మార్చి 31, 2013

విశ్వరూపం- చిత్ర సమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 5:55 సా. by వసుంధర

????????????????????????????????????????????????

ఒక పేదవాడు తిండి కోసం తిరిగి తిరిగి అలసి సొలసి సొమ్మసిలి పడిపోయాడు. ఆ దృశ్యాన్ని ఓ పాత్రికేయుడు కెమేరాలో బంధించి మీడియా ముందుంచాడు. ఆ ఫొటో చూసిన ఓ కళాప్రియుడు దాన్ని లక్ష రూపాయలకు కొన్నాడు. ఓ డాక్టరు రోగనిర్ధారణ చేశాడు. ఓ కవి పాట వ్రాశాడు.  ఓ సంగీత విద్వాంసుడు దానికి వరస కడితే ఓ గాయకుడు తన గొంతులో పలికించాడు. వీరందరికీ జాతీయంగా గుర్తింపు వచ్చింది. ఒకే ఒక వ్యక్తి ఫొటోలో పేదవాడికి గుప్పెడు మెతుకులు పెట్టి, గుక్కెడు నీళ్లిచ్చాడు. పేదవాడు బ్రతికాడు- ఎందరో కళాకారుల్నీ, వృత్తి నిపుణుల్నీ, కళాప్రియుల్నీ బ్రతికించడానికి.

మన దేశాన్ని భయంకరమైన పేదరికంతో పాటు పీడిస్తున్న మరో భయంకర సమస్య ఉగ్రవాదం. ఆ సమస్యకు స్పందించిన  కమల హాసన్ సుమారు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశ్వరూపం అనే ఓ చలనచిత్రం తీశాడు. వ్యయ ప్రయాసలకోర్చి, వివాదాలకు లొంగి మొత్తంమీద ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం విడుదల చేశాడు.

చిత్రంలో ఉగ్రవాదపు మూలాలున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‍లో మున్నెన్నడూ చూడని దృశ్యాలున్నాయి. కొంత అమెరికా ఉంది. కొంత సస్పెన్స్ ఉంది. బోలెడంత  యాక్షన్ ఉంది. వంద కోట్ల ప్రభలున్నాయి. అన్నింటికీ మించి కమల హాసన్ ఉన్నాడు. ఆయన దర్శకత్వం, నటన అద్భుతం అనవచ్చు. కానీ ఆయన నటుడిగా ఒప్పించాలంటే వయసుకు తగిన పాత్ర ధరించాలి. లేదా రజనీకాంత్‍లా మసాలా చిత్రాల్లో నటించాలి. దర్శకుడిగా రాణించాలంటే ఇలాంటి పాత్రలకు తగిన వేరే నటులకు అవకాశమివ్వాలి. వయసు చెడ్డది. సచిన్ తెండూల్కర్ అంతటివాణ్ణి ఇప్పుడు తన ప్రతిభ ఆటకా, కోచింగుకా అన్న సందిగ్ధంలో పడేసింది.

ఈ చిత్రంలో ఇంకా చాలామంది నటీనటులున్నారు. ఉన్నాలేనట్లే. కొన్ని పాటలు కూడా ఉన్నాయి. అవీ ఉన్నా లేనట్లే- కథ లాగే. (ఇంకా సమీక్ష 1   సమీక్ష 2)

ఇది హాలీవుడ్ చిత్రాల్ని మించిన స్థాయిలో ఉన్న హాలీవుడ్ చిత్రం. జేమ్స్‍బాండ్ చిత్రాల తరహాలో ఉన్న ఈ చిత్రం- ఆ చిత్రాలంత ఆసక్తికరం అనలేం. కానీ- ఇటీవల వచ్చి పాత రికార్డులన్నీ బద్దలు కొట్టిన స్కైఫాల్ కంటే చాలా బాగుందనే చెప్పొచ్చు. ఐతే ఎంత బాగున్నా మన దేశంలో హాలీవుడ్ తరహా జేమ్స్‍బాండ్ చిత్రాల్ని ఎన్నాళ్లు చూస్తారు? ఈ చిత్రమూ అంతే కావచ్చు. ఇది మనకోసం మనవాడు మనదికాని పద్ధతిలో తీసిన మన సినిమా. ఈ సినిమా వల్ల ఉగ్రవాదం సమసిపోదు కానీ- ప్రేక్షకుల గుండెలు బద్దలు చెయ్యొచ్చు. ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టినా ఆ డబ్బు నిర్మాతది అనుకుంటే పొరపాటు. అది ప్రేక్షకులనుంచి వచ్చినదే కదా. ఆ ప్రేక్షకుడి అవసరాన్ని మన నిర్మాతలూ, కళాకారులూ ఎలా తీరుస్తున్నారనేది ఈ సమీక్ష ఆరంభంలో ప్రస్తావించాం. ఆ ప్రస్తావన మరొక్కసారిః

ఒక పేదవాడు తిండి కోసం తిరిగి తిరిగి అలసి సొలసి సొమ్మసిలి పడిపోయాడు. ఆ దృశ్యాన్ని ఓ పాత్రికేయుడు కెమేరాలో బంధించి మీడియా ముందుంచాడు. ఆ ఫొటో చూసిన ఓ కళాప్రియుడు దాన్ని లక్ష రూపాయలకు కొన్నాడు. ఓ డాక్టరు రోగనిర్ధారణ చేశాడు. ఓ కవి పాట వ్రాశాడు.  ఓ సంగీత విద్వాంసుడు దానికి వరస కడితే ఓ గాయకుడు తన గొంతులో పలికించాడు. వీరందరికీ జాతీయంగా గుర్తింపు వచ్చింది. ఒకే ఒక వ్యక్తి ఫొటోలో పేదవాడికి గుప్పెడు మెతుకులు పెట్టి, గుక్కెడు నీళ్లిచ్చాడు. ఆ వ్యక్తికి ఏ గుర్తింపూ రాకపోయినా- పేదవాడు బ్రతికాడు- ఎందరో కళాకారుల్నీ, వృత్తి నిపుణుల్నీ, కళాప్రియుల్నీ బ్రతికించడానికి!

1 వ్యాఖ్య »

  1. CS SARMA said,

    VISWA ROOPAM 2, OF KAMAL HASAN IS FOOLISH ADVENTURE.


Leave a Reply

%d bloggers like this: