ఫిబ్రవరి 28, 2013

(వివి వి) నాయక్ – చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 5:13 సా. by వసుంధర

nayak

ఇటీవల ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలో- ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె అనే కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు వేమూరి రాధాకృష్ణ ప్రముఖ సినీదర్శకుడు వివి వినాయక్‍ని ఇంటర్వ్యూ చేశారు (భాగం 1, భాగం 2). అందులో నేటి సినిమాల గురించి ఆయన విద్యార్థులతో పంచుకున్న భావాలు, వారి ఆందోళనకు ఇచ్చిన జవాబులు- నేటి సమాజంపట్ల సినిమావారికున్న బాధ్యతారాహిత్యాన్ని ప్రతిబింబించాయి. మచ్చుకి రెండుః సినిమాల్లో హింసాత్మకంగా, రక్తాత్మకంగా కొట్టుకుంటారే- ఆ దృశ్యాలు చిన్నపిల్లల వినోదానికిట. అసభ్య నృత్యాలు అందరి వినోదానికీనట.  

ఆ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సరికొత్త తెలుగు చిత్రం నాయక్. ఇందులో ఆయన తన అభిప్రాయం మేరకు చిన్నపిల్లలకూ, అందరికీ పుష్కలంగా వినోదం పంచిపెట్టారు.

పెద్ద హీరోల తెలుగు చిత్రాలంటే అవి- హీరో యొక్క, హీరో కోసం, హీరో చేత. ఆ హీరోకి లక్షలాది అభిమానులుంటారు. వారికోసం కోట్లాది ప్రేక్షకులు ఆ చిత్రాన్ని భరించాలి.  ఈ చిత్రంలో పెద్ద హీరో రామ్ చరణ్ తేజ. రామ్ చరణ్ పెద్ద హీరో ఎలా అయ్యాడంటే దానికి రాహుల్ గాంధీ అంత మామూలు కథ ఉంది. అదిక్కడ అప్రస్తుతం.

ఈ చిత్రం కథ వినాయక్ పాత చిత్రాలంత పాతది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమీక్ష 1, సమీక్ష 2 చదవండి, చాలు.

నటీనటుల విషయానికి వస్తే- ఏమాటకామాటే చెప్పుకోవాలి- ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫరవాలేదనిపించాడు. కారణం- మనం అలవాటు పడుతుండడమే. ఎటొచ్చీ ద్విపాత్రాభినయం పేరిట- ఏమాత్రం వైవిధ్యం లేని ఒకే తరహా పాత్రలు రెంటిని పోషించాడు.  వైవిధ్యం పాత్రల్లో లేదో- నటనలో లేదో తెలియదు. ఆరంభంలో ఒక ఫైటు, ఒక పాటలో చాలా బాగా చేశాడనిపించింది. ఆ తర్వాత మళ్లీ వైవిధ్యం సమస్య. అతడి స్టెప్స్, కదలికలు బోరు కొట్టాయి. కథానాయికల్ని కథానాయికలని ఎందుకనాలో తెలియదు. ఐటమ్ డ్యాన్సులో కనిపించిన చార్మీకంటే ఈ ఇద్దరూ మరి కాసేపు ఎక్కువ కనిపించారేమో. ఆ లెక్కన మాకైతే ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు (ఐటమ్ డ్యాన్సర్స్) అనిపించింది. కాజల్ మరీ కృతకంగా అనిపిస్తే, అమలాపాల్ ఆమెకంటే మెరుగు అనిపించింది. చార్మీ చలాకీగానూ, డమరుకం చిత్రంలోని గరమ్ చాయ్ పాటలో కంటే మెరుగ్గానూ అనిపించింది. ఆమె విచ్చలవిడి, హుషారు చూస్తే- ఐటమ్ డ్యాన్సరుగా స్థిరపడిపోవడానికి తంటాలు పడుతున్నట్లుంది. ఈ సినిమాలో హాస్యనటులు ప్రతిఒక్కరూ అసమాన ప్రతిభ చూపారు. విలన్‍గా రావత్ మరీ మూసగా ఉన్నాడు. పోలీసు ఆఫీసరుగా అసీష్ విద్యార్థి హుందాగా ఉన్నాడు. కామెడీలో ఎమ్మెస్ నారాయణ, విలనీలో రాహుల్ దేవ్ వైవిధ్యంగా రంజింపజేశారు.

