డిసెంబర్ 17, 2012
పాడుతా తీయగా
పద్మవిభూషణ్ డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (బాసు) ఈటివిలో అసామాన్యంగా నిర్వహిస్తున్న అద్భుత ధారావాహిక పాడుతా తీయగా. కొత్త గాయనీ గాయకులను వెలుగులోకి తీసుకు రావడానికి వరుస పోటీలతో పలు సంచికలుగా వెలువడుతున్న ఈ కార్యక్రమం గత మూడు సంచికల్లోనూ కొత్త ఊపందుకుంది. ఫలితాలతో నిమిత్తం లేకుండా పోటీదారులందరూ ఇటీవల చూపిస్తున్న ప్రతిభ ఆశ్చర్యానందాలు కలిగిస్తోంది. భాషోచ్చారణతో సహా- సంగీత సాహిత్యాలపై బాసు వ్యాఖ్యలు వినోదంతోపాటు జ్ఞానాన్నీ కలిగిస్తున్నాయి. సంగీత రంగానికి సంబంధించిన ఎందరో ప్రముఖులు, ఔత్సాహికులు కూడా ఈ కార్యక్రమం వేదికపై పరిచయమౌతున్నారు. ఈ కార్యక్రమం ఈ తరహా కార్యక్రమాలన్నింటికీ తలమానికం కావడానికి కారణమైన బాసుకి అభివందనాలు.
ప్రస్తుతానికి ఈ కార్యక్రమం గురించి ఒకే ఒక్క ఫిర్యాదు. సోమవారం రాత్రి తొమ్మిదిన్నరకు మొదలయే ఈ కార్యక్రమం ముగిసెసరికి పదకొండు గంటలు దాటిపోతోంది. ఇంత చక్కటి కార్యక్రమం పది లోపులో ముగిసేందుకు ఇంకా ముందర మొదలైతే బాగుంటుంది. ఎనిమిది గంటల సమయంలో వస్తున్న హత్యలు, దౌర్జన్యాల సీరియల్స్ వేళల్ని ఆమేరకు బదిలీ చేస్తే బాగుంటుందేమో!
ఈ కార్యక్రమం కొత్త సంచిక పరాకాష్ఠకు వచ్చింది. ఫైనల్స్ కి చేరిన నలుగురి పేర్లూ ఇవిః శరత్ సంతోష్, చారుమతి పల్లవి, సూర్య కార్తీక్, ప్రవీణ్ కుమార్. వీరు నలుగురూ ఒకరికొకరు తీసిపోరన్నది ఒక నిజం. పోటీనుంచి తప్పుకోవాల్సివచ్చినవారూ వీరికి ఏమాత్రం తీసిపోరన్నది మరో నిజం. ఆ రోజు వీరిది కావడంవల్ల మిగతావారిని వీరు అధిగమించారంతే! ఈ నలుగురితో మొదటి భాగం గత సోమవారంనాడు (అంటే డిసెంబర్ 10) జరిగింది. ఆ కార్యక్రమం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఈ సంచికలో మొత్తం కార్యక్రమాలన్నింటికోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఇంతవరకూ పాడుతా తీయగా కార్యక్రమంపై అక్షరజాలం వ్యాఖ్యలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మన భాషకూ, సంస్కృతికీ ఉన్న చక్కటి భవిష్యత్తు ఎంత ఆశాజనకమో నిరూపించే ఈ కార్యక్రమం సంగీతాభిమానులందరూ తప్పక చూడాలి. ఈ కార్యక్రమం పైన ఇచ్చిన లంకెలలోనే కాక యూట్యూబులోనూ లభ్యం.
sarasi said,
డిసెంబర్ 18, 2012 at 8:58 ఉద.
పాడుతా తీయగా అద్భుతంగా సాగుతోంది అనడంలో సందేహం లేదు. ఎంతో ఆపేక్షతో చూస్తున్నాం దానిని. అయితే ఫైనల్స్ లో తెలుగు భాష తెలిసిన వ్యక్తిని న్యాయ నిర్ణేత గా పెట్టకపోవడం బాగు లేదు. అన్నీ చూసుకోడానికి బాలు ఉన్నారని చెప్పవచ్చు. కాని ఫైనల్స్ ఫైనల్సే.
వసుంధర said,
డిసెంబర్ 18, 2012 at 12:53 సా.
తెలుగు వారికి తెలుగు పాటల్లో తెలుగునాట తెలుగుఛానెల్లో జరుగుతున్న పోటీలో ఫైనల్స్ ఇది. ఆ దృష్ట్యా తెలుగు భాష బాగా తెలిసిన వ్యక్తి న్యాయనిర్ణేత కావాలన్న మీ ఆలోచ సబబు. ఐతే ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేత బాసు మాత్రమే. వేదికపై ఉండే మరో వ్యక్తి ముఖ్య అతిథి. పోటీలో పాల్గొన్నవారికి సూచనలు, సలహాలు ఇవ్వడం వరకే వారి పాత్ర. న్యాయనిర్ణయంలో వారికి భాగస్వామ్యం లేదు. అయినప్పటికీ ఫైనల్స్ లో ముఖ్య అతిథి తెలుగు తెలిసిన వారే కాక, సంగీత నిధి అయుండడం కూడా ముఖ్యం. మీ సూచన వచ్చే వారం పాటిస్తారేమో చూద్దాం.
CS Sarma said,
డిసెంబర్ 18, 2012 at 6:29 ఉద.
Balu garu is an ordinary man can bring, install in our hearts, the God with his song. I am proud of him in telugu industry. I am always listening his songs in my ear phones, while walking.waiting and travelling. Balu Garu, You are my Guru like Ramakrishna Paramahamsa.