అక్టోబర్ 4, 2012

సుడిగాడు- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 5:18 సా. by వసుంధర

భారతీయులకు తిండి, గుడ్డ, నీడకు లోటుంది. అది తీర్చడానికి పూర్వం రాజులుండేవారు. వాళ్లు విలాసాలు మరిగి ప్రజల్ని నిర్లక్ష్యం చేశారు. అందుకని మనమిప్పుడు ప్రజాస్వామ్యపద్ధతికి మారి మంత్రుల్ని ఎన్నుకుంటున్నాం. కానీ ఆ మంత్రులూ  విలాసాలు మరిగి ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.

రాజరికంలో రాజు తర్వాత ఆయన కొడుకో, కోడలో, కూతురో, అల్లుడో  సింహాసనం ఎక్కేవారు. కొత్త రాజు వచ్చినప్పుడు పట్టాభిషేకానికి మాత్రమే ప్రజల ధనం ఖర్చయ్యేది. ప్రజాస్వామ్యంలోనూ మంత్రి తర్వాత కొడుకో, కోడలో, కూతురో, అల్లుడో మంత్రులౌతున్నారు. కానీ అందుకు పట్టాభిషేకంతోపాటు ఎన్నికలకని అదనంగా ప్రజాధనం ఖర్చవుతోంది. ఈ భారం ప్రజల్ని దుఃఖితుల్ని చెయ్యకుండా- ఎన్నికలనీ, పాలననీ- తమ మాటలతో, చేష్టలతో వినోదంగా మార్చేశారు మన నాయకులు. భారతీయులకు ప్రజాస్వామ్యం గొప్ప వినోదంగా మారిపోయింది. వారికి కూడు, గుడ్డ, నీడ లేకున్నా మహా సంతోషంగా ఉంటున్నారు. దాంతో వినోదం పేరుచెప్పి పొట్ట పోసుకునేవారికి మనుగడ కష్టమై- నాయకులతో పోటీపడేందుకు వ్యూహాలు పన్నారు. అలా పుట్టుకొచ్చారు సూపర్‍స్టార్లు, రెబెల్‍స్టార్లు, మెగాస్టార్లు, పవర్‍స్టార్లు. మళ్ళీ వాళ్ల వారసులకే ఆయా పదవులు, బిరుదులు. వారు సినిమాతో వినోదాన్నివ్వడానికి బదులు సినిమానే వినోదంగా మార్చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే ఐనా- ఆ విషయాన్నీ వినోదభరితంగా చెప్పాలనుకున్నారు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. అలా పుట్టుకొచ్చాడు సడెన్‍స్టార్ అల్లరి నరేష్ సుడిగాడుగా.

ఈ సంవత్సరం ఆగస్ట్ 24న విడుదలైన ఈ చిత్రంలో- తెరమీద బొమ్మలు కదులుతున్నప్పుడు ఏదో ఒక కథ ఉండాలి కాబట్టి కథ ఉంది. చిత్రం చూసొచ్చాక కథేమిటని అడిగితే చెప్పడం ఎంత ఇబ్బందో చూసినవారికే తెలుస్తుంది. కాబట్టి మేమీ చిత్రకథకు లంకె మాత్రం ఇస్తున్నాం. చదివి ఆనందించండి. నిజానికీ చిత్రం ఎన్నో జోకుల సమాహారం. ఆ జోకుల్లో కొన్ని వివిధ హిట్ చిత్రాలనుంచి సంగ్రహించినవి. కొన్ని ఆయా చిత్రాలు చూసినప్పుడు మనకూ స్పురించి బంధుమిత్ర సపరివారంతో పంచుకునేవి. ఏవీ కొత్తవిగా అనిపించవు. కానీ ఒకే జోక్ మిమిక్రీ ఆర్టిస్టు ఎన్నిసార్లు చెప్పినా నవ్వించగలదు. అలాగే ఈ చిత్రంలో జోక్సన్నీ చిత్రం చూస్తున్నంతసేపూ కడుపుబ్బ నవ్విస్తాయి. మన హిట్ చిత్రాలు, మన హీరోలు మన అభిరుచికి గీటురాళ్లు. తమపై తాము జోకులు వేసుకోగలవారే మహాత్ములని నానుడి. అలా మనమెంత మహాత్ములమో ఈ చిత్రం నిరూపిస్తుంది.

