డిసెంబర్ 16, 2012
బేతాళ కథలు
మన జానపద సాహిత్యంలో బేతాళ కథలది ఒక విశిష్ట స్థానం. పిల్లల కథలా అనిపిస్తూ, మనచుట్టూ జరిగే సామాన్య విశేషాల్ని అద్భుతంగా మార్చే ఒక వినూత్న పద్ధతి ఈ కథల్లో ఉంటుంది. ఊహకందే విశేషాల్లోంచి ఊహకందని జ్ఞానాన్ని పంచిపెట్టే ఈ కథల్లో ఇతివృత్తం ఒక ఎత్తు. కథనం మరో ఎత్తు. ప్రశ్న జవాబు ఓ మెలిక. ఇవి ప్రాచీనంగా ఇరవై ఐదు కథలు. సమకాలీన సమాజాన్ని విశ్లేషించే ఇతివృత్తాలతో నెలకొకటి చొప్పున కల్పిత బేతాళ కథగా కొన్ని దశాబ్దాలపాటు ప్రచురించింది చందమామ. ఈ ప్రయోగం మాచేత చందమామకు ఎన్నో కొత్త బేతాళ కథలు వ్రాయించింది. చందమామకు బేతాళ కథలొక ప్రత్యేకత ఐతే చందమామలో మా బేతాళ కథలకు పాఠక లోకం కొంత ప్రత్యేకతను ఆపాదించింది. ఇటీవల చందమామ యాజమాన్యం చేతులు మారి, తీరు కూడా మారడంతో కొత్త బేతాళ కథలకు అవకాశం తగ్గిపోయింది. చక్కని కొత్త బేతాళ కథల్ని అక్షరజాలం బాలబండారంలో పొందుపర్చాలని ఆశ. కథకులెవరైనా తమ రచనలు సాఫ్ట్ కాపీలుగా పంపితే అవసరమైన మేరకు వాటిని సవరించి ప్రచురించగలం. ఈ శీర్షికకు బొమ్మను ప్రముఖ చిత్రకారుడు బాలి రూపొం దించారు. వారికి మా ధన్యవాదాలు. ఈ విషయమై తన వంతు కృషి చేసి సహకరించిన శ్రీమతి శ్రీదేవి మురళీధర్కి మా ధన్యవాదాలు. ఆమె రచించిన గరుత్మంతుడి ముక్కు అనే బేతాల కథతోనే ఈ ధారావాహిక ఆరంభం కావడం కాకతాళీయం.
ఈ కథలో పిల్లల్ని ఆకర్షించే అద్భుతాలున్నాయి. పెద్దలకి నచ్చే తర్కముంది. మామూలు జానపద కథలా కనిపించినా- ఈ రచనలో సమకాలీనంగా ప్రజాస్వామ్యం గురించి వ్యాఖ్యానమూ, సందేశమూ ఉన్నాయిః ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఇచ్చినా పౌరుల ఉపేక్షాభావం వల్ల అది వృథా ఔతుంది. అందువల్ల ప్రజాస్వామ్యంలోనూ రాజరికానికి సంబంధించిన వారసత్వమే కొనసాగుతుంది. అందువల్ల కనీసం ఆ వారసుడికి ప్రజాపాలన విషయమై తగిన శిక్షణ ఉండి తీరాలి. విచిత్రమేమిటంటే ఈ వ్యాఖ్యానమూ, సందేశమూ బాగా ఆలోచిస్తే తప్ప స్ఫురించనంత అంతర్లీనమూ, నిగూడమూనూ. ఇక కథ చదవండి.
Shri said,
డిసెంబర్ 19, 2012 at 9:35 సా.
శ్రీ శర్మ గారు
కథ చదివినందుకు ధన్యవాదాలు.
లోకజ్ఞానం లేని విద్య నిరుపయోగం అని నేను చదివిన కథల వల్ల నాకు అర్ధమయ్యింది.
ఒక కల్పిత గాథ లో అద్భుతము, దైవఘటన ,మానవ యత్నం … ప్రయత్నం విఫలమైనా నాయకుడు చేరవలసిన చోటికే చేరటం…మానవయత్నం వల్ల సమకూరే అమూల్యాఅనుభవం,ఇలా నేను చదివిన ఎన్నెన్నో కథల ప్రభావమే ఈ కథకు ప్రేరణ.
నేటి సమాజంలో వారసత్వంగా నాయకులైన వారంతా ఎలా ఉన్నారో,వారి తీరుతెన్నులు నాకంటే మీకే బాగా తెలుసు.సమాజం పట్ల అవగాహన,పాలన మీద పట్టు లేని రాజ్యాలు /లేదా ప్రభుత్వాలు సామాన్యుడికి ఎంత దూరంగా ఉన్నాయో మీకు తెలియనిది కాదు. దేశాటన చేసి,నలుగురి మధ్య తిరిగి జీవితాన్ని చూచిన పసిడి కొండ
తప్పకుండా ఒక మంచి పాలకుడు అవుతాడు.
ఈ అంశం ఒక్కటే నేను చెప్పాలనుకున్నది.ఎంతవరకు కృతకృత్యురాలినయ్యానో మీ వంటి పెద్దలే నిర్ణయించాలి.
మీకు తృప్తికరంగా చెప్పానో లేదో మరి…
శ్రీదేవి
kslkss said,
డిసెంబర్ 21, 2012 at 11:06 సా.
మీ భావనలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మహాత్ముని స్ఫూర్తి: భారతీయత గ్రామాలలోనే ఉన్నదన్నది పల్లెలలో విద్యాభ్యాసం, పల్లెలలోనే పండుగలు జరుపుకొనటం, పల్లెలలోనే జరుపోకోవాలని ఆరాటపడే వారి అనుభవాల అద్దాలలోనుండి చూస్తుంటే ప్రపంచీకరణ లాంటి శబ్దాలు వినటనికి, పరిణామాలు కనటానికి జుగుప్స కలుగుతోంది. దురదృష్టవశాత్తు, ప్రణాళికారచన, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన వారి చేతులలోనికి పోవటం కఠోర సత్యం. ఈ నేపధ్యములో మీరు వ్రాసిన కధ సందర్భోచితముగా ఉన్నది. ఒక్కటే వర్తమానములోని అపశృతి. పాదయాత్రలలోని పరమార్ధం, పదవిని చేజిక్కించుకోవటం తప్ప కళ్ళ ఎదుట కనపదుతున్న కఠోర వాస్తవాలను గ్రహించి, చట్ట సభలద్వారా మూలాలలో మార్పులు తేవాలని కాదన్నట్లు చరిత్ర తెలియజేసిన నిజం.
మీ సమయానికి కృతజ్ఞతలు.
kslkss said,
డిసెంబర్ 18, 2012 at 11:11 సా.
శ్రీమతి శ్రీదేవి గారు, మనసును చిన్నతపురోజులకు తీసుకెళ్ళారు. కధనం బాగుంది. ఒక వివరణ కోరవచ్చా? వసుంధర గారు చెప్పిన కోణంలో చూడటానికి విఫల ప్రయత్నం చేశాను. రచయిత్రిగా మీరు ఇప్పటి రాజకీయ/సామాజిక వ్యవస్తకు ఎలా అన్వయించారో తెలుసుకోవాలని భేతాళుని వలె నా బుద్ధికి అందుటలేదు. అభ్యంతరములేకపోతే వివరించ ప్రార్ధితులు.
వసుంధర said,
డిసెంబర్ 21, 2012 at 11:44 ఉద.
శ్రీదేవి గారి వివరణ చదివే ఉంటారు. ఇంకా రాజుగారి దండోరా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు లాంటిది. మన ప్రజలు ఓటు గొప్పతనాన్ని అర్థం చేసుకోక నిర్లక్ష్యం చేస్తున్నట్లే కథలో ప్రజలూ ఉపేక్షా భావం ప్రదర్శించారు. కళ్లెదుటనున్న చెట్టు గరుత్మంతుడి ముక్కులా ఉందని ఒక్కరూ గుర్తించలేదు. గుర్తించి ఉంటే వారసుడైన ఒక్క పసిడికొండ మాత్రమేకాదు, ఆ ఆ చెట్టు మొదట్లో ఆ ఊరివారందరూ కూడా ఎంతోకొంత సమయం వెచ్చించి ఉంటారు కాబట్టి మాణిక్యం కాగల అవకాశం ఎవరికైనా ఉండేది. ఇంతకీ పసిడికొండ కూడా తనకు తానుగా గరిత్మంతుడి ముక్కుని గుర్తించలేదు. అతడి వంశపురుషుడి ప్రోద్బలంతో అతడా అర్హతను సంపాదించుకున్నాడు. కథగా ఆనందించేవారికి ఇదొక చక్కని జానపద కథ. లోతుగా ఆలోచిస్తే నేటి మన ప్రజాస్వామ్యం. ఇలాంటి కథలు వ్రాయడానికి కొంత సహజ ప్రతిభ కూడా ఉండాలి. శ్రీదేవిగారికి అభినందనలు. మీ స్పందనకు ధన్యవాదాలు.