నవంబర్ 5, 2012

దేనికైనా రెడీ- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 1:30 సా. by వసుంధర

ఒక సన్మార్గుడు. ఒక దుర్మార్గుడు. ఇద్దరికీ పోరాటం. అధర్మంపై ధర్మం విజయం. ఆదికవి వాల్మీకి మన సినీ ప్రపంచానికి ఇచ్చిన హిట్ ఫార్ములా ఇది. ఈ మూలకథకి తమ సృజనాత్మకతతో కొత్తదనాన్ని ఆపాదించి ఎన్నో మంచి చిత్రాల్ని అందించారు ప్రతిభావంతులైన ఎందరో సినీదర్శకులు. ప్రస్తుతం హిట్టో, ఫట్టో కొత్త ఫార్ములాలని అందించడం కూడా దర్శకులకు ఓ సంప్రదాయంగా మారింది. వాటిలో కథాపరంగా చెప్పుకోతగ్గ కొత్త ఫార్ములాలు గత శతాబ్దంలో కె. విశ్వనాథ్, జంధ్యాల నుంచి వచ్చాయి. ఈ శతాబ్దంలో శ్రీను వైట్ల ఢీ (2007) చిత్రం ఓ కొత్త హిట్ ఫార్ములా కథలకు శ్రీకారం చుట్టింది. రెండు కుటుంబాలు. వారి పెద్దలమధ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాటిలో ఓ కుటుంబంలో ఓ అబ్బాయి, రెండో కుటుంబంలో అమ్మాయిని ప్రేమిస్తాడు. రెండు కుటుంబాలమధ్యా సామరస్యం కుదర్చడం అతడి ధ్యేయం.  అందుకు అతడి చేతిలో పావులుగా ఓ ఇద్దరు కమేడియన్లు. కొద్దిగా రక్తపాతం. ఎక్కువగా హాస్యం. పంచ్ డైలాగ్స్. సమస్యలు శాంతియుతంగా పరిష్కారం కావడం కథకి ముగింపు. ఇదీ ఆ ఫార్ములా. అలా ఢీ వచ్చింది. బిందాస్ వచ్చింది. రెడీ వచ్చింది.  దూకుడు వచ్చింది. కందిరీగ వచ్చింది. ఇంకా చాలానే వచ్చాయి. కొన్నింటికి శ్రీనుయే దర్శకుడు. కొన్నింటికి ఇతరులు.  ఎవరు తీసినా ఎలా తీసినా అన్నీ శ్రీనుకారమే. వాళ్లు తీస్తున్నారు. జనం చూస్తున్నారు.
జనం చూస్తున్నారని ఎప్పుడూ ఒకేలా సినిమా తీసే దర్శకుల ప్రతిభ గుడ్డి కన్నులాంటిది. అది మూసినా తెరచినా కంటికి కొత్తగా కనబడేదేమీ ఉండదు. కానీ ముఖానికి అందం చెడకుండా కాపాడుతుంది కదా! ఈ అక్టోబర్ 24న విడుదలైన దేనికైనా రెడీ చిత్రానికి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం అలాంటిదే.
కథ విషయానికొస్తే- వీర నరసింహ నాయుడి (ప్రభు) చెల్లెలు (సీత) బాషా (సుమన్) అనే ఓ ముస్లింని ప్రేమించి అన్నకి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రియుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. కోపంతో బాషా కాలు నరికేస్తాడు నాయుడు. రెండు కుటుంబాలకీ పూర్తిగా చెడిపోయింది. బాషా కొడుకు సులేమాన్ (విష్ణు) అనుకోకుండా బ్రాహ్మణ వేషంలో నాయుడింటికి యాగం చేయించే నిమిత్తం రావాల్సొస్తుంది. అప్పుడు సులేమాన్ నాయుడు కూతురు షర్మిలని (హన్సిక) ప్రేమిస్తాడు. ఇక ఆ రెండు కుటుంబాల్నీ కలపడం అతడి బాధ్యత. అందుకు మరో విలన్ రుద్రమ నాయుడి (కోట శ్రీనివాసరావు) కౄరత్వాన్ని ఎలా ఉపయోగించుకున్నాడనేది మిగతా కథ.
ఈ చిత్రంలో రాబొయే సన్నివేశాలన్నీ ముందే ఊహకందేస్తాయి. ఐనా ఆసక్తిగానే ఉంటుంది. హాస్యంలో కొత్తదనం లేదు. ఐనా నవ్విస్తుంది. పంచ్ డైలాగ్స్ రొటీన్‍గా అనిపిస్తాయి. ఐనా విసుగనిపించదు. సినిమా చూస్తున్నంతసేపూ చూడాలనే అనిపిస్తుంది. కానీ ఇంకోసారి చూడాలంటే మాత్రం ఆ ఆలొచనే భయం కలిగిస్తుంది.
ఈ చిత్రం నటుడిగా విష్ణుకి మంచి అవకాశం ఇచ్చింది.ముస్లింగా, బ్రాహ్మణుడిగా, ఆధునిక యువకుడిగా మూడు గెటప్స్ ఉన్నాయతడికి. అన్నీ చక్కగా అమిరాయి. మాటల ఉచ్చారణలో కొంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ నటనలో మాత్రం అన్నింటా ఒక్కలాగే ఉండడం ప్రతిభాలోపమే అనొచ్చు. నృత్యాల్లో బాగా కష్టపడ్డట్లు అనిపించినా బాగా చేశాడనే చెప్పాలి. మేకప్‍లోనూ, దుస్తుల్లోనూ- ప్రత్యేకంగా కాక నలుగురిలో ఒకడిగా కనిపించడం అభినందనీయం. ఐనా నలుగురిలోనూ ప్రత్యేకంగా కనిపించాడంటే- ఒడ్డు, పొడుగు, రూపం మెచ్చుకోతగ్గవి. హీరొయిన్‍గా హన్సిక బొద్దుగా, ముద్దుగా, ‘దేనికైనా రెడీ’ టైటిల్ తనకోసమే పెట్టారా అన్నట్లు కనిపించింది. కనిపించడమే నటన అనుకుంటే నటించింది కూడా. సుమన్, ప్రభు తమ పాత్రల్లో హుందాగా ఉన్నారు. సీత తన పాత్రకున్న ప్రాధాన్యానికి తగిన నటన ప్రదర్శించింది. కోట శ్రీనివాసరావు పాత్ర ఆయన ప్రతిభకు న్యాయం చేకూర్చేది కాదు. రొటీన్ పాత్రే ఐనా- బంగార్రాజు పాత్ర బ్రహ్మానందం కారణంగా రాణించింది. ఎమ్మెస్ నారాయణతో సహా మిగతావారి గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. మా పొంగల్ పొట్టేలుతో చేస్తామనే ముస్లిం అమ్మాయిగా నటించిన ఆమె ముచ్చటగా, సహజంగా ఉంది. తింగరి ఇల్లాలిగా సురేఖావాణి ఆ పాత్రకి ప్రత్యేకత నాపాదించింది.
పాటల చిత్రీకరణ గొప్పగా అనిపించదు. కానీ నిన్ను చూడకుండా నేనుండలేనే‘ అన్న పాటలో ప్రతి అక్షరం ప్రేక్షకుణ్ణి చేరగలగడం నేటి సంప్రదాయానికి భిన్నమై, కాస్త సంతోషా న్ని కలిగిస్తుంది. అంతమాత్రాన సాహిత్యం గొప్పగా ఉందని కాదు.