ఏ విషయాన్నయినా కథగా మలచడానికి ప్రతిభ కావాలి. నలుగురికీ తెలిసిన జోకుల్నియథాతథంగా తెరకెక్కెంచడానికి చేతిలో డబ్బు, మనలాంటి ప్రేక్షకులు ఉంటే చాలు. ఆ రెండూ ఈ చిత్రానికి పుష్కలంగా లభించాయి. ఈ చిత్రంలో కథానాయకుడు అల్లరి నరేష్. అతడిది మంచి పెర్సనాలిటీ. హీరోకు పనికిరాడు అనిపించని రూపం. ఎటొచ్చీ నటన అంటే డైలాగ్ టైమింగ్ అనుకునేవరికి మాత్రమే అతడు నటుడు. ఆ మేరకు అతడికీ కమేడియన్ కృష్ణ భగవాన్‍కీ ఉన్న తేడా పాత్రకు ఉన్న నిడివి మాత్రమే అనిపిస్తుంది. ఐతే నరేష్‍ బాడీ లాంగ్వేజ్‍ని బట్టి అతడు ఏదో ఒకరోజున మంచి నటుడు అనిపించుకోగలడనే అనిపిస్తుంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. అతడి చిత్రాల్ని మేము కూడా చాలా ఇష్టంగా చూస్తాం. ఈ చిత్ర కథానాయిక మోనాల్ గజ్జల్ అలంకారప్రాయం. మిగతా నటీనటుల్లో ఏ ఒక్కరి గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లేదు. చాలా విషయాల్లో లంకెలో ఇచ్చిన సమీక్షతో ఏకీభవిస్తున్నాం కాబట్టి వాటిని ప్రస్తావించడం లేదు.

పాటల్లో ప్రత్యేకత లేదు కానీ యాదొంకి బారాత్ మూసలోని పింకీ పింకీ పాంకీ పాట చిత్రీకరణ, టైమింగు బాగా నవ్విస్తాయి. అక్కడక్కడ కొన్నిచోట్ల విసుగనిపించినా- అది అక్కడక్కడ మాత్రమే. చిత్రం పూర్తయ్యాక ఏం చూశాం- అని రవంత అసంతృప్తి లోలిగినా- చూస్తున్నంతసేపూ సరదాగా అనిపించేలా కథనం తొక్కిన దర్శకుడికి అభినందనలు.

మనమెలాంటి చిత్రాల్ని ఆదరిస్తున్నామో, ఎలాంటివారిని హీరోలుగా ఆరాధిస్తున్నామో చెప్పడంవల్ల సుడిగాడు ఒక గొప్ప సందేశాత్మక చిత్రం అనవచ్చు. ఈ చిత్రం సూపర్ హిట్ అయినప్పటికీ, సందేశాలకు మనమెలా స్పందిస్తామో- రానున్న చిత్రాలు, వాటి విజయాలు చెబుతాయి. ఏదిఏమైనా మా నమ్మకం ఏమిటంటే భారతీయులకు తిండి, గుడ్ద, నీడలకు లోటుండొచ్చేమో కానీ, వినోదం మాత్రం పుష్కలంగా కొనసాగుతుందని రాజకీయాలతో పాటు, చలనచిత్రాలూ ధ్రువ పరుస్తూనే ఉంటాయి- ఈ చిత్రం తర్వాత కూడా!

2 వ్యాఖ్యలు »

  1. వెంకి said,

    మీరు online లో చూడమని ఇచ్చిన లింక్ పైరతేడ్ లింక్. గమనించారా ?

    • గమనించి వెంటనే తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇకముందు ఈ విషయమై జాగ్రత్త తీసుకోగలం.


Leave a Reply

%d bloggers like this: