెబుతుంది ఆ తర్వాతి కథ. అందువల్ల భాషా సంస్కారం ఉన్నవాళ్లు కూడా దీన్ని ‘తొక్కలో కథ’ అనుకుంటే అది అసహజం కాకపోవచ్చు.

కొత్తదనం కోసం, విలన్ ప్రకాష్‍రాజ్‍ పాత్రని, మతిమరుపు హాస్యగాడిగా రూపొందించడం వెనుక తగిన హోంవర్క్ జరుగలేదనిపిస్తుంది. అటు నవ్వూ, ఇటు భయమూ కలిగించని ఆ పాత్ర ప్రేక్షకులను అమితంగా నిరాశ పరుస్తుంది.

నటీనటుల్ని తీసుకుంటే – రవితేజ విసుగనిపించాడు. అదే డైలాగ్ డెలివరీ, అవే కదలికలు. నటుడిగా ఎదగడం సంగతటుంచి, హీరో అంటే మాస్ మహారాజావంటి బిరుదుల్ని తగిలించుకోవడంలోనే కాక, నటనని కూడా ప్రదర్శించాల్సి ఉంటుందని మర్చిపోయాడనిపిస్తుంది. ఒక సీన్లో అతడు హీరోయిన్‍ని ముద్దు పెట్టుకున్నాక ఆ అనుభూతిని ప్రేక్షకుల ముందు ప్రదర్శించడానికి పెదాలు చప్పరించి గుటకలు వెయ్యడం అత్యంత జుగుప్సాకరంగా ఉంది. కొంత దర్శకకృతం, కొంత స్వయంకృతం – ఈ చిత్రానికి అతణ్ణి మైనస్ చేశాయి.

ఆశ్చర్యంగా ఈ చిత్రం తొలి భాగంలో ఇలియానా కారు డ్రైవరుగా మెరుగైన నటన ప్రదర్శించింది. అందం, సొగసుల్లో వన్నె తగ్గడంవల్ల – పాటల్లోనూ, గ్లామర్ కోసం తాపత్రయంలోనూ మాత్రం ఈ చిత్రానికి ఆమె మైనస్సే అయింది.  ‍

విలన్‍గా ప్రకాష్‍రాజ్, కమేడియన్స్‍గా బ్రహ్మానందం, ఆలీ, కోవై సరళ ఈ చిత్రానికి మరొకొన్ని మైనస్‍లు. స్వయంగా లక్ష్మీదేవి తలచుకున్నా, దురదృష్టవంతుణ్ణి బాగు చెయ్యలేదన్న పాత (పిల్లల) కథని ఉపయోగించుకున్న తీరు భావదారిద్ర్యానికి నిదర్శనం. అలాగే దేవుడా దేవుడా పాటలో ఇలియానా కత్రీనా చిక్‍నీ చమేలేని అనుసరించడం కూడా. ఆలీ లక్ష్మీ స్తోత్రం చేస్తున్నప్పుడు, పటంలో కోవైని లక్ష్మిగా చూపడం ప్రేక్షకుల్ని ముసిముసిగా నవ్విస్తుంది. అన్నీ ఉన్న ప్రకాష్‍రాజ్ మతిమరుపు కారణంగా, తాను జాలరినో, మధ్యతరగతి పేదవాడినో అనుకున్న దృశ్యాలూ బాగున్నాయి.  ఆ తరహా సృజనాత్మకత చిత్రం పొడవునా ఉంటే బాగుండేది.

నటుడు సుబ్బరాజుని చూస్తే జాలేస్తుంది. అతడిది చక్కని విగ్రహం, ఫరవాలేదనిపించే హావభావాలు, దోషం లేని ఉచ్చారణ. ఇంచుమించుగా ప్రతి చిత్రంలోనూ ఈ మూడింటినీ సక్రమంగా ఉపయోగించే పాత్రలతడికి కరువౌతున్నాయి. ఈ చిత్రంలోనూ అదే జరిగింది. బ్రహ్మాజీ తను మంచి నటుణ్ణని మరోసారి ఋజువు చేసుకున్నాడు. ఎమ్మెస్‍ది ‘తొక్క’ పాత్ర.   

ఈ చిత్రంలో కుంచె రఘు అందించిన గీతాలు కొత్త పాటల లయనీ, పాత పాటల మాధుర్యాన్నీ నింపుకుని వీనులకు విందు చేశాయి. కనులకు విందు చేసేలా ఉండకపోవడం, ముఖ్యంగా ఇది పూరీ చిత్రం కావడంవల్ల, ఆశ్చర్యమే! ‘డిస్టర్బ్ చేత్తన్నాడే’ పాటలో – ఆడిన బ్రెజిలియన్ తార గాబ్రియేలా కంటే, పాడిన సుచిత్ర గొంతు డిస్టర్బ్ చేస్తూ చాలాకాలం వెంటాడుతుంది.  ఈ చిత్రానికి ప్లస్ పాటలే!

నిజానికీ చిత్రం కథ పరంగా ఓ కొత్త ప్రయోగం. అందుకని ఆరంభం, నడక కొత్తగా అనిపించి, విశ్రాంతిదాకా కాస్త విసుగనిపించినా కూడా, కొంత ఆసక్తినీ కొంత ఆశనీ కలిగిస్తుంది. రెండో సగంవల్ల మొదటి సగమూ నిరర్థకంగా అనిపిస్తుంది. ఈ చిత్రానికి అసలు సిసలు మైనస్ పూరీ స్క్రీన్‍ప్లే, దర్శకత్వం.

సినీ సాహితీ జ్ఞానం అంటే హాలీవుడ్ చిత్రాలు, దేశంలో ఇతర భాషా చిత్రాలు చూడ్దం ద్వారానూ, ఆంగ్ల సాహిత్యం చదవడం ద్వారానూ లభిస్తుందని మన సినీప్రాజ్ఞులు భావిస్తారు. తెలుగు సాహిత్యం క్షుణ్ణంగా చదవడం, సమకాలీన తెలుగు సాహిత్యంతో పూర్తి టచ్‍లో ఉండడం, కథల చర్చలో వందిమాగధులకు కాక సాహితీపరులకు ప్రాధాన్యమివ్వడం వారి ఎదుగుదలకు దోహదం చేస్తుంది. అందువల్ల జయాపజయాలతో నిమిత్తం లేకుండా, చిత్రాలకి ఓ స్థాయి అంటూ ఉంటుంది. లేకుంటే ఒరిస్సాలోని పూరీ జగన్నాథుడు దేవుడుగా చేసిన మనుషులకీ, మన పూరీ జగన్నాథ్ చేసిన ‘దేవుడు చేసిన మనుషులు’కీ ఉన్న ఈ అంతరం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.  

Leave a Reply

%d bloggers like this: