మే 5, 2013
పాడుతా తీయగా
ఉత్తమాభిరుచికి అద్దం పట్టే టివి కార్యక్రమాల్లో ఈ టివి సమర్పిస్తున్న పాడుతా తీయగా ఒకటి. బాసుగా (నేతగా) వ్యవహరిస్తున్న బాసు (బాలసుబ్రహ్మణ్యం) ఆ కార్యక్రమం రాణింపుకి కారణమని నిస్సందేహంగా చెప్పొచ్చు. కొంత వినోదం. కొంత సంగీతం. కొంత ప్రయోజనం. అన్నీ ఉన్నా అసభ్యతకూ, వెకిలితనానికీ తావులేని కార్యక్రమమిది. అప్పుడప్పుడు చప్పగా అనిపించినా వెనువెంటనే సరి చేసుకోగల సత్తా ఉన్న బాసు నిర్వహణలో సంగీత ప్రపంచానికి సంబంధించి ఎన్నో విశేషాలు తెలుస్తున్నాయి. ఒకసారి 1962లో మాయా పేరిట వచ్చిన ఓ హిందీ చిత్రం గురించి ప్రస్తావిస్తూ- అందులో సుభీర్ సేన్ పాడిన ఓ పాట అపశ్రుతులతోనే రికార్డవడం ఆశ్చర్యమన్నారు బాసు. ఐతే ఆ పాటలో లతా హమ్మింగ్ అద్భుతమని కూడా మెచ్చుకున్నారాయన. సలీల్ చౌదరి అంతటి సంగీత దర్శకుని ఆధ్వర్యంలో వచ్చిన ఆ పాటపై అలాంటి వ్యాఖ్య చెయ్యడానికి మరొకరికైతే సాహసముండాలి కానీ- బాసు స్థాయికి అది సంగీతజ్ఞానం అని మాత్రమే అనిపించుకుంటుంది. ఆ పాట ఎంతో ఇష్టమైనది కావడంవల్ల మేము మరోసారి ప్రత్యేకంగా వినడం జరిగింది. మనం పాడుకునే పాటల్లో స్పష్టంగా ఉండే అపశ్రుతులే మనం పట్టలేం. మరి ఇలాంటి పాటల్లో తెలుస్తాయా? అందుకని ఇప్పటికీ ఆ పాట అప్పటిలాగే బాగా అనిపించింది. ఇటీవల బాసు మరో కార్యక్రమంలో మళ్లీ ఈ విషయం ప్రస్తావించి తనవల్ల చిన్న పొరపాటు జరిగిందంటే- అపశ్రుతి విషయంలో కాబోలనుకున్నాం. కాదు- ఆ పాట పాడింది ద్విజేన్ ముఖర్జీ. సుభీర్ సేన్ కాదు. తనవల్ల చిన్న పొరపాటు జరిగినా బాసు సవరించుకుంటారని దీన్నిబట్టి అర్థమౌతోంది. ద్విజేన్ పాటలో అపశ్రుతి దొర్లిందనీ రూఢి ఔతోంది. ఆ పాటకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
పాడుతా తీయగాలో బయటపడ్డ మరో విశేషం- వరంగల్‌కి ఒకప్పుడు ఆంధ్రనగరం అన్న పేరుండేదిట. పేరులో ఆంధ్ర శబ్దంతో కలిసిన మరో ఊరు మనకు లేదుట.
ఈ టపాలో ముఖ్యంగా పంచుకోవాలనుకున్న విశేషం- ఏప్రిల్ 22, 2013న జరిగిన కార్యక్రమంలో శ్రీలలిత అనే పాప- నేటి గాయనులు గీతమాధురి, మాళవిక, సునీతలను- మాట, పాట, చేతల్లో అనుకరించడం. సంగీతం, వినోదం కలగలిసిన ఈ అంశాన్ని బాసు నిర్వహించిన తీరు చూసి తీరాల్సిందే. ఆ విడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆ తర్వాత వచ్చిన (ఏప్రిల్ 29, 2013) కార్యక్రమం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఇంత అరోగ్యకరమైన కార్యక్రమాన్ని అందిస్తున్న ఈటివిలో వస్తున్న- ఒక జుగుప్సాకరమైన కార్యక్రమం గురించి త్వరలో ముచ్చటించుకుందాం.
B.Ravikumar (Ex - Pune, Present Bangalore) said,
జూన్ 3, 2013 at 12:11 ఉద.
ఈ టీవి లొ వస్తున్న ఓ జుగుప్సాకరమయిన కార్యక్రమం గురించి మరోసారి ముచ్చటిస్తామన్నారు.. ఆల్రెడీ రాసేసారా.. నేనేమన్నా మిస్ అయ్యానా ఆ ఆర్టికల్..?!
వసుంధర said,
జూన్ 3, 2013 at 10:02 ఉద.
ఇంకా వ్రాయలేదు. ఈరోజునుంచి 2-3 రోజుల్లోగా వ్రాయవచ్చు.
Boddanapalli Ravikumar said,
మే 19, 2013 at 7:15 సా.
పాడుతా తీయగా లో శ్రీలలిత ఎపిసోడ్ గురించి తెలియపరిచినందుకు ధన్యవాదాలు… నిజంగా ఆద్భుతంగా చేసింది ఆ పాప..మేము చాలా ఎంజాయ్ చేసాము మీరు పంపిన యూట్యూబ్ లింక్ చూసి… థాంక్యూ!
T.S.Kaladhar sharma said,
జూన్ 2, 2013 at 8:09 సా.
Talented beatiful singer