కథ, పాత్రచిత్రణ దర్శకుడి బాధ్యత ఐతే- ఈ చిత్రం ఆ విషయంలో దర్సకత్వం పూర్తి వైఫల్యం చెందింది. నాయుడు బాషా కాలు నరకడం దిద్దుకోలేని తప్పు.  కథ చివరిలో ఆ తప్పు తెలుసుకున్నంత మాత్రాన అది ప్రాయశ్చిత్తం కాదు. హీరోయిన్ తండ్రి కాబట్టి కానీ రాగద్వేషాల పరంగా అది ఏమాత్రమూ ఉదాత్త పాత్ర కాదు. ఈ కథలో ఉదాత్త పాత్ర ముస్లింని పెళ్లాడిన సీతది. కాలు నరికినందుకు మాత్రమే బావపై కొంతకాలం కసి పెట్టుకుని- చివరికి ఆ బావను కూడా క్షమించగలిగిన ముస్లిం సుమన్‍ది. ముస్లింల విషయంలో ఈ చిత్ర దర్సకుడు తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలకు మరో నిదర్శనం- వారి ఏ ఆచారాన్నీ, సంప్రదాయాన్నీ హాస్యానికి ఉపయోగించకపోవడం.
ఈ చిత్రంలో క్షత్రియ కులానికి చెందిన బంగార్రాజు తన కులం పేరు గర్వంగా చెప్పి మీసం మెలేసి- నాయుడు పిలవగానే వణికిపోతూ పరుగెడతాడు. బ్రాహ్మణులు ప్రసాదమనుకుని మాంసం  తిని బాగుందని లొట్టలు వేస్తారు. ఓ బ్రాహ్మణ ఇల్లాలు- ఇంటికొచ్చిన ప్రతి మగాణ్ణీ తన మొగుడిలా ఉన్నావంటుంది. హీరోగా ముస్లిం వేద మంత్రాలు చదవడమే కాక- ఏసు ప్రభువునీ ప్రార్థించి సెక్యులరిజం ప్రదర్శిస్తాడు. వీటిలో కొన్ని సన్నివేశాలు ఓ కులం వారికి మనస్తాపం కలిగించాయి. వారికి మద్దతుగా మంద కృష్ణమాదిగ, తెలంగాణ వాదులు ప్రకటనలు చేశారు.
ప్రస్తుత సమాజంలో ప్రభువుల పాలన ప్రజలకు ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తోంది. ఫలితంగా జనం పరస్పారానుమానాలతో ఆరోపణలు, ఆందోళనలు చేస్తున్నారు. ‘ఆకాశంమీద ఉమ్మేస్తే అది వేసినవాళ్లమీదే పడుతుంది’ అని సరిపెట్టుకోగలవారు అరుద్పుతున్నారు. ఈ సందర్భంలో మహా బలవత్తరమైన సినీ మీడియాకు చెందినవారు జనాన్ని రెచ్చగొట్టే అంశాల విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సిన అగత్యాన్ని కెమేరామన్ గంగతో రాంబాబు, ఎ వుమన్ ఇన్ బ్రాహ్మిణిజం చిత్రాలు సూచిస్తున్నాయి. వాటికీ చిత్రమూ జతపడింది. ఇరు పక్షాలకూ ఆత్మవిమర్శ అవసరం. ఐతే కేవలం పైసా వసూలుకి ‘దేనికైనా రెడీ’ అనే చిత్రానికి ఇంత ప్రాధాన్యం అవసరమా అనేవారూ ఉన్నారు. ఈ వివాదాలు తనకి మేలే చేశాయని విష్ణు పడుతున్న సంబరం చూస్తుంటే- చిత్ర విజయానికి అవే కారణమా అన్న అనుమానమూ కలుగుతుంది. ‘దేనికైనా రెడీ’ అంటే అంతే మరి!
మరో సమీక్ష ఆడియో పాటలు విడియోలో మరో పాట

2 వ్యాఖ్యలు »

 1. TVS SASTRY said,

  దేనికైనా రెడీ!

  ఈ మధ్య పై పేరు గల సినిమా విడుదలైంది.నేను సినిమాలు చూడటం మానేసి చాలా రోజులయ్యింది.సంవత్సరం మొత్తం మీద ఒక పది మంచి (ఒక
  మోస్తరు) సినిమాలు విడుదల అవుతున్నాయేమో .మిగిలినవన్నీ నిస్సందేహంగా చెత్త సినిమాలే!ఈ చెత్త సినిమాలను గురించి పత్రికలు సమీక్షలు (ప్రత్యేకించి సాహితీ విలువలున్న పత్రికలు) ఎందుకు రాస్తున్నాయో నాకు అంతుపట్టదు.’దేనికైనా రెడీ’సినిమాలో అసలు వివాదాస్పద అంశాలు ఏమి ఉన్నాయని,సినిమా చూసిన నా మిత్రుడిని అడిగాను.వాడి మనో భావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.’బ్రాహ్మణకులస్తులను’ చాలా కించపరచే దృశ్యాలు ఆ సినిమాలో వున్నాయని తెలుసుకున్నాను. బ్రాహ్మణ కులస్తులు ఆ సినిమా పట్ల తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు.బ్రాహ్మణులు నిరసన తెలియ చేయటంలో ఏ మాత్రం తప్పు లేదు.వారికి ఆ హక్కు వుంది.ఒక కులం వారిని కించపరిచే దృశ్యాలున్న ఈ సినిమా అసలు (సెన్స్ లేని) సెన్సార్ వారి కత్తెర బారిన పడకుండా విదుల కావటం–అన్ని వ్యవస్థలతో పాటుగా సెన్సార్ వ్యవస్థ కూడా అవినీతిమయమయినదని అనుకోవచ్చు.ఒక్కసారి పూర్వపరాలను పరిశీలించుదాం!నేను పుట్టక ముందు విడుదలైన ‘మాలపిల్ల’ సినిమాలో ఇతివృత్తం-ఒక బ్రాహ్మణ యువకుడు హరిజన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం.70 వ దశకంలో విదులైన శంకరాభరణం,సప్తపది లాంటి సినిమాలు బ్రాహ్మణుల ఔన్నత్యాన్ని,సంస్కరణాభిలాషను తెలియ చేస్తాయి.చారిత్రకంగా పరిశీలించినా–సంస్కరణాభిలాషులలో చాల మంది బ్రాహ్మణ కులానికి చెందిన వారే!వీరేశలింగం పంతులు గారు,గురజాడ వెంకట అప్పారావు గారు,చలం గారు …ఇలా ఒకరేమిటి అనేక మందిని ఉదాహరణగా చెప్పవచ్చు.వారు బ్రాహ్మణ పక్షపాత ధోరణి లేకుండా ఆనాటి బ్రాహ్మణ సమాజంలోని లోపాలను కూడా ఎత్తి చూపించి,వారి ఔన్నత్యాన్ని చాటుకున్నారు.మరి నేడో!అటువంటి బ్రాహ్మణ కులస్తులను హీనంగా చూపించి కొంతమంది నిర్మాతలు వారి కులోన్మాదాన్ని చాటుకుంటున్నారు.నరసింహనాయుడు,సమరసింహారెడ్డి ,ఇంద్రసేనారెడ్డి లాంటి సినిమాలు ఒకటి రెండుకులాల గొప్పతన్నాన్ని చూపించటం కోసం తీసినవే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఆ సినిమాలలోనే బ్రాహ్మణ పాత్రలను వెకిలి హాస్యానికి వాడుకున్నారు.’సీమ శాస్త్రి’ఒక కామెడి!పౌరుషంవున్న పాత్రలు కొన్ని కులాలకే పరిమితం చేసి,మిగిలిన కులాలను,ప్రత్యేకించి బ్రాహ్మణ పాత్రలను పిరికివాళ్ళలాగా,వెకిలి హాస్యానికి వాడుకోవటం అలవాటైంది.దీనికి కారణం-సినీ పరిశ్రమ ఒక కులంవారి గుత్తాధిపత్యంలో ఉండటమే!ఈ రోజు ఆర్ధికంగా,సామాజికంగా వెనుకపడిన వర్గం వారిగా బ్రాహ్మణులు రాజకీయ నాయకుల నిర్లక్ష వైఖరికి కూడా గురౌతున్నారు.దీనికి కారణం-వీరి ఓటు బ్యాంకు గణనీయమైనది కాకపోవటమే!సహనానికి కూడా ఒక హద్దు వుంటుంది. చాలా కాలంగా సహనంగా ఉన్న బ్రాహ్మణుల మనోభావాలు,’దేనికైనా రెడీ’సినిమాలోని దృశ్యాలను చూసిన తరువాత పూర్తిగా గాయపడ్డాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సినిమా ప్రారంభంలో కొబ్బరికాయ కొట్టటం నుండి విడుదలకు ముందు బాక్స్ లకు పూజ చేయటం వరకూ కావలసిన బ్రాహ్మణులను ,సినిమా వాళ్ళ ఇళ్ళల్లో శుభాలకు,అశుభాలకు కావలసిన బ్రాహ్మణులను –సినిమాలలో హీనంగా చూపించే నిర్మాతల నీచసంస్కారానికి పరాకాష్ట’దేనికైనా రెడీ’.వారి నీచసంస్కారానికి చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమైంది.పైగా ఈ రోజు నిర్మాత/నటుడు విష్ణు’బాబు’పత్రికలలో పెద్ద ప్రకటన విడుదల చేసాడు.కనీసం,ఆ ప్రకటనలో బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పకపోవటం మరింత బాధ కలిగించింది.నిరసన తెలియచేయటానికి ఇంటికి వెళ్ళిన బ్రాహ్మణ యువకులపై కిరాయి రౌడీల చేత దాడి చేయించటమే కాకుండా,తన ఇంటికి నిరసన తెలపటానికి వచ్చిన వారు’కిరాయి బ్రాహ్మణులు’అని మోహన్ బాబు అలవాటు ప్రకారం నోరుచేసుకున్నాడు.గాయ పడిన వారిని పరామర్శించాలనే ఇంగిత జ్ఞానంకూడా లేకుండా హేయమైన ప్రకటనలు ఇచ్చి వారి మనో భావాలను మరింత కించపరిచాడు.ఆ సినిమాలో బ్రాహ్మణులకు అభ్యంతరకరంగా వున్న దృశ్యాలను తొలగించి,బ్రాహ్మణ కులస్తులకు క్షమాపణ చెప్పేంతవరకూ బ్రాహ్మణులు విష్ణు’బాబు’ బాబు అయిన మోహన్ బాబు ఇంటిలోజరిగే ఏ కార్యక్రమానికి హాజర్ కాకూడదని బ్రాహ్మణులు తీసుకున్న నిర్ణయం సమంజసమైనదే!దీనితో నైనా ‘కులదురహంకారులకు’బుద్ధి వస్తుందేమో వేచి చూడాలి! ‘జాతి’అంటే అన్ని కులాల,మతాల’ముత్యాల సమాహారం’.ఆ హారాన్నిఎక్కడా తెగకుండా కాపాడుకోవటమే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటే!అలా జరగని పక్షంలో మనం ‘ఏకత్వం’ కోల్పోవటం తధ్యం!

  భవదీయుడు,

  టీవీయస్.శాస్త్రి

  • CS SARMA said,

   I am feeling bad since Maya Bazaar cinema. But nobody including relations, brahmin friends not supported me. If they could have protested during those days, we brahmins might have been in a better position. Cine Media is taking undue advantage to demoralise the brahmins. Mainly this was started from ANR & NTR.


Leave a Reply

%d bloggers like this: