మార్చి 27, 2013
జాగృతి పోటీ కథల విశ్లేషణ
2012 దీపావళికి జాగృతి వారపత్రిక నిర్వహించిన కథల పోటీ ఫలితాలు గతంలో ఇచ్చాం. విజేతలకు బహుమతి ప్రదాన సభకు ఆహ్వానం ఇటీవల ఇచ్చాం.
ఆ కథలపై వసుంధర విశ్లేషణ జనవరి 2013 రచన మాసపత్రికలో వచ్చింది. ఆ విశ్లేషణ యథాతథంగా ఇక్కడ పొందుపరుస్తున్నాం.
జాగృతి వారపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలో (2012) కీర్తిశేషులు వాకాటి పాండురంగారావు స్మారక జాగృతి కథాపురస్కారం అందుకున్న ఐదు కథలనిక్కడ పరిచయం చేస్తున్నాం.
ప్రథమ బహుమతి
శేషప్రశ్న : ఆమెకు నలబైఆరేళ్లు. భర్తతో తీర్థయాత్రలకు వెళ్లింది. కొన్నాళ్లయినా భవబంధాలన్నీ పూర్తిగా మర్చిపోవాలనుకుంది. ఓ మావటి ఏనుగుని హింసించినా, ఓ ముసలమ్మ కోతిని బాధించినా, కోనేరులో జారిపడి చచ్చి బ్రతికిన భర్తను తనే చెంప చెళ్లుమనిపించినా- అది అనుబంధమో, బంధనమో తెలియని శేషప్రశ్న అని గ్రహించిన ఆమె మనవడు జ్వరంతో ఉన్నాడని తెలిసి యాత్రను మధ్యలో విరమించుకుని తిరుగుప్రయాణమయింది. భాష, శైలి, కథనం, పాత్రచిత్రణ, సన్నివేశకల్పన, సందేశం అన్నీ అద్భుతంగా అమరిన లోతైన గొప్ప కథ. రచయిత్రి నందిరాజు పద్మలత జయరాంకి అభివందనాలు.
ద్వితీయ బహుమతి
హిమాగ్ని : భూషణానికి తాగే అలవాటే కాదు- నోటి దురుసు, చేతి దురుసు కూడా ఉన్నాయి. అతడంటే భార్యాబిడ్డలకి భయం. అపార్ట్మెంట్స్ వాచ్మన్, ఇరుగు పొరుగులు, ఆఫీసులో సహద్యోగులూ- అందరికీ అతడంటే భయంతో కూడిన గౌరవం. భర్త తీరుని మనసులో ఏవగించుకునే అతడి భార్య- అతడు ప్రమాదంలో చనిపోతే స్వేచ్ఛానుభూతి పొందింది. భర్త ఉద్యోగం తనకి రాగా తనదైన నెమ్మదితనంతో జీవితం నడుపుతుంటే కొన్నాళ్లు బాగానే గడిచింది. కానీ భర్తకు భయపడినవారంతా- క్రమంగా ఆమె నెమ్మదితనాన్ని లోకువ కట్టి వేధిస్తుంటే- అప్పుడామె తనకిలా కాక భూషణం భార్యగా మారింది. వాస్తవానికి అద్దం పట్టిన ఈ కథలో ఆరంభం, ముగింపుల అన్వయం అలరిస్తుంది. సన్నివేశాల విశ్లేషణ అద్భుతం. కథకి పెట్టిన పేరు కథంత గొప్పగానూ ఉంది. భాష, శిల్పం, కథనం ఉన్నతంగా ఉన్నాయి. ఇలాంటి ఇతివృత్తాన్ని ఇలా వ్రాసినవారు అరుదు. ఆలోచించగల యావద్భారత పౌరులకూ గొప్ప సందేశమిచ్చిన ఈ కథా రచయిత తులసి బాలకృష్ణకు అభివందనాలు.
తృతీయ బహుమతి
స్నేహబంధం : సంపద, హోదాలే ప్రధానమనుకున్న సాంబమూర్తికి వృద్ధాప్యంలో అయినవాళ్ల ఆదరణ లేదు. మానవత్వం, మంచి- ప్రధానమనుకున్న మంగారావుకి వృద్ధాప్యంలో ఎందరో ఆత్మీయులు. మంగారావు, కుటుంబం తనపట్ల చూపే ఆదరాభిమానాలు చూసి- రక్తబంధం కంటే స్నేహబంధమే గొప్పదని గ్రహిస్తాడు సాంబమూర్తి. కథాంశం, సన్నివేశాలు రొటీన్. రచయిత ఉద్దేశ్యం మన దేశపు సంస్కృతి ఔన్నత్యాన్ని నిరూపించడమైతే ఆ విశ్లేషణ పేలవంగా ఉంది. స్నేహం గొప్పతనాన్ని చెప్పడమైతే అందుకు తగిన సన్నివేశాలు కల్పించలేదు. కొత్తదనం లేని ఈ రచనలో చదివించే కథనం ఉంది. రచయిత అలపర్తి రామకృష్ణకి అభినందనలు.
ప్రత్యేక బహుమతి
లక్ష్యం : ‘ఒకరితో పోలికా, పోటీ పెట్టుకుంటే మన ప్రయాణం బహిర్ముఖమౌతుంది. ఆధ్యాత్మికమైన ఉన్నతికి మనిషి అంతర్ముఖుడు కావాలి. మాయ తొలగించుకుని చూస్తే గమ్యంలోనూ పోటీ లేదు, మార్గంలోనూ పొటీ లేదు’ అన్న సందేశాన్ని నేటి పోటీ యుగంలో తలిదండ్రులకు అందించిన అర్థవంతమైన ప్రయోజనాత్మక కథ ఇది. రచయిత్రి టి. శ్రీవల్లీ రాధికకి అభినందనలు.
ప్రత్యేక బహుమతి
జీవనసాఫల్యం : బాధ్యతలు లేని రికామీ జీవితం బాగున్నట్లే ఉండొచ్చు. కానీ మనిషికి బాధ్యతలు స్వీకరించి నిర్వహించడంలోనే సంతృప్తి ఉంటుంది. అర్థవంతమూ, ప్రయోజనకరమూ అయిన ఈ సందేశాన్ని- గురుమూర్తి జీవనసాఫల్యంలో ఇమిడ్చిన కథనం బాగుంది. రచయిత డా. యం. సుగుణ రావుకి అభినందనలు.
ప్రత్యేక బహుమతి
రెప్పచాటు ఉప్పెన : ఇద్దరమ్మాయిల స్నేహానుబంధాన్ని రసవత్తరమైన ప్రేమకథగా మలచిన వచనకవిత లాంటి కథనం. మధ్యలో మెరిసిన మధ్యవయస్కుడు సాంబమూర్తి పాత్ర- రచయిత పరిణతికి నిదర్శనం. విషాదాంతమైన ఈ కథకు పాఠకుల మనసు కలుక్కుమనిపించడమే ఒక ప్రయోజనం. రచయిత మంత్రవాది మహేశ్వర్కి అభినందనలు.
ఆకునూరి మురళీ కృష్ణ said,
ఏప్రిల్ 1, 2013 at 10:26 సా.
వసుంధర గారి సమీక్ష ఎప్పటిలాగే కథలా ఆసక్తికరంగా చదివించింది. సమీక్ష చదివి తులసి బాల కృష్ణ గారి కథ చదివాను (జాగృతి పత్ర్రిక నెట్లొ వెదికితే దొరికింది.) కథ బాగుంది. సాహితీ సమాచారాన్ని ఇంత చక్కగా అందిస్తున్న వసుంధర దంపతులకు కృతజ్ఞతలు. రచనలొ వచ్చే సహితీ వైద్యం శీర్షికని కొంత ఆలస్యంగానైనా అక్షరజాలంలో వుంచితే బాగుంటుంది. ఆలొచించండి.
– ఆకునూరి మురళీ కృష్ణ
వసుంధర said,
ఏప్రిల్ 2, 2013 at 9:17 ఉద.
ముందుగా మీ అభిమానానికి ధన్యవాదాలు. సాహితీవైద్యంలో అంశాలను క్రమంగా అక్షరజాలంలోనూ ఉంచాలన్న ఆలోచన ఉంది. సమస్య సమయాభావం. త్వరలో దాన్నించీ బయటపడగలమని ఆశ.
darbha lakshmi annapurna said,
మార్చి 28, 2013 at 12:15 ఉద.
kluptamgaa yichchina
bahumati kadhala visleshana chaala baavumdi.6nimushaallo6kadhalani chadivina anubhooti kaligimdi
poteelavivaraalu utsaahanni kaligimchaayi.vasudharagaariki dhanyavaadamulu!