Site icon వసుంధర అక్షరజాలం

వింటే భారతం వినాలి

మహాభారతం ప్రతిఒక్కరూ అధ్యయనం చేయాల్సిన ఒక అద్భుత కావ్యం. అంతర్జాలం పుణ్యమా అని నేడు భారతం- అధ్యయనం చేసిన మహామహుల నోట వినే అవకాశం కలుగుతోంది. శ్రీ గరికిపాటి నరసింహారావు గారి విరాటపర్వం వివరాలు గతంలో ఇచ్చాం. ఇటీవల శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ద్వారా ఆదిపర్వం విశ్లెషణ వినడం జరిగింది. ఇందులో ఉదంకుడి వృత్తాంతం నా హైస్కూల్ రోజుల్ని గుర్తు చేసింది. అప్పట్లో అది నాకు పాఠ్యభాగం. ఒక సందర్భంలో బ్రాహ్మణుడు (కులం కాదు- విద్యావంతుడు అని మనం అర్థం చేసుకోవాలి), రాజు (ఇదీ కులం కాదు, పదవిలో ఉన్నవాడు అని భాష్యం చెప్పుకోవాలి)- వీరిద్దరికీ మానసికంగా ఉన్న భేదాన్ని-

‘నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణా

ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీ

రెండును రాజులందు విపరీతము కావున విప్రుడోపు

నోపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్’

అన్న పద్యంలో అన్ని కాలాలకూ వర్తించే నిజంగా చెప్పారు. అప్పట్నించి నేటివరకూ ప్రతి రోజూ ఈ పద్యాన్ని మననం చేసుకుంటూంటాను. ప్రస్తుతం రచనలో వస్తున్న మా శత్రు దేవోభవ సీరియల్ నవలలోనూ ఈ పద్యాన్ని సందర్భానుసారంగా ఉపయోగించడం జరిగింది. నిత్య జీవితంలో అవగాహనకు సహకరించే ఈ పద్యార్థాన్ని గ్రహిస్తే- వర్తమానంలో అన్నా హజారే, ఖేజ్రీవాల్ వగైరాలు బ్రాహ్మణులు అనీ- వారి మాటలకు స్పందిస్తున్న రాజకీయవాదులు రాజులనీ స్పష్టమౌతుంది. బ్రాహ్మణులకు మనసు మృదువు, మాట కటువు. రాజులకు మాట మృదువు. మనసు కటువు. అందువల్ల బ్రాహ్మణుడు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోగలడు. రాజు తీసుకోలేడుట. అందుకే నేడు మనకు నాయకులు ఒకదాని వెనుక ఒకటిగా ఇస్తున్న స్కాముల శాపాలు వెనక్కు తీసుకోలేకపోతున్నారు.
ఆదిపర్వంలోనే ఒక సందర్భంలో ఉదంకుడు సర్పాల్ని పేరుపేరునా స్మరిస్తాడు. అనంతుణ్ణి స్మరిస్తూ ఆయన చెప్పిన ‘బహువన పాదపాబ్ది’ అన్న పద్యం నేను చిన్నప్పుడు కంఠస్థం చేసినదే. కానీ ఆ పద్యంలో నన్నయ వాడిన అక్షరాలు పాము బుసల్ని ఎలా వినిపిస్తాయో శ్రీ పద్మాకర్ చదివి వినిపించేదాకా తెలియలేదు. ఈ విడియోలో ఒక గంటా ఆరు నిముషాల తర్వాత వచ్చేఆయన చదివిన పద్యం వినడం ఒక అనుభవం. లంకెకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Exit mobile version