ఫిబ్రవరి 25, 2013

తెలుగు తోటలో కరుణశ్రీ

Posted in సాహితీ సమాచారం at 5:20 సా. by వసుంధర

దూరదర్శన్ సప్తగిరిలో వోలేటి పార్వతీశం నిర్మాతగా వస్తున్న తెలుగుతోట కార్యక్రమం ఎన్నదగిన సాహితీ కార్యక్రమం. ప్రతి సోమవారమూ ఉదయం తొమ్మిది గంటలకూ, తిరిగి తదుపరి మంగళవారం రాత్రి ఎనిమిదిన్నరకూ అరగంటసేపు వచ్చే ఈ కార్యక్రమంలో ఈ రోజు ప్రముఖ కవి కరుణశ్రీ గురించి వారి తనయుడితో- ప్రముఖ పాత్రికేయులు కెబి లక్ష్మి సంభాషించారు. ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఇందులో ఉన్నాయి. మచ్చుకి వాగ్దానం చిత్రంలో మహాకవి శ్రీశ్రీ వ్రాయగా, పెండ్యాల నాగేశ్వరరావు స్వరపర్చగా,  ఘంటసాల నోట పలికిన అద్భుత రసవత్తర హరికథ అందరికీ తెలిసినదే. అందులో చివర ప్రత్యేకంగా అనిపించే  పద్యమిదిః

పెళ్లుమనె విల్లు గంటలు ఘల్లుమనె

గుభిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనియె

జానకీ దేహము ఒక్క నిమేశమునందె

నయము జయమును భయము విస్మయము గదుర

ఈ పద్యం మాత్రం కరుణశ్రీ గారిదట. తనకు చెప్పకుండా వాడుకున్నావేమని కరుణశ్రీ శ్రీశ్రీ నడిగితే ఆయన నవ్వి, ‘అది ఏనాడో అందరిదీ ఐపోయింది. అందుకే అనుమతి కోరలేదు’ అన్నారట. రేపు అనగా- ఫిబ్రవరి 26 రాత్రి 8.30కి సప్తగిరిలో ఈ కార్యక్రమాన్ని చూడండి. అప్పుడు మీ స్పందన చెప్పండి.

హరికథ అక్షరాల్లో       హరికథ చలనచిత్రంలో

 

5 వ్యాఖ్యలు »

 1. Jandhyala Viplava Kumar said,

  ముక్కు తిమ్మన పద్యాన్ని (నాన సూన వితాన వాసనల …) రామ రాజ భూషణుడు తన వసుచరిత్ర లోనికి గ్రహించిన సన్నివేశం స్ఫురణకు వస్తున్నది.

  • ‘నానా సూన వితాన’ పద్యం గురించి విమర్శకుల్లో తర్జనభర్జనలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఈ పద్యం మూలభావం నన్నెచోడునిదంటూ శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావు (http://www.eemaata.com/em/issues/200901/1389.html/6/) ఇలా వ్రాశారుః
   చం. జలజము సావి కోకములు షట్పదముల్ పఱతెంచి తద్దయున్
   నలి వినుతాస్యమండలము నాసికయున్ శశిబింబ చంపకం
   బులు సవి డాయనొల్ల కతి మోహమునం బెడఁబాయనోప కా
   కులమతి నున్న భంగిఁ గుచకుంతలవక్త్రము లొప్పు గౌరికిన్ (8.8)
   చక్రవాక పక్షులకు వెన్నెల అంటే అయిష్టం. అదే విధంగా తుమ్మెదలకు సంపంగి పూలు పడవట. కానీ ఈ రెంటికీ తామరపూలు ప్రియమైనవి. పార్వతి ముఖాన్ని దూరంనుండి చూచి పద్మమని భ్రమించి అవి ఆమె దగ్గరకు చేరుతాయి. తీరా దగ్గరకు వచ్చిన తరువాత ఆమె ముఖకాంతి వెన్నెలను జ్ఞప్తికి తెస్తుంది చక్రవాకాలకు, ఆమె ముక్కు చంపకాన్ని జ్ఞప్తికి తెస్తుంది తుమ్మెదలకు. పద్మమని వెళ్దామా లేక వెన్నెల, సంపంగి అని దూరముందామా అనే భ్రమలో పడ్డాయి అవి. అట్టి సుందరమైన ముఖము, వెండ్రుకలు, స్తనాలు ఉన్నాయి గౌరికి. పార్వతి ముఖం వెన్నెలలా, కేశాలు నల్లని తుమ్మెదలలా, కుచాలు చక్రవాకములలా ఉన్నాయని దీని ఐతిహ్యము. సంపంగి ముక్కుపైన ప్రసిద్ధమైన పద్యం “నానాసూన వితాన వాసనల సారంగ మేలా నన్నొల్లదటంచు …” శతాబ్దాల తరువాత వ్రాయబడినది. నన్నెచోడుడు మానిని, మణిగణనికర వృత్తాలను కూడా ముద్రాలంకారముతో వ్రాసినాడు…..
   ఇవికాక మరికొన్ని ఆసక్తికరమైన లంకెలు క్రింద ఇస్తున్నాం-
   http://www.eemaata.com/em/issues/200803/1207.html
   http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=261&PageNum=1
   http://sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=23509&Categoryid=13&subcatid=0


Leave a Reply

%d bloggers like this: