వసుంధర అక్షరజాలం

బేతాళ కథలు

మన జానపద సాహిత్యంలో బేతాళ కథలది ఒక విశిష్ట స్థానం. పిల్లల కథలా అనిపిస్తూ, మనచుట్టూ జరిగే సామాన్య విశేషాల్ని అద్భుతంగా మార్చే ఒక వినూత్న పద్ధతి ఈ కథల్లో ఉంటుంది. ఊహకందే విశేషాల్లోంచి ఊహకందని జ్ఞానాన్ని పంచిపెట్టే ఈ కథల్లో ఇతివృత్తం ఒక ఎత్తు. కథనం మరో ఎత్తు. ప్రశ్న జవాబు ఓ మెలిక. ఇవి ప్రాచీనంగా ఇరవై ఐదు కథలు. సమకాలీన సమాజాన్ని విశ్లేషించే ఇతివృత్తాలతో నెలకొకటి చొప్పున కల్పిత బేతాళ కథగా కొన్ని దశాబ్దాలపాటు ప్రచురించింది చందమామ. ఈ ప్రయోగం మాచేత చందమామకు ఎన్నో కొత్త బేతాళ కథలు వ్రాయించింది. చందమామకు బేతాళ కథలొక ప్రత్యేకత ఐతే చందమామలో మా బేతాళ కథలకు పాఠక లోకం కొంత ప్రత్యేకతను ఆపాదించింది. ఇటీవల చందమామ యాజమాన్యం చేతులు మారి, తీరు కూడా మారడంతో కొత్త బేతాళ కథలకు అవకాశం తగ్గిపోయింది. చక్కని కొత్త బేతాళ కథల్ని అక్షరజాలం బాలబండారంలో పొందుపర్చాలని ఆశ. కథకులెవరైనా తమ రచనలు సాఫ్ట్ కాపీలుగా పంపితే అవసరమైన మేరకు వాటిని సవరించి ప్రచురించగలం. ఈ శీర్షికకు బొమ్మను ప్రముఖ చిత్రకారుడు బాలి రూపొం దించారు. వారికి మా ధన్యవాదాలు. ఈ విషయమై తన వంతు కృషి చేసి సహకరించిన శ్రీమతి శ్రీదేవి మురళీధర్‍కి మా ధన్యవాదాలు. ఆమె రచించిన గరుత్మంతుడి ముక్కు అనే బేతాల కథతోనే ఈ ధారావాహిక ఆరంభం కావడం కాకతాళీయం.

ఈ కథలో పిల్లల్ని ఆకర్షించే అద్భుతాలున్నాయి. పెద్దలకి నచ్చే తర్కముంది. మామూలు జానపద కథలా కనిపించినా- ఈ రచనలో సమకాలీనంగా ప్రజాస్వామ్యం గురించి వ్యాఖ్యానమూ, సందేశమూ ఉన్నాయిః ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఇచ్చినా పౌరుల ఉపేక్షాభావం వల్ల అది వృథా ఔతుంది. అందువల్ల ప్రజాస్వామ్యంలోనూ రాజరికానికి సంబంధించిన వారసత్వమే కొనసాగుతుంది. అందువల్ల కనీసం ఆ వారసుడికి ప్రజాపాలన విషయమై తగిన శిక్షణ ఉండి తీరాలి. విచిత్రమేమిటంటే ఈ వ్యాఖ్యానమూ, సందేశమూ బాగా ఆలోచిస్తే తప్ప స్ఫురించనంత అంతర్లీనమూ, నిగూడమూనూ. ఇక కథ చదవండి.

Exit mobile version