ఏప్రిల్ 12, 2013

స్వామి రారా- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 5:35 సా. by వసుంధర

svami rara

కొంచెం ఒప్పు, కొంచెం తప్పు. కొంచెం ప్రేమ, కొంచెం ద్వేషం. కొంచెం సరదా, కొంచెం భయం. గతంలో తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఒక ఇంటి చుట్టూనో (హంతకులొస్తున్నారు జాగ్రత్త), ఒక శవం చుట్టూనో (పట్టుకుంటే పది వేలు), ఒక బొమ్మ చుట్టూనో (ఉపాయంలో అపాయం) తిరుగుతూ ప్రేక్షకులకు నవరసాలూ పంచాయి ఉత్కంఠభరితమైన అలనాటి కొన్ని సినిమాలు. ఆ తర్వాత హాస్యం, ఉత్కంఠ కలగలిసిన రామగోపాలవర్మ క్షణక్షణం, వాటికి భయాన్ని కూడా కలిపిన వంశీ అన్వేషణ– మరో తరహా చిత్రాలకు నాంది పలికాయి. ఇలాంటి చిత్రాలు తియ్యడానికి ఎంతోకొంత సృజనాత్మకత అవసరం కాబట్టి- మన ప్రసిద్ధ దర్శకులు వీటి జోలికి ఎక్కువగా పోరు. వారు తీసే రొటీన్ పగ, ప్రతీకారాల హింసాత్మక చిత్రాలనుంచి కాస్త విముక్తి కావాలనుకునేవారికోసం దర్శకుడు సుధీర్ వర్మ ప్రేక్షకులకు అందించిన కొత్త చిత్రం స్వామి రారా.

కేరళలో అనంత పద్మనాభస్వామి ఆలయంనుంచి తస్కరించబడిన ఓ విలువైన విగ్రహం ఎన్ని చేతులు ఎలా మారిందో- అది కథాంశం. ఓ మధ్య్తతరగతి దొంగల ముఠా, కరకు దేలిన హంతకుడు, జర్నలిస్టు, అవినీతి మంత్రి, మోసపు వ్యాపారులు- వీరంతా ఇందులో ఇమిడిన పాత్రలు. ఈ కథాంశాన్నీ, పాత్రల్నీ-ఆకర్షణీయమైన  చలన చిత్రంగా కూర్చింది ఓ ప్రేమ కథ.  

ఇది దర్శకుడి చిత్రం. చిత్రాన్ని ఇద్దరు హంతకులతో ప్రారంభించి- ఆ హత్యను కథ నడకకు అన్వయించి, క్లైమాక్సులో దాన్ని ముగించిన తీరు గొప్పగా ఉంది. అదలాగుంచితే- హీరో, హీరోయిన్ల పరిచయంలో దర్శకుడు ప్రేక్షకులకిచ్చిన షాక్ ముసిముసిగా నవ్విస్తుంది. విగ్రహం అమాయకుడైన బాలుడి చేతిలో పడ్డప్పుడు దాని ధర సున్నాతో మొదలై క్రమంగా కోట్లకు పాకడాన్ని అతడు చూపిన విధం తెలుగు తెరకు అసామాన్యం. ఫైట్సూ, ఫైట్స్‍ లాంటి రొమాన్సూ, ఐటమ్ డ్యాన్సూ లేకుండా ప్రేక్షకుల్ని ఆద్యంతం థియేటర్లో కూర్చోబెట్టగల అతడి ప్రతిభకు జోహారు.

హీరోగా నిఖిల్ ఆ పాత్రకోసమే పుట్టాడన్నంత సహజంగా నటించి తొలిసారిగా నేనూ నటుణ్ణే అనిపించుకున్నాడు. హీరోయిన్‍గా స్వాతి నటన సహజంగానే ఉన్నప్పటికీ- ఎందుకో ఎప్పుడూ సహజమేనా అనిపిస్తుంది. ఆమె కళ్లలో ఏదో తేడా- అందాన్ని కాస్త తగ్గించింది. అయినా ఆ పాత్రకు బాగా సరిపోయింది. నితిన్ సహచరిగా పూజా రామచంద్రన్ గొప్పగా ఉంది. విలన్ పాత్రలో జీవించగల రవిబాబు- మార్పుకోసమేమో ఈసారి నటించాడు. ఇంక జోగీ బ్రదర్స్, జీవా తదితరుల విషయానికొస్తే- వారి ప్రతిభకంటే దర్శకుడి ఎంపికను ఎక్కువగా మెచ్చుకోవాలి. అంతా తమతమ పాత్రలకు అతికినట్లు సరిపోయారు.

ఈ చిత్రంలో పాటల చిత్రీకరణ కొత్తగా బాగుంది. చిత్రానికి స్వామి రారా అని పేరు పెట్టారు కాబట్టి వరసలు పాశ్చాత్యంగా కాక మన శాస్త్రీయంగా తెలుగుతనంతో నిండిఉంటే శేఖర్ కమ్ముల గోదావరి పాటల్లా అలరించేవి. ఏదేమైనా ఈ పాటలు విసిగించవులెండి.

ఆద్యంతం చాలా బాగుందనిపించే ఈ చిత్రంలో క్లైమాక్స్‍ కి ఎన్నుకున్న అంశం చాలా చాలా బాగుంది. కానీ అందుకు దారితీసిన సన్నివేశాలు చాలా గజిబిజిగా ఉండి ఉత్కంఠ కంటే ఎక్కువగా విసిగించే అవకాశం ఎక్కువ. దర్శకుడు మున్ముందు ఈ విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఏదేమైనా హాల్లోంచి బయటకు వచ్చేశాక- ఈ విసుగుని మన్నించాలనే అనిపిస్తుంది.

కథకు అతికినట్లు సరిపోయిన అర్థవంతమైన టైటిల్. సమర్థవంతమైన దర్శకత్వం. సహజమైన పాత్రలు. అంతమాత్రాన ఇది గొప్ప చిత్రం అనలేము. కానీ కోట్లానుకోట్లు బూడిదలో పోసి- అభిమాన హీరోల చేత పదేపదే విన్యాసాలూ, రక్త తర్పణాలూ చేయించి- వినోదించండిరా ప్రేక్షకులూ అంటే బుద్ధిగా తలూపే అలవాటు మానుకోవాలన్న ఆశయం కొంతైనా ఉన్నవారికి- ఇది పుష్కలంగా వినోదాన్నిచ్చే మంచి చిత్రమేనని చెప్పాలి. కొందరు నిర్మాత-దర్శకుల్లో మార్పు తీసుకురావడానికి మన ప్రేక్షకులు ఇలాంటి చిత్రాల్ని ఆదరించడం- వారి ఆరోగ్యానికీ, చిత్ర పరిశ్రమ ఆరోగ్యానికీ కూడా అవసరం.

తక్కువ వ్యయంతో నిర్మించబడిన ఈ చిత్రం వసూళ్లు ఆశాజనకంగా ఉండడం ముదావహం.

2 వ్యాఖ్యలు »

  1. Vidya Sagar said,

    హీరో పేరు నితిన్ కాదు…..నిఖిల్ .హ్యాపీ డేస్ సినిమా లో ఉన్నాడు…..గమనించగలరు…

    • బుర్రలో ఉన్న నిఖిల్ అక్షరాల్లో నితిన్‍గా మారడం ఆశ్చర్యం. చాలా పెద్ద అచ్చు తప్పు. వెంటనే చూసి చెప్పినందుకు ధన్యవాదాలు. వెంటనే సవరించాము.


Leave a Reply

%d bloggers like this: