సెప్టెంబర్ 14, 2012

తెలుగు బిడ్డ పైడిమర్రి సుబ్బారావు ప్రతిజ్ఞకు యాబై ఏళ్లు

Posted in సాంఘికం-రాజకీయాలు at 12:23 సా. by వసుంధర

అనాదిగా ఇది వేదభూమి. కానీ వేదాలు వ్రాసినవారికి ఋషులుగానే తప్ప పేర్లతో సరైన గుర్తింపు లేదు. అది ఆయా ఋషుల నిర్ణయం కావచ్చు.

1947 ఆగస్ట్ 15నుంచి ఇది అఖండ స్వతంత్ర భారతం. వ్రాసిన ప్రతి చిన్న అక్షరానికీ, అది నిరర్థకమైనా గుర్తింపు కోరే కుహనా రచయితలు అఖండంగా వెలిగిపోవాలనుకునే కొత్త సంప్రదాయం కూడా అప్పుడే ప్రారంభమైంది. అలాంటి గంజాయివనంలో తులసిమొక్కలూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి గుర్తింపు వస్తుంది. అన్నింటికీ గుర్తింపు రావడం జాతికి ఆరోగ్యమూ, మహాభాగ్యమూనూ.

శ్రీ పైడిమర్రి సుబ్బారావు అలాంటి ఋషి. 1962లో చైనా యుద్ధానంతరం ఆయన జాతిలో దేశభక్తి నింపడానికి సంకల్పిస్తే, వేదమంత్రంలా శక్తిమంతమై జాతిని ప్రభావితం చెయ్యగల ‘భారత దేశము నా మాతృభూమి’ అన్న ప్రతిజ్ఞ ఆయన కలంనుంచీ జాలువారింది. అది రేపటి పౌరులనోట బడిబడిలోనూ నేటికీ ప్రతిధ్వనిస్తోంది. తెలుగునుంచి ఆంగ్లంలోకీ, ఇతర జాతీయభాషల్లోకీ అనువదించబడి దేశంలో బడిబడినీ ప్రభావితం చేసింది. యాబై సంవత్సరాలుగా భావిపౌరుల్ని ఉత్తేజపరుస్తున్న ఆ దివ్యాక్షరాల ప్రతిజ్ఞాపాలకులకి, ఆ భావోద్భవం గురించి తెలియదు. ‘మా తెలుగుతల్లికి మల్లె పూదండలిచ్చిన’ శంకరంబాడి సుందరాచారినీ, జాతీయపతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకీ తగిన గుర్తింపునివ్వకపోవడాన్నిభరించే మన సహనశీలత – నేడు కులం, మతం, భాష, యాస పేరిట తీవ్ర అసహనానికి గురౌతున్న దౌర్భాగ్యంలో ఉన్నాం. అన్ని వివక్షలకూ అతీతంగా స్పందిస్తూ, ‘భారత దేశము నా మాతృభూమి’ అని ప్రబోధించిన శ్రీ పైడిమర్రి సుబ్బారావు స్ఫూర్తి ఆ దౌర్భాగ్యంనుంచి మనల్ని బయట పడేయగలదు. ఆయన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన పేరుకు ప్రాచుర్యం కలిగించడం మనకు ఆరోగ్యమూ, మహా భాగ్యమూ. ఆయన పుట్టింది తెలంగాణలో, పెరిగింది తెలుగువాడిగా, భావించింది భారతీయుడిగా. ఆ మహనీయుణ్ణి ప్రాంతీయతాభావంతో కాక ఆయన ఫ్రతిజ్ఞ స్ఫూర్తితో సంస్మరిద్దాం. సంస్మరిస్తూనే ఉందాం.

వారి కుమారుడు శ్రీ పివి సుబ్రహ్మణ్యం స్పందన (నమస్తే తెలంగాణలో ప్రచురితం)  పైడిమర్రి సుబ్బారావు పుస్తకావిష్కరణ  సూర్య స్పందన

Leave a Reply

%d bloggers like this: