Site icon వసుంధర అక్షరజాలం

షిరిది సాయి- చిత్ర సమీక్ష

1970లలో దర్శకుడు కె. రాఘవేంద్రరావు అనగానే జ్యోతి, కల్పన, ఆమెకథ వంటి లో-బడ్జెట్ చిత్రాల అద్భుత రూపశిల్పిగా గుర్తొస్తారు. హై-బడ్జెట్‍తో అమరదీపం చిత్రం తీసినా- కథ, కథనంలో సృజనాత్మకత కంటే మూసను అనుసరించినట్లే కనిపిస్తుంది. ఐతే వ్యాపారాత్మకంగా విజయవంతమైన ఆ చిత్రం కూడా విలువలకు ప్రాధాన్యమిచ్చి కళాత్మకంగా రూపొందడం గమనార్హం. 1977లో ఆయన రూటు మార్చి ఎన్టీఆర్‍తో అడవిరాముడు చిత్రం తీశారు. అప్పట్మించీ రాఘవేంద్రరావు అంటేనే జనాకర్షక వ్యాపార చిత్రాల దర్శకేంద్రుడిగా పేరుపడ్డారు. అప్పట్నించీ ఆయన చిత్రాలు నిర్మాతలకు కాసుల వర్షాన్నీ, ప్రేక్షకులకు సరస వినోద కాలక్షేపాన్నీ, నటీనటులకు ప్రేక్షకుల్లో క్రేజ్‍నీ, ఆయనకు తనదనే ఓ విలక్షణ, ప్రత్యేక ముద్రనీ ఇవ్వడం మామూలైంది. కానీ ఆరంభంలో ఆయన ప్రతిభ రుచి చూసినవారికి మాత్రం అప్పుడప్పుడైనా కళాతపస్వి తీసిన చిత్రాలలంటివి తియ్యడంలేదన్న అసంతృప్తి తప్పనిసరి. భక్తి పేరిట ఆయన తీసిన అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు- కూడా వ్యాపారాత్మకమే తప్ప కళాత్మకం అనిపించవు. ఐతే వాటిలో మొదటి రెండు చిత్రాలూ- గతంలోని గొప్ప వాగ్గేయకారుల కీర్తనలకు కొత్త ఊపిరి పోసిన మాట తథ్యం.

ఈ నేపధ్యంలో భక్తికే తప్ప రక్తికి అనువు కాని షిరిది సాయి కథని తెరకెక్కించాలని ఆయన సంకల్పించడం ప్రేక్షకుల్లో చెప్పుకోతగ్గ ఆసక్తిని కలిగించింది. తండ్రి నటసామ్రాట్ కాబట్టి తాను యువసామ్రాట్ అనిపించుకున్న నాగార్జునని సాయి పాత్రకు ఎన్నుకున్నారు. ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 6న విడుదలైంది.

చిత్రం టైటిల్స్ కళాత్మకంగా ఉన్నాయి. బాపు బొమ్మలు చిత్రానికి వన్నెలు దిద్దాయి. కీరవాణి పాటలు ఆసక్తికరంగా అనిపించలేదు. కొన్ని పేలవంగా కూడా ఉన్నాయి. ఆయన గొంతు ఈ చిత్రంలో పాటలకు మరీ అంత నప్పినట్లు తోచదు. ఇక కథ-

సాయిబాబాకు మహిమలే తప్ప కథ ఎక్కువ లేదు. కథ కావాలంటే రచయిత, దర్శకుడు బాగా కృషి చెయ్యాలి. ఈ చిత్రంలో అలాంటి కృషి కనపడదు. మహిమల సమాహారం కావడంవల్ల, అమర్ చిత్ర కథ వారి కామిక్ చదువున్నట్లే తప్ప సినిమా చూస్తున్నట్లు అనిపించదు. చిత్రంలో సన్నివేశాలు ఒక పద్ధతిలోకాక, అప్పటికప్పుడు ఏవి గుర్తొస్తే అవి చొప్పించినట్లు అనిపిస్తాయి. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అక్కడక్కడ మెరిసినా మొత్తంమీద పేలవం. ఇక సాయిబాబా విషయానికి వస్తే- మేము విన్నదాన్నిబట్టి ఆయన నిగర్వి. తనను తాను దైవంగా చిత్రించుకోవడంకంటే- మానవసేవకు ప్రాధాన్యమిచ్చిన మహా పురుషుడు. ఈ చిత్రం పొడుగునా ఆయన తాను దేవుడినని చెప్పుకుందుకూ, నిరూపించుకుందుకూ తాపత్రయపడ్డట్లు అనిపిస్తుంది.

అందుకు కారణం నాగార్జున ఇమేజ్ కూడా కావచ్చు. అతడు అన్నమయ్య వేసినా మీసాలుంచుకుని స్టెప్ డాన్సులు చేశాడు. శ్రీరామదాసుగా పొడవు జుత్తును ఉంచుకున్నాడు. వాగ్గేయకారుడి వేషం వేసినా ఉచ్చారణ మెరుగు పర్చుకునే ప్రయత్నం చెయ్యలేదు. అతడి నటన రాణించడానికి మేకప్ ఎక్కువ దోహదం చేసిందనిపించింది. ఈ చిత్రం కోసం అతడు గుండు గీయించుకున్నట్లు విని ఆశ్చర్యం కలిగింది. రూపంలో అచ్చం సాయిబాబాలా అనిపించిన అతగాడు చిత్రంలో ఎక్కువచోట్ల నటనలో నాగార్జునగానే కనిపించాడు. ఒక సందర్భంలో పాటకు స్టెప్స్ కూడా వెయ్యడం- సాయిబాబా వేషానికి ఎబ్బెట్టుగా ఉంది. మిగతా నటీనటులందరూ కూడా ఏకపాత్రాభినయం చేశారు తప్ప మిగతా పాత్రలతో కలవలేకపోయారు. అలా సాయికుమార్, కమలిని, శ్రీహరి, బ్రహ్మానందం ప్రభృతులు తమ పాత్రల్లో రాణించలేదు. శాయాజీ షిందే పాత్ర చిత్రానికి కథని సమకూర్చే ప్రయత్నంలా అనిపిస్తుంది. ఐతే ఆ పాత్ర అటు విలనీకి, ఇటు కామెడీకి కొర కాకుండా పోవడానికి- కారణాలు అతడి, అనుచరబృందంల (ఆలీ, అనంత్) నటన మాత్రమే కాక- దర్శక రచయితలూ కావచ్చు. ఈ చిత్రంపై ఓ మంచి సమీక్షకై , ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఆకట్టుకునే సన్నివేశాలు లేక- కథ, కథనం, పాటలు, మాటలు ఏమీ అలరించక- చూసినవారిని అసంతృప్తికి గురిచేసే చిత్రమిది. లోపం కథది అనుకుందామా అంటే- పాత సాయిబాబా చిత్రం అన్నివిధాలా గొప్పగా ఉన్నట్లు చూసినవారి అంచనా. ఈ చిత్రం హిట్టయితే అది సాయి మహిమ. ఫెయిలైతే- డకౌట్ ఐన తెండూల్కర్‍ తర్వాతి ఇన్నింగ్సులా దర్శకేంద్రుడి విశ్వరూపాన్ని మరోచిత్రాన్ని చూడగలం. సాయి చిత్రానికి అన్నివైపులా పదునే!

Exit mobile version