పాటలు చూస్తున్నంతసేపూ ఫరవాలేదు. తర్వాత మర్చిపోవచ్చు. వినడానికీ ఓమాదిరి. సినిమాయే పలుచిత్రాల రీమిక్స్ అనుకుంటే, ఇందులో ఓ రీమిక్స్ పాట కూడా ఉంది. విజయానికి కొన్ని మెట్లలో అదొకటని సెంటిమెంటు కాబోలు. సంభాషణలు రచయిత సామర్ధ్యాన్ని తెలియజేస్తాయి కానీ నిగ్గు తేల్చవు. పిండి కొలదీ రొట్టె. చిత్రాన్ని బట్టి డైలాగ్సు. ఫొటోగ్రఫీ- గొప్పగా అనిపించింది.

ఇది ఎంతగా హీరో చిత్రమో, అంతగా దర్శకుడి చిత్రం కూడా.  కథ ఎలా ఉన్నా మొదటి సగం కథనం చాలా బాగుంది. రెండో సగం కథ ఎంత పేలవంగా ఉన్నా కథనంలో బిగి ఉంది. కథ నేపథ్యం కలకత్తా. చిరంజీవికి (చూడాలని ఉంది) అచ్చొచ్చిందని ఎన్నుకున్నారేమో. ప్రేక్షకుల సౌలభ్యం కోసమే ఐనా కలకత్తా గూండాలందరూ తెలుగు మాట్లాడ్డం కూడా ఓ కామెడీ ట్రాక్ అనుకోవచ్చు. సినిమా పూర్తయ్యాక కాస్త అసంతృప్తిగా అనిపించినా చూస్తున్నంతసేపూ విసుగనిపించదు. చూస్తుంటే దర్శకుడు ప్రతిభావంతుడని స్పష్టమౌతుంది కానీ- సృజనాత్మకత కూడా ఉంటే చిత్రం ప్రయోజనాత్మకంగా కూడా రూపొందేదేమో అనిపిస్తుంది. ఐతే ఏమాటకామాటే చెప్పుకోవాలి కదా- అంతోఇంతో సృజన, ప్రయోజనం ఉందనిపించే టాగూర్ చిత్ర దర్శకుడు కూడా వినాయకే మరి. ఆ చిత్రంలో అవినీతికి వ్యతిరేకంగా భీకర పోరాటం చేసిన పాత్రలో నటించిన చిరంజీవి- రాజకీయాల్లో ప్రవేశించి ఉన్న పార్టీలేవీ నచ్చక స్వంతంగా పార్టీ పెట్టి- టికెట్లివ్వడంలో అవినీతి జరిగిందన్న (అప)వాదుకు గురయ్యారు. ఆ తర్వాత తన పార్టీని- అవినీతి కుంభకోణాల్లో పీకెలదాకా ఇరుక్కుపోయిన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి- కేంద్రమంత్రి అయ్యారు. ఇప్పుడాయన మాటల్లో అవినీతి ప్రసక్తి వినిపించదు. టాగూర్ పాత్రలో జీవించిన హీరోమీదే ప్రభావం కనపడని ప్రయోజనాత్మక చిత్రాల జోలి తనకెందుకులే అనుకుని ఎలాగోఅలా నాలుగు డబ్బులు చేసుకునే చిత్రాలు తీయాలని వినాయక్ సంకల్పం కావచ్చు. ఈ చిత్రవిజయంతో అది నెరవేరింది.

మిర్చి సినిమా థియేటర్ల వద్ద క్యూలు కట్టిన మన జనానికి-  అన్నా హజారే హైదరాబాదు వస్తే పడుతుందా? మన దర్శకులు మనకోసమే తీస్తున్నారేమో ఈ చిత్రాలు. వినాయక్ యంగిస్థాన్‍లో చెప్పింది నిజమేనేమో ఆలోచించండి.

Leave a Reply

%d bloggers like this: