నవంబర్ 23, 2012

కెమేరామన్ గంగతో రాంబాబు- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 8:05 సా. by వసుంధర

మన దేశంలో రాజకీయనాయకులు బరి తెగించిపోయారు. ఒకప్పుడు ప్రజాసేవకోసం మంత్రి పదవి అనేవాళ్లంతా, ఇప్పుడు పార్టీకి తాము చేసిన సేవలకు ప్రతిఫలంగా పదవులు కావాలని అడుగుతున్నారు. ఇవ్వకపోతే తమకు అన్యాయం జరిగిపోయిందని బాహాటంగా గొడవ చేస్తున్నారు. ఒకపక్క పెరిగిపోతున్న ధరలు. మరోపక్క ఉండీ చేతికందని (గ్యాస్, కరెంటు, రేషన్ వగైరా) సదుపాయాలు. అసలే రైతులు అప్పుల పాలై అఘోరిస్తుంటే,  ఆపైన తుఫాను దాడులవంటి ప్రకృతి వైపరీత్యాలు కూడాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలనాదుకోవలసింది రాజకీయనాయకులు. కానీ రాజకీయంగా ప్రభుత్వం ప్రతిపక్షాన్నీ, ప్రతిపక్షం ప్రభుత్వాన్నీ తప్పుపట్టి- చేతులు దులిపేసుకోవడం రివాజైపోయింది. నేతలు తమ ఇంటి వేడుకలకి మాత్రమే కోట్ల డబ్బు ఖర్చు చేస్తూనే- అధికారంలో లేనివారు కూడా తమకు తాముగా ప్రజలకోసం ఏదైనా చెయ్యాలన్న గాంధీ మహాత్ముడు తమకు ఆదర్శమని నిర్లజ్జగా చెబుతారు.  తమకి అధిష్ఠానం పదవి ఇవ్వకపోతేనే అన్యాయం. తాము ప్రజలకోసం ఏం చెయ్యకపోయినా అన్యాయం కాదు.

ఈ పరిస్థితి మేధావుల్ని వేదనకు గురి చేస్తోంది. ఆవేశపరుల కడుపు మండిస్తోంది. రచయితలు కథలువ్రాస్తుంటే, మీడియా కథనాల్ని వినిపిస్తోంది. అతి శక్తివంతమైన సినీమాధ్యమంలో ఈ తరహా ఆవేశపరులు తక్కువ. ఉన్నవారిలో పూరీ జగన్నాథ్ ఒకడు. ఆయన చిత్రాలు చాలావరకూ బాక్సాఫీసు విజయాల్ని సాధించడంవల్ల ఆయనలో వ్యాపారాత్మక కోణానికి వచ్చిన గుర్తింపు- పోకిరి, బిజినెస్‍మాన్ వంటి చిత్రాల్లో- సమాజం తీరు పట్ల అంతర్లీనమైన ఆయన ఆవేదనకి రాలేదు. ఈ విషయమై ఆయన మరికాస్త  ముందడుగేసి ప్రజల ముందుకు వచ్చాడు- ఈ అక్టోబర్ 18న- కెమేరామన్ గంగతో రాంబాబుగా.

1977లో ‘రెండు నిచ్చెనలు’ పేరిట మా నవల ఒకటి ప్రచురితమైంది. అందులో ఒకడు తన మిత్రుణ్ణి మహాత్ముడిగా రూపొందిస్తాడు. అతడికి తాను అనుచరుడై- సరైన సమయం చూసి ఆ మహాత్ముణ్ణి తనే చంపిస్తాడు. ఆయన అనుచరుడిగా ప్రజల్లో సానుభూతి సంపాదించి మహానాయకుడౌతాడు. అలాంటి కథాంశమే కెమేరామన్ గంగతో రాంబాబు. ఇందులో ఓ రానాబాబు (ప్రకాష్ రాజ్) తన తండ్రినే హత్య చేస్తాడు. అలాగే మా మరో నవల ‘ఆ వీధిలో రాక్షసుడు’లో హీరో దుష్టులకు వ్యతిరేకంగా సాక్ష్యం సంపాదించి ప్రజల ముందుంచడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టి- దుష్టుల్ని శిక్షించే బాధ్యత ప్రజలకే విడిచిపెట్టడం క్లైమాక్స్. ఈ చిత్రంలో కూడా- హీరో దుష్టశిక్షణ బాధ్యతను ప్రజలకే వదిలిపెట్టడం క్లైమాక్స్. ఒక సినీ రచయిత, సాంఘిక కథా రచయితలా ఆలోచించి, ఇలా చిత్రాలు తీయడంలో సామాజిక ప్రయోజనముందని మేమనుకుంటాం.

రాజకీయ పరమైన విసుర్లతో నింపడంతప్ప ఈ చిత్రానికి కథ లేదనే చెప్పాలి. కథ అనవసరం కూడా. అన్యాయాలు భరించి భరించి రాటు దేలిపోయి- ఏ ఘోరానికీ ఆవేశపడలేకున్న మన పౌరుల్లో- అన్యాయాన్ని సహించలేని ఓ రాంబాబు (పవన్‍కల్యాణ్) కథకు హీరో కావడం సహజమే కదా. కానీ శంఖులో పోస్తే కానీ తీర్థం కాదనుకునే స్తబ్ద మనస్తత్వానికి అలవాటు పడ్డాం కాబట్టి- అతడికి హీరోగా ప్రజల్లో గుర్తింపు తేవడానికి మీడియా అవసరపడడమూ సహజమే. ఆ మీడియా ప్రతినిధి కెమేరామన్ గంగ (తమన్నా)- ఈ చిత్రంలో కేవలం శంఖం పాత్ర పోషించింది. శంఖం తెల్లగా, అందంగా ఉంటుంది,  మనోహరంగా శబ్దం వినిపిస్తుంది మరి. ఇక రాంబాబు ఎదిరించడానికి అన్యాయాలుండాలి కదా- అవి ప్రతిపక్షనాయకుడు జవహర్ నాయుడు (కోట) చేస్తాడు- తన కొడుకు రానాబాబు భవిష్యత్తుకోసం. ఈ చిత్రం మంచిపట్ల ఆశాభావాన్ని ప్రదర్శించిందనడానికి నిదర్శనంగా, కథలో ముఖ్యమంత్రి చాలా మంచివాడు. ఎటొచ్చీ తనకు పదవి, అధికారం ఉన్నా, ప్రజలకు మంచి చెయ్యడానికి హీరో మీదనే ఆధారపడతాడు. అందుకు రాజకీయపరంగా ఆయన అసహాయతకు ఇచ్చిన వివరణ- వాస్తవానికి అద్భుతంగా అద్దంపట్టి- పూరీ అవగాహనను స్పష్టం చేస్తుంది.

కథ లేదని ముందే చెప్పుకున్నాం. ఈ చిత్రం మాటల బలంతో నడుస్తుంది. ఆ బలం వెనుక అంతులేని ఆలోచన, ఆవేదన కలగలిసిన ఆవేశం ఉంది. మచ్చుకి ఒక్క వ్యాఖ్య- తన ప్రాంతానికి చెందని వాణ్ణి శత్రువుగా భావించేవాడికి జాతీయగీతం పాడే అర్హత లేదుట. ఎందుకంటే ఆ గీతంలో- ‘పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా’ అంటూ అందర్నీ మనవాళ్లుగా భావిస్తాం. పాలనాసౌలభ్యం కోసమే, కొన్ని అదనపు సౌకర్యాలకోసమో- కొన్ని వర్గాలు ప్రత్యేక ప్రతిప్రత్తిని- అదీ ప్రజాభీష్ఠం మేరకు- కోరడం తప్పు కాదు. ఆ కోరిక తీరనప్పుడు ఆవేశం శృతి మించడమూ సహజమే. కానీ సాటి పౌరుల్ని శత్రువుల్లా చూడడం పొరపాటన్న భావాన్ని నాయకులు అనుచరుల్లో కలిగించాలి.

ఈ చిత్రంలో పవన్‍కల్యాణ్ నృత్యాలు రికార్డింగ్ డ్యాన్సుల్లా ఉన్నాయి. సంభాషణల విషయానికొస్తే- అలనాటి ఎన్టీఆర్ వంటివారి పదును అతడి మాటల్లో కనపడకపోయినా- ఆవేశపరుడిగా ఈ పాత్రలో రాణించడం విశేషం. ఇలాంటి పాత్ర పవన్ వల్లనే ఔతుందని అనిపించకపోయినా- పవన్ ఈ పాత్ర బాగా చేశాడనే అనిపిస్తుంది. ఇక తమన్నా, కెమేరామన్‍గా ఆరంభంలో (దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ఇలియానాలా) గొప్ప నటనను ప్రదర్శించింది. వంపుసొంపుల్లో రాణి అనిపించేలా నాట్యమాడింది. మిగతాచోట్ల నటనలో కొంత అతి, కొంత కృత్రిమత్వం. కోట, ప్రకాష్‍రాజ్‍ల నటన రోటీన్‍కి కొంత భిన్నంగా ఉండడం విశేషం. ఆలీ, బ్రహ్మానందంల హాస్యం అర్థవంతంగా ఉంది. పాటలు షరా మామూలే.  ఎక్స్‍ట్రాఆర్డినరీ, మెలికల్ తిరుగుతున్న అమ్మాయో వంటి పాటలు సంగీతానికీ, సాహిత్యానికీ కూడా ప్రయోజనకరం అనిపించదు. ఈ చిత్రం టైటిల్లో ఉన్న కెమేరామన్ గంగకి చిత్రకథలో పేరుకి మాత్రమే ప్రాధాన్యముంది. ఆమెను కెమేరామన్ అన్నందుకు నటనలో తప్ప పాత్రచిత్రణలో పురుషవ్యక్తిత్వం  కనపడదు.

ఈ చిత్రంలో మీడియాకీ, నేతలకీ అంటించిన చురకలు చాలా గొప్పగా ఉన్నాయి.

ప్రస్తుతం మంచి ఊపులో ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఈ చిత్రం కించపరుస్తున్నట్లుగా ఆరోపణ వచ్చింది. అన్వయించుకుంటే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఆ వివాదాన్ని బలపర్చవచ్చు కూడా. కానీ ఇటీవల బాల్ థాకరే మరణించినప్పుడు జరిగిన బంద్‍ని నిరసిస్తూ ఓ అమ్మాయి ఫేస్‍బుక్‍లో టపా పెడితే వ్యవహారం ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేదాకా వెళ్లింది. ఒకవైపు పెచ్చుమీరిపోతున్న అసహనం, మరోవైపు భావోద్వేగాన్ని అర్థం చేసుకోని అమాయకత్వం (లేదా అసమర్ధత)- ఇలాంటి వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇరుపక్షాలూ కూడా ఈ విషయమై కొంత సంయమనాన్నీ, వివేకాన్నీ పాటించడం అవసరం. ఎవరి వాక్‍స్వాతంత్ర్యానికీ భంగం కలుగకూడదన్న విషయాన్ని దేనికైనా రెడీ చిత్రంపై మా సమీక్షలో మనవి చేశాం. ఈ చిత్రం ఎలాగూ విజయం సాధించింది కాబట్టి, ఇలాంటి వివాదం దేవుడు చేసిన మనుషులు చిత్రానికి వచ్చి ఉంటే బాగుండేదని పూరీ అనుకుంటూండవచ్చు. ఏదిఏమైనా ఈ చిత్రాన్ని రూపొందించడంలో పూరీ చూపిన ప్రతిభ, విడుదల అనంతరం పొందిన అనుభవాలు- మున్ముందు ఆయన చిత్రాలపై ప్రభావం చూపించి- ఆయననుంచి అర్థవంతమై, వివాదాస్పదం కాని మంచి చిత్రాలు రాగలవని ఆశిద్దాం.

మరో సమీక్ష

3 వ్యాఖ్యలు »

  1. kslkss said,

    పవన్ కల్యాణ్ సంభాషణలు చెప్పే తీరు మూసలో పోసినట్లుంటై. అవి ఆయన అభిమానులకు నచ్చినా ఆయన నటునిగా ఎదుగుదలకు ఆటంకమని నా అభిప్రాయం. ఆంగికము, వాచికములో వైవిధ్యము చూపితే ఆయనలోని నట లక్షణాలు వ్యక్తమవచ్చు. సమస్యలు భావోద్రేకాలు రెచ్చగొట్టబడి పతాక స్థాయి చేర్చినప్పుడు ఇటువంటి కధలు, సంభాషణలు అగ్నికి ఆజ్యం పోస్తయ్యేమోనని ఒకటి పది సార్లు యోచించి తీస్తే అనవసరపు సంఘర్షణలకు తావుండదు. న బ్రూయత్ సత్యమప్రియం.


Leave a Reply

%d bloggers like this: