డిసెంబర్ 24, 2012

డమరుకం

Posted in వెండి తెర ముచ్చట్లు at 4:56 సా. by వసుంధర

damarukam 

జానపద కథలతో సినిమాలు తీయడంలో తెలుగువారికి తెలుగువారే సాటి. మహా దర్సకులు వేదాంతం రాఘవయ్య, కెవి రెడ్డి జానపద చిత్రాల కథల్ని ఉత్తమ సాంఘిక చిత్రాలంత గొప్పగానూ అంత వ్యయంతోనూ తెరకెక్కించారు. వారి తర్వాత విఠలాచార్య జానపద చిత్రాలపైనే దృష్టిపెట్టి చౌకగానూ, జనరంజకంగానూ చిత్రాలు తీయడంలో నేర్పు సంపాదించారు. గ్రాఫిక్స్ అత్యవసరమైన ఆ చిత్రాలలో- మామూలు కెమేరాలతోనే అద్భుతాలు సాధించే ఆ చిత్రాల్లో సృజనాత్మకత గొప్పది. చమత్కారం అలరించేది. మాయలు, మంత్రాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కథ తర్కానికి నిలబడేది.  

సృజనాత్మకత లేకుండా, తర్కం లేకుండా, చమత్కారానికి పాట్లు పడుతూ, గ్రాఫిక్స్‍కి చాలా ప్రాధాన్యమిస్తూ, కథకి తావే లేకుండా, డబ్బుని మంచినీళ్లలా ఖర్చు చేసి తీసి ప్రజలమీదకు వదిలిన చిత్రం ఒకటి ఈ నవంబర్ 23న  డమరుకం పేరుతో విడుదలైంది. ఈ రోజుల వాతావరణంలో, నేటి పాత్రలమధ్య జరుగడంవల్ల ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ అన్నప్పటికీ ఇది పూర్తి ఫాంటసీ చిత్రం.

ఓ మహర్జాతకురాలిని పెళ్లాడి లోకాలన్నింటినీ తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు అంధకాసురుడు అనే ఓ రాక్షసుడు. అందుకు ఒకటి రెండేళ్లు కాదు, ఏకంగా యుగాలకు యుగాలే ఎదురు చూసి- 2012 దాకా ఉన్నాడు. అతడి సహనం మన క్రికెటర్లకుంటే ఇంగ్లండుని చిత్తుగా ఓడించేవాళ్లం కదా అని నిట్టూర్చక తప్పదు. అక్కణ్ణించి మొదలై ఈ చిత్ర కథలో నిండా సందేహాలే. కథనీ, వాటినీ ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఇక్కడా ఇక్కడా క్లిక్ చేస్తే చక్కని సమీక్షలున్నాయి. అందుకని మిగతా విశేషాలు క్లుప్తంగా ముచ్చటిద్దాం.

హీరో నాగార్జున పాత్రోచితంగా కాక నాగార్జునలా నటించాడు. అందువల్ల చిత్రమంతా నాగార్జునే కనిపిస్తాడు. అభిమానులకి పరమానందం. అభిమానులు కానివారికీ నాగార్జునని చూడ్డం ఇబ్బంది అనిపించదు. ఐతే ఎంతో బలమైన గొప్ప పాత్ర రచయిత. హీరోల అలక్ష్యంవల్ల అతి సామాన్యమైపోయింది. పాటల్లో మాత్రం నాగార్జున కదలికలు మరీ రొటీన్. కాస్త విసుగే అనిపిస్తాయి. హీరోయిన్ అనుష్కలో వయసుకు తగ్గ లేతదనం కనిపించలేదు. చాలా దృశ్యాల్లో అందగత్తెలా తోచదు. కన్యాకుమారీ పాటలో మాత్రం చాలా బాగుంది. కథ ఆమె చుట్టూ తిరిగినా- ఆమె ఉనికి అలంకారప్రాయమే కావడానికి- నటనలో లోపం కూడా ఉంది. విలన్ రవిశంకర్ పాతాళభైరవిలో ఎస్వీ రంగారావు గెటప్ లో- ఆ తరహాలో డైలాగ్స్ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఎస్వీ విరుపులు మాటలోనూ, హావభావాల్లోనూ రాక హుందా తగ్గింది. నటనలో అతి ఉంది. ఈ పాత్రకి అది ఫరవాలేదు. ఇంకా అతడికి గురుతుల్యుడిగా జీవా గతంలో ధూళిపాళ శకునిని అనుకరించడంలో కొంతవరకే కృతకృత్యుడయ్యాడు. బ్రహ్మానందం హాస్యం చిత్రంలో భాగమే ఐనా- కాదనిపించేలా తియ్యడం దర్శకత్వ ప్రతిభ. మిగతా నటీనటులు అవధుల మేరకు తమ పాత్రల్ని పోషించారు. శివుడి పాత్రలో ప్రకాష్ రాజ్- రూపం, ఆకారం- ఆ పాత్రకు తగినట్లు అనిపించకపోయినా- దైవత్వాన్ని హావభావాల్లో ప్రకటించిన తీరు ఆయన ప్రతిభకు అద్దం పడుతుంది. ఇక గరం గరం చాయ్‍తో- తొలిసారిగా ఐటమ్ పాపగా జనం ముందుకు వచ్చిన చార్మీ ప్రేక్షకులకు గరంగరంగా కనిపించడానికి తెగ తాపత్రయపడింది. కానీ పాటలో ఇమడలేక పోయింది.

దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఐతే కన్యాకుమారీ పాటలో పాటకంటే అనుష్క బాగుంటే- చాయ్ పాటలో చార్మీ కంటే పాట బాగుంది.

దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రంలో గ్రాఫిక్స్ మీద ఎంతగా ఆధారపడ్డాడంటే- స్వాతి వారపత్రికలో ఈ చిత్రాన్ని సమీక్షించిన రాజా- గ్రాఫిక్స్ రక్షతి రక్షితః అని చమత్కరించారు.

ఏది ఏమైనా థియేటర్లో కూర్చున్నంతసేపూ ఈ చిత్రం పెద్దగా విసుగనిపించదు. ఏ సీనుకా సీను విడిగా బాగుండడం అందుకు కారణం కావచ్చు. ఆ సీన్లన్నీ కలిపి డమరుకం కాలేకపోవడం వల్లనేమో థియేటర్లోంచి బయటకు వచ్చాక ఇంతకీ మనం ఏం చూసినట్లూ అనిపిస్తుంది.

ఈ చిత్రం ఎంజాయ్ చెయ్యడానికి ఒకే ఒక చిట్కా. మనం చూడబోతున్నది ఓ పరమ చెత్త చిత్రం అనుకుని వెళ్లాలి. అప్పుడు ఫరవాలేదు, బాగానే ఉందే అనిపిస్తుంది. కానీ ఓ గొప్ప చిత్రాన్ని చూడబోతున్నామనుకుని వెళ్లారా- పరమ చెత్త అనిపించినా ఆశ్చర్యం లేదు. ఐతే ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇలా చిత్రాన్ని తియ్యడం మాత్రంలో తప్పకుండా అహంకారం ఉంది. ఆ అహంకారం వల్ల నిర్మాతలే కాదు, ప్రజలకూ నష్టమే. ఎందుకంటే ఈనాడు నిర్మాతలూ, నటీనటులూ, ఇతర సినీ ప్రముఖులూ- తమది అనుకుంటున్న ఆ సంపద ప్రజలనుంచే వచ్చింది. తామిచ్చిన సంపద దుర్వినియోగం కావడం వారికి నష్టంగానే అనిపిస్తుంది. అందువల్ల ప్రజలు- తాము నష్టపోయినా మిథునం వంటి చిత్రాల్ని తీయాలనుకునే నిర్మాతల్ని గౌరవిస్తారు.

డమరుకం చిత్రంలో భాగస్వాములందరూ ప్రతిభావంతులేననడానికి డమరుకం చిత్రమే నిదర్శనం. వారి కలయికలో ప్రతిభావంతమైన చిత్రం రావడానికి ఏమేం చెయ్యకూడదో తెలుసుకునే ప్రయోగమే దమరుకం. ఈ ప్రయోగం వారినుంచి ఓ గొప్ప చిత్రం రావడానికి దోహదం చేస్తుందని ఆశిద్దాం.

1 వ్యాఖ్య »

  1. kslkss said,

    శ్రీనివాసరెడ్డి గారు హాస్యాన్ని నమ్ముకొంటేనే మంచిదని నా సలహా.


Leave a Reply

%d bloggers like this: