మార్చి 31, 2013

పిజ్జా- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:58 సా. by వసుంధర

pizza

సస్పెన్స్ చిత్రాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. హారర్ చిత్రాలు భయపెడతాయి. హాస్య చిత్రాలు నవ్విస్తాయి. ఈ మూడింటినీ కలిపే ప్రయత్నం హిందీలో చేసింది మన తెలుగువాడు రామగోపాలవర్మ. ఆయన తీసిన డర్‍నా మనాహై ఈ కోవకు చెందిన అద్భుత చిత్రం. అయితే ఆ తర్వాత ఆయన తీసిన హారర్ చిత్రాలు- భయం, ఉత్కంఠ విషయంలో నవ్వుల పాలయ్యాయి. కథకి బదులు సన్నివేశాలకీ, కొత్తదనానికి బదులు మూసకీ, దర్శకత్వానికి బదులు కెమేరాకీ, ప్రేక్షకుల ఆసక్తికంటే తన సరదాకీ- ప్రాధాన్యమివ్వడం అందుకు కారణం కావచ్చు.  

ఏది ఏమైనా హారర్ చిత్రాల విషయంలో ఇంతవరకూ మన సృజన హాలీవుడ్‍ని అనుసరించడానికో, అనుకరించడానికో మాత్రమే పరిమితమైన చిత్రాలే ఎక్కువ.  హాలీవుడ్‍ని మించగలమని ఋజువు చేసే చిత్రాలుంటే ఆ జాబితాలో తప్పక చేరాల్సిన చిత్రం ఇటీవలే విడుదలైన పిజ్జా.

ఉత్కంఠ, భయం, హాస్యం హుందాగా కలిసిన ఈ చిత్ర కథ (మరో సమీక్ష) 21వ శతాబ్దానిది. పాత్రలు మనకి పక్కింట్లోనే తారసపడ గలిగేటంత సహజం. ఏదో అనుకుంటే ఇదా అనిపించినా అసంతృప్తి కలిగించని ఈ చిత్రంలో దర్శకత్వపు ప్రతిభ అసమానం. మానవాతీత శక్తులు ఉన్నాయనిపించినా, నేరస్థుల్ని సమర్థించినట్లు అనిపించినా, సంప్రదాయానికి భిన్నత తోచినా- సహజంగానూ, తార్కికంగానూ అనిపిస్తుంది. పాటల చిత్రీకరణతో సహా (పాట 1, పాట 2) ఆద్యంతం అలరించే ఈ చిత్రానికి వ్యయం కోటిన్నర లోపే కావడం గమనార్హం.

హీరో విజయ్ సేతుపతి, హీరోయిన్ రమ్య నంబీశన్ తమ పాత్రల్లో జీవించారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకిది మొదటి చిత్రమంటే నమ్మడం కష్టం. ఇలాంటిది అతడికిదే ఆఖరుది కాకూడదని ఆశిద్దాం. తమిళంలో వచ్చిన ఈ కొత్త తరహా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకోసం అనువదించిన నిర్మాత సురేష్ కొండేటికి అభినందనలు.

అసభ్యత లేకపోతే వినోదం కూడా ఒక ప్రయోజనమే అనుకుని తీసిన చిత్రమిది. ఈ తరహా వినోదం మసాలా చిత్రాలకు అలవాటు పడినవారికి ఇమడక పోవచ్చు. కానీ అందరి మెప్పుకోసం కోట్లానుకోట్లు ఖర్చు చేసి చేతులు కాల్చుకుని రెంటికి చెడ్డ రేవడ కావడంకంటే- తక్కువ ఖర్చుతో కొంతమందినైనా వినోదపరచి మెప్పించి నాలుగు డబ్బులు మిగుల్చుకోవడం మంచిదని ఎక్కువమంది నిర్మాతలు గుర్తించి ఇలా ముందుకొస్తే- క్రమంగా ఇతర ప్రేక్షకుల్లోనూ మార్పు రావచ్చు.  

1 వ్యాఖ్య »

  1. pizza cinema choodaali anipinchetatluga unnadi mee sameexa.Andulonoo eemadhya theatreku velli choodatam baagaa thaggipoyindi koodaanu…….sare em chestaam theatre lone choostaam!


Leave a Reply

%d bloggers like this: