Site icon వసుంధర అక్షరజాలం

మిర్చి- చిత్రసమీక్ష

mirchi

భక్తొచ్చినా పగొచ్చినా పట్టలేమన్న మాట మనకు బాగా వర్తిస్తుంది. వాల్మీకి రామాయణం వ్రాస్తే దానికి తెలుగులో నాటి భాస్కర, గోపీనాథులనుంచి నేటి విశ్వనాథ వరకూ ఎందరో  కావ్యరూపమిచ్చారు. రామాయణంమీద చలనచిత్రాలు కూడా తరచుగా వస్తూనే ఉన్నాయి. 1963లో సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన లవకుశ- రమణ రాతగా, బాపు తీతగా శ్రీరామరాజ్యమై గత సంవత్సరమే మన ముందుకొచ్చింది. మళ్లీ మళ్లీ అదే ఎందుకూ అంటే కొంత మన భక్తి, కొంత వినూత్న శక్తి- కారణ మనుకోవచ్చు. ఏది ఏమైనా భక్తొస్తే పట్టలేకపోవడమే కాక- అక్కడ రామచరిత పట్ల అనురక్తి, అంకితభావం కూడా ఒక ముఖ్య కారణమని తెలుస్తూనే ఉంటుంది.

పగలు, విద్వేషాలు, హింస, రక్తపాతాలు సీమని (రాయలసీమని కాదు, చిత్రసీమని) ఏలేస్తున్న సమయంలో వాటి మధ్యన కొంత హాస్యాన్ని ఇమిడ్చిన ఢీ చిత్రం నమూనా చిత్ర నిర్మాతల్ని ఎంతలా ఆకర్షించిందంటే- ఆ చిత్రం శీను వైట్లాయణమై బిందాస్ వంటి ఎన్నో చిత్రాలకు మార్గదర్శకమైంది. పగొస్తే పట్టలేకపోవడమే కాదు- భావదారిద్ర్యం, సృజనాత్మకత లేమి, అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలన్న దురాశ, విలువల పట్ల ఏమాత్రం గౌరవం లేకపోవడమే అందుకు ముఖ్య కారణమని తెలుస్తూనే ఉంటుంది.

అలా- ఓ పాత కథని పాత సన్నివేశాలతో పాత పద్ధతిలోనే చిత్రానువాదం చేసి కొత్త నటీనటులతో కొత్త చిత్రంగా ఈ ఫిబ్రవరి 8న ప్రేక్షకులమీదికి వదిలిన ఓ భారీ బడ్జెట్ చిత్రం మిర్చి.

ఈ చిత్రంలో కథ, పాత వాసనల గురించి సమగ్రంగా చర్చించినవారున్నారు కాబట్టి (సమీక్ష 1, సమీక్ష 2)- మనం ఇతర సాధారణ అంశాలను పరిశీలిద్దాం.

హీరో ప్రభాస్ నటుడిగా అభిమానులు కానివారిని కూడా మెప్పించే స్థాయికి చేరుతున్నాడు అనిపిస్తుంది ఈ చిత్రంలో. సంభాషణలు కూడా మెరుగ్గా చెబుతున్నాడు. తన పాత్రలో హుందాగా ఇమిడిపోయాడు. ఎత్తుగా, అందంగా ఉన్న అతడి సమక్షం ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. ఐతే అభిమానులు కానివారు- నృత్యాల్లో అతణ్ణి భరించడం కష్టమే. ఇక్కడో విషయం చెప్పాలి. ఉత్తరాదివారికి నృత్యం జీవితంలో భాగం. వారి హీరోలు చాలామంది నాట్యకదలికలు సహజంగా ఉంటాయి. అయినప్పటికీ ధర్మేంద్ర, సంజీవకుమార్, సన్నీ డయాల్ వంటివారు తమ శరీరానికీ, కదలికలకూ సమన్వయం లేదని గ్రహించి నృత్యాలకు వీలైనంత దూరంగా ఉండేవారు. అమితాబ్ బచ్చన్ కూడా- ప్రజలు తనని సూపర్ స్టార్ చేశాకనే నృత్యాలు ఆరంభించి- సెబాసని కూడా అనిపించుకున్నాడు. ప్రభాస్ తన నృత్యాల విషయంలో అభిమానులు కానివారిని బాధ పెట్టకూడదని గ్రహించడం మంచిది.

సినిమా ఇటలీలో మొదలయింది. చిత్రారంభమే ప్రభాస్ నృత్యంతో. అది చాలదన్నట్లు అతడి చేతిలో ఒక సంగీత పరికరం కూడా. ఎలా భరించాలా అని భయపడేవారు దిగ్భ్రాంతులయ్యేలా- జరిగింది చిత్రీకరణ. ప్రభాస్ పెద్దగా నాట్యంచెయ్యడు. గోడకు వాలి నిలబడో, ఫ్రీజ్ షాట్‍లోనో కనిపిస్తాడు. ఆ స్థిర దృశ్యాల్లో ప్రభాస్ గొప్పగా ఉన్నాడు. నాట్యపరంగా ప్రభాస్ పరిమితుల్ని అవగాహన చేసుకుని దర్శకుడు, నృత్యాచార్యుడు ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దిన తీరుకి జోహార్లు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అయిపోతుందనునుకున్నారేమో- వారు మిగతా పాటల విషయంలో ఆ శ్రద్ధ తీసుకోలేదు.

ఈ చిత్రం రిచా గంగోపాధ్యాయతో మొదలౌతుంది. ఆమె ముద్దుగా, బొద్దుగా, అందంగా ఉంది. పాత నటి మీనాని గుర్తు తెచ్చింది. ఆధునిక దుస్తుల్లో కూడా హుందాగా కనిపించిన ఆమె తన పాత్రలో జీవించినట్లే అనిపిస్తుంది. రిచా మాత్రమే హీరోయిన్ అనుకునే సమయంలో అనుష్క కనపడి చివరికి తనే హీరోయిన్‍గా స్థిరపడుతుంది. ఆమె నటన తెచ్చిపెట్టుకున్నట్లు ఉన్నా అందగత్తెలు ఎలాగైనా చెల్లిపోతారు కదా. బాగుంది. బ్రహ్మానందం తన పాత్రకు నటనతో న్యాయం చేకూర్చాడు కానీ దర్శకుడు మాత్రం అతడి పాత్రకు అంతగా న్యాయం చేకూర్చినట్లు తోచదు. నాగినీడు సహజంగా ఉన్నాడు కానీ హీరోకిచ్చిన ప్రాధాన్యంలో కొట్టుకుపోయిన మిగతా పాత్రల్లో అతడిదీ ఉంది. అలనాటి నదియా ప్రభాస్‍కి అక్కలా ఉన్నా, అమ్మగా కనిపించి నేటి అమ్మలకు ప్రతినిధి అయింది. బాగుంది.

చిత్రం కనుల పండుగలా ఉంది. హింస, రక్తపాతం శృతి మించినా అదిప్పుడు మామూలే కదా!  పాటలు పాడుకునేలా ఉన్నాయి. కొన్ని కొన్నాళ్లపాటు (కొన్నాళ్లపాటే) నిలబడొచ్చు కూడా.  పాటల చిత్రీకరణకు రిచా, అనుష్కలు వన్నె తెచ్చారు. ఐటమ్ సాంగ్ చిత్రీకరణ అన్ని చిత్రాల్లోలాగే ఉంది. పాత చిత్రాల్లో ఏ పాట వినిపించినా ఆ కదలికలు అతికినట్లు సరిపోయేవి కానీ- మిర్చి మిర్చి అంటూ కొత్త పాట వినిపించారు. నృత్య కళాకారిణి కదలికలు- బంగారు కోడిపెట్ట నాటివే అయినా- ఆ శరీరానికి హంసనందిని ముఖాన్ని తగిలించారు. కావమ్మ మొగుడు అంటే కామోసు అనుకున్నట్లు- ప్రేక్షకులు కూడా ఇది మిర్చి చిత్రంకోసం తయారైన కొత్త పాట  అనుకున్నారు.

గోచిపాతరాయుళ్లుగా మనముందు తిరిగి మన కళ్లముందే కోట్లకు పడగలెత్తిన దెయ్యాలు వల్లించే వేదాల్ని విని జైకొట్టే జనాలకు ఓటు హక్కున్న జనస్వామ్యం మనది. హత్యలు, మానభంగాలు చేసేవారిని పోలీసులపై అధికారం చేసే నేతల్ని చేసే విచక్షణ మనది. వీటన్నింటికీ కారణం ఒక్కటే- మరుపు. మరుపు మనిషికి దేవుడిచ్చిన వరం కదా, ఆ వరం మనకి కాస్త ఎక్కువే. గతం మరచి- ఎన్నికల రోజున మనకి ఏ తాయిలాలందుతాయో, ఏ వాగ్దానాలు వినిపిస్తాయో- వాటినే లెక్కించుకుని అవినీతిపరుల్ని నెత్తికెక్కించుకునే మన జ్ఞాపకశక్తి మీద అంతులేని నమ్మకంతో మనముందుకొచ్చిన చిత్రం మిర్చి. గత చిత్రాల్ని పూర్తిగా మర్చిపోయి- ఈ చిత్రం ఆడియో విడుదలప్పుడూ, ప్రమోషన్ సందర్భాలలోనూ విన్న మాటలే గుర్తుంచుకుని ఈ చిత్రాన్ని చూస్తే- ఆద్యంతం ఆసక్తికరంగా అలరిస్తుంది. వినోదంతోపాటు సందేశాన్నీ అందిస్తుంది. మరోసారి చూడాలనీ అనిపిస్తుంది. నిజం చెప్పొద్దూ- మాకూ అనిపించింది.  

అందుకే ఏమో, లేక పోటీగా ఈమాత్రం చిత్రాలు మరి లేకనేమో- ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దర్శకుడు కొరటాల శివకు ఆ రంగంలో ఉన్న సామర్ధ్యానికి ఈ చిత్రం నిదర్శనం. సృజనాత్మక ప్రతిభకు తార్కాణమైన చిత్రాలు కూడా మున్ముందు అతడినుంచి రాగలవని ఆశిద్దాం.

Exit mobile version