నవంబర్ 3, 2012

అవును- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:13 సా. by వసుంధర

మనిషికి నవ్వుకంటే కూడా భయమంటేనే ఇష్టం. చిన్నతనంలో కూడా నవ్వించే కథలకంటే భయపెట్టే దెయ్యాల కథలమీదే చాలామంది ఎక్కువ ఆసక్తి చూపించడానికి అదే కారణం. భయం పుట్టించే ఆసక్తి మెదడుకి పదునెక్కిస్తుంది. అందుకేనేమో  సినీరంగంలో వినోదాత్మక చిత్రాల్లో భయానక చిత్రాలకి ఓ ప్రత్యేకత ఉంది. ఐతే ఈ భయానక చిత్రాలు రెండు రకాలు. వాటిలో భయంకర రూపాలతో భయపెట్టే చిత్రాలు మనని తాత్కాలికంగా ఉద్వేగానికి గురి చేస్తాయి. మరో రకం చూస్తున్నంతసేపూ భయపెడుతూనే మెదడుకి పదును కూడా పెడతాయి. ప్రముఖ దర్శకుడు రామగోపాలవర్మ ఆదిలో ఆలోచింపజేసే భయానక చిత్రాలు తీసినా, క్రమంగా మొదటి రకం భయానక చిత్రాలకు మారిపోయాడు. ప్రస్తుతం తెలుగులో ఆలోచనాత్మక భయానక చిత్రాలు తీస్తున్న యువ దర్శకుడు రవిబాబు కొత్త చిత్రం అవును ఇటీవలే సెప్టెంబర్ 21 న విడుదలైంది.  

చిత్రసీమలో తెలుగువారు ఆదిలో పురాణ కథల్నీ, కుటుంబ గాథల్నీ ఎక్కువగా ఆదరించారు. ప్రేమ కథలైనా, హాస్యమైనా వీటిలో ఇమడాల్సిందే. వాటిలో దేవుడేనా హీరోగా ఉండేవాడు, లేదా దేవుడిపై నమ్మకానికైనా ప్రాధాన్యముండేది. ఆ తర్వాత కొంతకాలం హీరో ప్రతీకారమే పరమావధిగా వచ్చే సినిమాలకు ఆదరణ మొదలై క్రమంగా దేవుడికి ప్రాధాన్యం తగ్గసాగింది. అది చివరకు హీరోనే దేవుణ్ణి చేసే నేటి స్థాయికి చేరుకుంది. ఇప్పుడు పెద్ద హీరోలతో వచ్చే సినిమాలన్నీ- హీరోవి, హీరో చేత, హీరో కోసం. మేధావులు, ఇంతో అంతో ఆలోచించే శక్తి ఉన్న సామాన్యులు- వాటిని ఎల్లకాలమూ భరించలేరు కానీ- ఎక్కడైనా ఎప్పుడైనా వారి సంఖ్య అల్పమే కదా! నొప్పి తెలియకుండా సామాన్యుణ్ణి దోపిడి చెయ్యడానికి- రాజకీయాల్లో నేతలు, సినిమాల్లో హీరోలు ప్రవేశపెట్టిన వ్యక్తిపూజ నేడు ఇంతై అంతై ఆలోచనాపరుల్ని కూడా సమాజపరంగానూ, వినోదపరంగానూ అణగద్రొక్కుతోంది. సినీరంగంలో ఎక్కువమంది నిర్మాతలు, దర్శకులు- ఈ మార్గాన్నే అనుసరిస్తున్నారు. కొందరు మార్గాన్ని మళ్లించినా- అది మేధావులకు కూడా అగమ్యం అనిపించే కళాత్మక చిత్రమో, సామాన్యులకు కూడా జుగుప్స అనిపించే శృంగార చిత్రమో ఔతోంది. పెద్ద హీరోల చిత్రాలు విసుగనిపించినవారికోసం వ్యాపారాత్మక చిత్రాలు తీసే వారు తక్కువ. వారిలో- ఒక స్థాయికి తగ్గకుండా, తనదంటూ ఒక ముద్ర వేస్తున్న అతి కొద్దిమందిలో యువ దర్శకుడు రవిబాబు ఒకడు. అవును చిత్రం ఆ ముద్రతోనే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ చిత్రంలో దెయ్యం చిత్రం ఆరంభంనుంచీ మనకి కనబడుతూనే ఉంటుంది. దెయ్యమని మనకి ఏ మాత్రం తెలియదు. చివర్లో ఆ విషయం తెలియగానే ఒక్కసారి వళ్లు జలదరిస్తుంది. అలాగే చిత్రం పొడవునా దెయ్యం ఉంటుంది. అది మన కళ్లకి కనబడకుండానే కథలోని పాత్రలతోపాటు మననీ వణికిస్తూంటుంది.

ఈ చిత్రంలో కొన్ని మామూలు సన్నివేశాలు. కొన్ని దెయ్యం సన్నివేశాలు. ఏది ఏదో తెలియక ప్రేక్షకుడిలో ఉత్కంఠని రేకెత్తించిన విధం అద్భుతం.

చిత్రం ఆరంభంలో కథానాయిక మోహినిని పోలీసులు ప్రశ్నించడానికి తీసుకొస్తారు. నీవు నీ భర్త హర్షను కత్తితో అనేకమార్లు పొడిచావా అనడిగితే- అవును- అంటుందామె. ఆశ్చర్యమేమిటంటే ఆమె, హర్ష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికింకా శోభనం కాలేదు. భర్తను పొడిచే సమయానికి కూడా ఆమె- భర్తకోసం తన ప్రాణాలిచ్చేటంతగా  అతణ్ణి ప్రేమిస్తోంది. మరి అమె భర్తను ఎందుకు పొడిచింది?

అది చెప్పడానికి కథ వెనక్కి వెడుతుంది. కథా స్థలం- నేటి మధ్యతరగతి వారు కలలు కనే సదుపాయాలున్న రెండతస్తుల ఇళ్లతో- ఊరికి చివరగా ఓ కాలనీ. అందులో ఓ ఇంట్లో జరిగిందీ కథ. ఆ ఇంట్లో దీపాలు మనిషి దగ్గిరకు రాగానే వాటంతటవే వెలుగుతాయి. దూరం కాగానే వాటంతటవే ఆరిపోతాయి.  చెత్తబుట్ట కూడా మనిషి దగ్గిరకు రాగానే మూత దానంతటదే తెరుచుకుంటుంది. దూరం కాగానే దానంతటదే మూత పడిపోతుంది. ఆ ఇంట్లోకి కొత్తగా దిగారు కొత్తగా పెళ్లయిన మోహిని, హర్ష- అతడి తలిదండ్రులు. అక్కణ్ణించి ఇక ప్రేక్షకులకు బిగువైన సన్నివేశాలతో ఊపిరి సలపదు. ఇంట్లోని సదుపాయాల్ని- ప్రేక్షకుల్ని భయపెట్టడానికి ఉపయోగించుకున్న తీరు గొప్పగా ఉంది. ఉదాహరణకి మోహిని చీకట్లోకి వెళ్ళగానే దీపం వెలుగుతుంది. కాస్త ముందుకి వెళ్లగానే చెత్తబుట్ట మూత తెరుచుకుంటుంది. ఆమె దూరంకాగానే దీపం ఆరిపోయి, చెత్తబుట్ట మూసుకుపోతుంది. మరి కాసేపటికి మళ్లీ దీపం వెలిగి ఆరుతుంది, చెత్తబుట్ట తెరుచుకుని మూసుకుంటుంది- మనిషెవరూ రాకుండానే. అంటే దెయ్యం వచ్చి వెళ్లిందన్నమాట!

ఈ చిత్రం ప్రచారానికి వాడిన పోస్టరులో ఒక ఏనుగు ఒక అమ్మాయిని పట్టుకున్న సన్నివేశముంది. అది చిత్రంలో లేదు. ఒక యువతిని తనకు తెలియని మహా బలవంతమైన శక్తి కనిపించకుండా వేధించడానికిది సింబాలిజం.  చిత్రకారుడు కథలో భావానికి బొమ్మ వేసినట్లు ఈ పోస్టర్ని రూపొందించడం గొప్పగా ఉంది. అలాగే చిత్రం ముగింపు కూడా. సమస్యకు పరిష్కారం తాత్కాలికమే, ముందున్నది ముసళ్ల పండుగ అన్నట్లు సూచించిన ముగింపు- వర్మ చిత్రాల్లోనూ చూస్తాం. అది సీక్వెల్‍కూ అవకాశాన్నిస్తుంది.

ఈ చిత్రంలో పాత్రలు తక్కువ. నటీనటులు కొత్తవారు. అంతా తమతమ పాత్రల్లో ఇమిడిపోయి అత్యంత సహజంగా నడిచారు. సన్నివేశాల బలంమీద నడిచిన ఈ చిత్రానికి స్క్రీన్‍ప్లే అద్భుతం. మాటలు పొందికగా, అర్థవంతంగా, సహజంగా ఉన్నాయి. పాటలు లేకపోవడంతో కథనం ఎక్కడా నీరసపడదు.  నేపధ్య సంగీతం సన్నివేశాలకు అతికింది. ఛాయాగ్రహణం కథనమంత గొప్పగానూ ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి చిత్రం అందించిన నిర్మాతలు అభినందనీయులు.

ఈ చిత్రంవల్ల ప్రయోజనమేమిటీ అనుకోవచ్చు. మరి ఈ రోజుల్లో ఈ చిత్రానికి అయిన ఖర్చు 70 లక్షల లోపేనట. విడుదలైన ౩ రోజుల్లోనే మూడు కోట్లు వసూలు చేసిందిట. మరి ఒక హీరోకి పది కోట్లు, హీరోయిన్‍కి 3-4 కోట్లు ఇచ్చి తీసిన చిత్రాల ప్రయోజనం ఏమిటి? వాటికంటే ఈ చిత్రం ఇచ్చిన వినోదం గొప్పదని వసూళ్లు చెబుతున్నాయి. ఒక చిత్రం మీద అయ్యే ఖర్చుని చివరకు భరించాల్సింది ప్రేక్షకులే కాబట్టి- మమ్మల్ని ఇంతలా ఎందుకు దోపిడి చేస్తున్నారని వారు సినీరంగ ప్రముఖుల్ని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఏదేమైనా నిర్మాణవ్యయం తమ స్వయంకృతమని నిర్మాతలు కూడా గుర్తించాల్సిన సమయం కూడా వచ్చింది. ఇంత తక్కువ వ్యయంలో ఇంత చక్కని చిత్రం తీసిన రవిబాబుకి అభివందనాలు. ఐతే ఈ చిత్రంపై 2000లో వచ్చిన హాలీవుడ్ చిత్రం హాలో మ్యాన్ ప్రభావం ఉన్నదంటున్నారు. ఐతే ఇప్పుడొస్తున్న చిత్రాలు ఏవి ఒరిజినల్ కనుక? చిత్రం బాగుంటే, ఒరిజినల్ గురించి మనకు తెలియకపోతే- అప్పుడు మన వినోదానికి అడ్డేమీ లేదు కదా! ఎటొచ్చీ అప్పుడు రవిబాబుకి అభివందనాలకు బదులు అభినందనలు తెలుపుదాం!

కోటి రూపాయల లోపులో ప్రేక్షకుల ఆదరణకు నోచుకునే వినోదాత్మక తెలుగు చిత్రం సాధ్యమా అనేవారికి సమాధానం- అవును!  

మరో సమీక్ష ఇంకా మరో సమీక్ష

 

Leave a Reply

%d bloggers like this: