వసుంధర అక్షరజాలం

పాడుతా తీయగా

పద్మవిభూషణ్ డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (బాసు) ఈటివిలో అసామాన్యంగా నిర్వహిస్తున్న అద్భుత ధారావాహిక పాడుతా తీయగా. కొత్త గాయనీ గాయకులను వెలుగులోకి తీసుకు రావడానికి వరుస పోటీలతో పలు సంచికలుగా వెలువడుతున్న ఈ కార్యక్రమం గత మూడు సంచికల్లోనూ కొత్త ఊపందుకుంది. ఫలితాలతో నిమిత్తం లేకుండా పోటీదారులందరూ ఇటీవల చూపిస్తున్న ప్రతిభ ఆశ్చర్యానందాలు కలిగిస్తోంది. భాషోచ్చారణతో సహా- సంగీత సాహిత్యాలపై  బాసు వ్యాఖ్యలు వినోదంతోపాటు జ్ఞానాన్నీ కలిగిస్తున్నాయి. సంగీత రంగానికి సంబంధించిన ఎందరో ప్రముఖులు, ఔత్సాహికులు కూడా ఈ కార్యక్రమం వేదికపై పరిచయమౌతున్నారు. ఈ కార్యక్రమం ఈ తరహా కార్యక్రమాలన్నింటికీ తలమానికం కావడానికి కారణమైన బాసుకి అభివందనాలు.

ప్రస్తుతానికి ఈ కార్యక్రమం గురించి ఒకే ఒక్క ఫిర్యాదు. సోమవారం రాత్రి తొమ్మిదిన్నరకు మొదలయే ఈ కార్యక్రమం ముగిసెసరికి పదకొండు గంటలు దాటిపోతోంది. ఇంత చక్కటి కార్యక్రమం పది లోపులో ముగిసేందుకు ఇంకా ముందర మొదలైతే బాగుంటుంది. ఎనిమిది గంటల సమయంలో వస్తున్న హత్యలు, దౌర్జన్యాల సీరియల్స్ వేళల్ని ఆమేరకు బదిలీ చేస్తే బాగుంటుందేమో!

ఈ కార్యక్రమం కొత్త సంచిక పరాకాష్ఠకు వచ్చింది. ఫైనల్స్ కి చేరిన నలుగురి పేర్లూ ఇవిః శరత్ సంతోష్, చారుమతి పల్లవి, సూర్య కార్తీక్, ప్రవీణ్ కుమార్. వీరు నలుగురూ ఒకరికొకరు తీసిపోరన్నది ఒక నిజం. పోటీనుంచి తప్పుకోవాల్సివచ్చినవారూ వీరికి ఏమాత్రం తీసిపోరన్నది మరో నిజం. ఆ రోజు వీరిది కావడంవల్ల మిగతావారిని వీరు అధిగమించారంతే! ఈ నలుగురితో మొదటి భాగం గత సోమవారంనాడు (అంటే డిసెంబర్ 10) జరిగింది. ఆ కార్యక్రమం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.  ఈ సంచికలో మొత్తం కార్యక్రమాలన్నింటికోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఇంతవరకూ పాడుతా తీయగా కార్యక్రమంపై అక్షరజాలం వ్యాఖ్యలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మన భాషకూ, సంస్కృతికీ ఉన్న చక్కటి భవిష్యత్తు ఎంత ఆశాజనకమో నిరూపించే ఈ కార్యక్రమం సంగీతాభిమానులందరూ తప్పక చూడాలి. ఈ కార్యక్రమం పైన ఇచ్చిన లంకెలలోనే కాక యూట్యూబులోనూ లభ్యం.

 

Exit mobile version