ఏప్రిల్ 28, 2013

బాద్‍షా- చిత్రసమీక్ష

Posted in Uncategorized at 11:38 ఉద. by వసుంధర

badshaw

అలనాటి ప్రముఖ హాలీవుడ్ నటుడు చార్లీ చాప్లిన్ గురించి ఓ కథ చెబుతారు. ఒకసారి అతణ్ణి అనుకరించడానికి పోటీలు జరిగితే మారుపేరుతో తనూ ఆ పోటీలో పాల్గొన్నాట్ట చాప్లిన్. అతడికి రెండో బహుమతి వచ్చిందిట. అలాగే మన ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల- తెలుగు సినిమాలకి తనదంటూ ఒక బాణీ కథ సృష్టించాడు. దానికి మనం శ్రీను వైట్లాయణం అని పేరు కూడా పెట్టుకున్నాం. దాన్నిప్పుడు చాలామంది అనుకరించి హిట్లు కొట్టేస్తున్నారు. మన బాణీని మనం కూడా మళ్లీ మళ్లీ మనమే ఎందుకు అనుకరించకూడదూ  అనుకున్నాడో ఏమో కానీ ఆయన కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకుల్ని ‘ఢీ’కొడుతూనే ఉన్నాడు. ఇటీవలే విడుదలైన బాద్‍షా చిత్రం అలాంటి మరో ఢీ. ఫలితం- చాప్లిన్‍ కథ గుర్తు రావడం.

దేవతలందర్నీ తన బానిసలుగా చేసుకున్న రావణుడు- సామాన్య మానవుడు రాముడి భార్యని ఎత్తుకుపోయి ప్రాణంమీదకి తెచ్చుకుంటే వాల్మీకి రామాయణం. అంతర్జాతీయ గూఢచారి దళాల్ని ఠారెత్తించిన మాఫియా నాయకుడు సాధు- ఒక మామూలు తెలుగు పిల్లాడు రామారావు తండ్రిని ఎత్తుకుపోయి- తన ప్రాణంమీదకు తెచ్చుకుంటే అది శ్రీను బాద్‍షా. భక్తిని నమ్మనివారికి కూడా ఎంతో కొంత తర్కం ఉంటుంది రామాయణ కథలో. రక్తినే నమ్మినవారికి కూడా తర్కం కనిపించదీ కథలో. ఎందుకంటే రామాయణం మనకు తెలియని కాలానిది. ఈ కథ మనమిప్పుడున్న కాలానిది.

మన రాజకీయాల్లో అవినీతి లేకున్నా, మన సినిమాల్లో కథ సున్నా కాకున్నా-  ఏదో తేడాగా ఉన్నట్లు భావించే ఓ అసహాయ స్థితిలో ఉన్నాం మనమిప్పుడు కాబట్టి ఈ చిత్రానికి సంబంధించి మిగతా విశేషాలే మనం ముచ్చటిద్దాం.

జూనియర్ ఎన్టీఆర్‍కి తప్ప ప్రపంచంలో ఏ మహత్తర శక్తికీ భయపడని ఒక మాఫియా డాన్ సాధు కథ ఇది. మాఫియా ఎత్తుగడలకూ, చర్యలకూ సంబంధించిన దృశ్యాలు- ఇంతకంటే  రోటీన్‍గా, అనాసక్తికరంగా చిత్రీకరించడం సాధ్యం కాదనిపించేలా ఉన్నాయి. ఈ చిత్రం మొత్తానికి- ఆరంభంలో కాజల్ పాత్ర, చివర్లో బ్రహ్మానందం పాత్ర చాలా బాగున్నాయి. రెండూ హాస్యభరితం. వాటికి దీటు రావాలనేమో- మధ్యలో ఉన్న మాఫియా కౄరత్వమూ, హింసా, యుద్ధాలూ కూడా హాస్యభరితం అయ్యాయి. అయితే ఆ విషయం దర్శకుడికి తెలియదు. ప్రేక్షకులకే తెలుస్తుంది.

ఈ చిత్రంలో డైలాగ్స్ బాగున్నాయి. అయితే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్‍ పేరుని పదేపదే ఉపయోగించుకోవడం- విసుగ్గానూ, చౌకబారుగానూ అనిపిస్తుంది. ఎన్టీఆర్ నిస్సందేహంగా మహానటుడూ, మహానాయకుడూ, మనకంటే చాలా గొప్పవాడూనూ. అంతమాత్రాన ఆయన్ని మహాత్ముడని ఆయన అభిమానులు కూడా అనుకోరు. ఆయనకు అభిమానం ఆర్జించిపెట్టింది ఆయన అసమాన నటన. ఆయన నాయకుడిగా రాణించినదీ నటుడిగా సంపాదించుకున్న అభిమానంతోనే. ఆయన్ని మన హృదయాల్లో మహానటుడిగానే నిలుపుకుందాం. ఆయన గురించి అంతకంటే ఎక్కువగా ఆలొచించేలా చేసే ఈ డైలాగ్స్- ఆశించిన ప్రయోజనాన్ని బెడిసికొట్టొచ్చు. ఈ విషయం- వంశాల గురించి అతిగా ప్రస్తావించే అందరు సినీ రచయితలూ గుర్తించడం అవసరం.

ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ బాద్‍షా- తమాషా ఉచ్చారణతో చాలా బాగుంది. ఆ పాటతో సహా మొత్తం పాటలన్నీ కూడా ఇలా విని అలా మర్చిపోయేలా ఉన్నాయి. అయితే చూడ్డానికి మాత్రం కనుల పండువగా ఉన్నాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్- చిత్రీకరించిన తీరు బాగుంది.  నటీనటుల విషయానికొస్తే-

జూనియర్ ఎన్టీఆర్ మొదటి భాగంలో ప్రేమికుడిగా ముచ్చటగా ఉన్నాడు. రెండవ భాగంలో పెళ్లి నిర్వాహకుడిగా తెలంగాణా యాసలో అద్భుతంగా రాణించాదు. అయితే ఈ చిత్రకథ బాద్‍షాది కదా. ఆ పాత్రలో అతడు ఇమడలేదు. బాద్‍షా అనగానే ఓ అమితాబ్, ఓ సీనియర్ ఎన్టీఆర్ లాంటివారు కలిగించే భావన కలిగించలేకపోయాడు. అతడి ముఖ్యపాత్ర బాద్‍షాయే కావడంవల్ల మిగతా పాత్రల్లో రాణించినా- కంత్రి, బృందావనం చిత్రాల్లో పాత్రలంతగా అలరించవవి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ నృత్యాలు అభిమానులకు మాత్రమే నచ్చుతాయి. కానివారికి ఎప్పుడూ ఇంతేనా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంచుమించు అన్ని పాటలకూ కూడా కోరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఆ పాటల్లో ఎన్టీఆర్‍ని వదిలి మిగతావారివైపే మనసు మొగ్గుతుంది. సంభాషణలు పలకడంలో తనకు సరివారు లేరనిపించుకుంటున్న ఎన్టీఆర్ నటుడిగా ఎదగడం లేదనిపిస్తుందీ చిత్రం చూస్తే.

చిత్రారంభంలో కాజల్‍ది నటనావకాశమున్న పాత్ర అనిపిస్తుంది. ఆమె నటన ఎలాగున్నా నటనకోసం శ్రమ పడుతోందనిపిస్తుంది ఆరంభంలో. ఆ అభిప్రాయం త్వరగానే పోతుంది ఆ తర్వాత. ఎందువల్లనో ఈ చిత్రంలో కాజల్ అంత అందంగా కూడా అనిపించలేదు. ఇక పాటల్లో అయితే ఆమె కదలికలు, భంగిమలు- ఈమె సినిమా అవకాశాలకోసం ప్రయత్నిస్తున్న కొత్త నటి కాదుకదా అనిపింపజేస్తాయి. అసలుకంటే వడ్డీ ముద్దులా, ఇప్పుడు అవకాశాలు ఆట్టే లేని తారలు చాలామంది ఐటమ్ డ్యాన్సులపై దృష్టి పెడుతున్నారు. వంటినిండా బట్టలున్నాయని తప్పిస్తే- కాజల్ నృత్యాలు ఐటమ్ డ్యాన్స్ తరహాలోనే ఉన్నాయి.

పాత్ర, సన్నివేశం అపురూపంగా ఉండడంవల్ల బ్రహ్మానందం కామెడీ గొప్పగా రాణించింది. నటనలో కూడా కొంత వైవిధ్యం చూపగలిగితే ఇంకా బాగుండేది. ఆసిష్ విద్యార్థి పాత్ర పరిపక్వం కాకపోయినా- అతడి నటనలో పరిపక్వత ఉంది. నాజర్ హాస్యనటుడిగా తన సామర్ధ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. వెన్నెల కిషోర్‍కి ఈ చిత్రంలో మంచి అవకాశం వచ్చింది కానీ ఉపయోగించుకోగల సత్తా అతడికి ఉన్నట్లు లేదు. అప్రధాన పాత్రల్లో కూడా రాణించగల తమ ప్రత్యేకతని చంద్రమోహన్, తనికెళ్ల భరణి ఈ చిత్రంలోనూ నిలబెట్టుకున్నారు. రామగోపాల వర్మపై వ్యంగ్య బాణాలు విసరడానికి సృష్టించిన ఎమ్మెస్ నారాయణ పాత్ర- నేటి వర్మ సినిమాల స్థాయిలోనే ఉంది. ఎమ్మెస్ నటన కూడా పేలవంగానే ఉంది. ఆర్య-2లో విలన్‍గా తన నటనా ప్రతిభతో మెప్పించిన నవదీప్ కూడా ఈ చిత్రంలో విలన్‍గా చాలా పేలవంగా అనిపించాడు. రాజీవ్ కనకాల, సిద్దార్థ్, సుహాసిని, ముఖేష్ రుషి, కెల్లీ దోర్జీ, ప్రదీప్ రావత్‍లు- ఈ చిత్రంలో ఎందుకున్నారో తెలియదు. ఆ పాత్రల్లో చాలావాటికి చిల్లర వేషాల వారికి సరిపోయేటంత మాత్రమే నిడివీ, ప్రాధాన్యమూ ఉన్నాయి. దర్శకుడి స్థాయికి తగ్గ ఖర్చు పెట్టడంకోసం వీరిని ఎన్నుకున్నారనుకోవచ్చు.  

గబ్బర్ సింగ్‍లో అంత్యాక్షరి పాట ఒకటి బాగా హిట్టయిందని ఈ చిత్రంలోనూ అలాంటి దృశ్యం ఒకటి చొప్పించారు. ఎక్కువగా సంసారపక్షం వేషాలు వేసే సుధ, సురేఖావాణి తదితరులు- సీనియర్ ఎన్టీఆర్ పాత చిత్రాల్లో అయిటమ్ సాంగ్స్ కి నర్తించడం విశేషం. వారి నృత్యాలు చూడముచ్చటగా ఉండడం, ఆ దృశ్యం మరీ పొడిగించక పోవడం, ప్రతి పాటకూ మధ్య జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తన తాతగారిని అనుకరిస్తూ నర్తించడం- ఆ దృశ్యాన్ని గొప్పగా రక్తి కట్టించాయి. ఈ చిత్రంలో జూనియర్ నృత్యం ఆసక్తికరంగా అనిపించినదీ ఒక్క దృశ్యంలోననే చెప్పాలి.  ఈ చిత్రంలో మెచ్చుకోతగ్గ మరో అంశం- అసభ్యత చాలా తక్కువగా ఉండడం.

రెండు గంటల నలబై నిముషాల సినిమాలో ప్రేక్షకులకి తృప్తినివ్వగలిగింది ఓ నలబై నిముషాలుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కోసం తీసిన ఈ సినిమాని బ్రహ్మానందంకోసం మాత్రమే చూడగలం అనిపిస్తుంది. శ్రీను వైట్ల మార్కుని శ్రీను వైట్లే అనుకరించి చప్పగా తీశాడనిపిస్తుంది. మొత్తం సినిమా చూసేక ఈ సినిమా ఎందుకు తీశారూ, ఎందుకు చూశామూ అనికూడా అనిపిస్తుంది. అయినా కాలక్షేపం అయిపోతుంది. అందుకో, మరెందుకో- ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చింది. బాగా ఆడుతోంది. అందువల్ల ఆ దర్శకుడినుంచీ, ఆ హీరోనుంచీ మళ్లీ ఇలాంటి సినిమాయే వస్తే అది ప్రేక్షకుల తప్పే అవుతుంది. ప్రేక్షకులు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూనే ఉంటారని సినీ నిర్మాతలూ, దర్శకులూ, హీరోలూ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూద్దాం.

ప్రతిభ అంటే పెద్ద తారలు, విదేశీ లొకేషన్లు. కోట్ల ఖర్చు అనుకుంటే- ప్రతిభకు మరో నిర్వచనమిచ్చి విజయవంతమౌతున్న చిత్రాలూ వస్తున్నాయి. అలాంటి ఓ చిత్రం గురించి ఒకటి రెండు రోజుల్లో మాట్లాడుకుందాం.

3 వ్యాఖ్యలు »

  1. durgaprasad d said,

    బాద్షా సమీక్ష చాలా బాగుంది. నిప్పక్షపాతంగా, నిర్మొహమాటంగా సవివర, సహేతుక విశ్లేషణ ఆద్యంతం ఆసక్తి కరంగా చదివించేదిగా ఉంది. నిజంగానే నాకు సినిమాకన్నా ఈ సినిమా సమీక్షే బాగుంది.


Leave a Reply

%d bloggers like this: