డిసెంబర్ 16, 2012

తెలుగు పద్యమా నీకు జోహార్లు!

Posted in భాషానందం at 2:54 సా. by వసుంధర

పదాడంబరం కావచ్చు.నవ నవ రసస్ఫూరితం కావచ్చు. భావసౌందర్యం కావచ్చు. భక్తి, రక్తి, ముక్తి వగైరాలేదైనా కావచ్చు. నారికేళ, కదళీ, ద్రాక్షలేమైనా కావచ్చు. మానసికోల్లాసానికీ, ఉద్వేగానికీ, వికాసానికీ, జ్ఞానానికీ, విజ్ఞానానికీ, వివేకానికీ తెలుగు పద్యాన్ని మించిన అనుభూతి మరొకటి లేదు. చక్కని తెలుగు పద్యాల అనుభూతిని పంచుకునేందుకే ఈ శీర్షిక.  ఈ క్రింది పద్యాల్ని సేకరించి పంపినవారు శ్రీ మోచర్ల శ్రీహరికృష్ణ. వారికి ధన్యవాదాలు.

డా. కడిమిళ్ళ వర ప్రసాద్ గారిచే రచించబడిన పద్యప్రశంస

పద్యమ్మునెవడురా ! పాతి పెట్టె దనంచు
ఉన్మాదియై  ప్రేలుచున్న వాడు
పద్యమ్మునెవడురా  ప్రాత వడ్డదియంచు
వెఱ్రివాడై విర్ర వీగు వాడు
పద్యమ్ము ఫలమురా! పాతి పెట్టిన బెద్ద
వృక్షమై  పండ్ల వేవేలనొసగు
పద్యమ్మునెప్పుడో  పాతి పెట్టితిమేము
లోకుల హృదయాల లోతులందు

ఇప్పుడ ద్దానిని బెకలింప నెవరి తరము
వెలికి తీసి, పాతుట ఎంత వెఱ్రి తనము
నిన్నటికి మున్ను మొన్ననే కనుదెరచు
బాల్య చాపల్యమున కెంత  వదరుతనము

నవ్వులపై  మహాకవి జాషువా చెప్పిన పద్యము

నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్
దివ్వెలు , కొన్ని నవ్వులెటు తేలవు , కొన్ని విష ప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమ రసమున్ వెలిగ్రక్కు విశుద్ధ మైన లే
నవ్వులు సర్వదు:ఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషదుల్ 

3 వ్యాఖ్యలు »

  1. t.s.kaladhar said,

    పద్యం తెలుగువాడి సొత్తు. వేరే ఏ భాషలో లేని పద్యం మన బంగారు గని.


Leave a Reply

%d bloggers like this: