మే 6, 2013

అరాక్షసత్వం

Posted in సాంఘికం-రాజకీయాలు at 3:08 సా. by వసుంధర

1970లలో కాబోలు- రాక్షసీ నీ పేరు రాజకీయమా వర్ధిల్లు- అనే పేరుతో జ్యోతి మాసపత్రికలో ఒక సీరియల్ నవల వ్రాశారు రచయిత ఆదివిష్ణు. అప్పుడు మనుషుల మధ్య రాజకీయం రాక్షసత్వం అయింది. ఇప్పుడు మనలో మనుషులనదగ్గవారున్నారా అంటే అనుమానమే

కులం, మతం, జాతి, భాష, యాస పేరిట కేవలం స్వార్థ ప్రయోజనాలకోసం సాటి మనిషిని ద్వేషించడమే కాదు- హింసించడానికి సిద్ధంగా ఉన్నాం.

వయసుతో నిమిత్తం లేకుండా- పుట్టింది మొదలు చచ్చే వయసులో ఉన్న ఏ ఆడదానిపైనయినా అత్యాచారానికి సిద్ధంగా ఉన్నాం.

అభిమాన హీరో సినిమా ఆడియో ఫంక్షన్ తొక్కిసలాటలోప్రాణాలు పోగొట్టుకుందుకు రెడీ. పక్కనే ఓ పేదరైతు, చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నా పట్టదు. మన సినిమావాళ్ల గురించి ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన వసుంధర కథకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నా- ఆ నాయకుణ్ణి నిరసించకుండా ఈ రోజుల్లో అంతా ఇంతేనని మన బుద్ధి కూడా బయటపెట్టుకుంటున్నాం.

తప్పేమిటీ అన్నది కాదు- తప్పు చేసిన వ్యక్తి కులం, మతం, జాతి, భాష, యాస, రాజకీయ పక్షం- ఇవన్నీ చూసేకనే తప్పొప్పులు నిర్ణయిస్తున్నాం.

మనలోంచే మన నాయకులు పుట్టుకొచ్చారు. మనని మనం దేనికైనా ఎప్పుడైనా తప్పు పట్టుకున్నామా? నవ్య వీక్లీలో వచ్చిన వసుంధర కథకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మన విలువలు ఏ స్థాయికి పడిపోయాయంటే- ఇటీవల దాడి వీరభద్రరావు అనే రాజకీయవాది తెలుగుదేశం పార్టీ వదిలి వైఎస్‍ఆర్ కాంగ్రెస్‍లో చేరారు. ఓకే. జగన్ నాయకత్వంపై తనకు ఆశ, నమ్మకం ఉన్నాయన్నారు. ఓకే.

కానీ ఒకప్పుడాయన వైఎస్‍ఆర్ పై చేసిన దారుణ విమర్శలను ప్రస్తావిస్తే- ఆ మాటలు పార్టీ తరఫున అన్నవి కాబట్టి వాటి గురించి సంజాయిషీ అడగకూడదన్నారు. శ్రీ దాడికి నిస్వార్థపరుడిగా మంచి పేరున్నదనీ, అయన ప్రవర్తన రాజకీయవాదులకి గౌరవాన్ని తెచ్చిపెట్టినదనీ, అంతా ఆయన్ని ముద్దుగా మేస్టారు అంటారనీ చెబుతున్నారు.  ఒక పార్టీలో ఉండగా ఆయన చెప్పిన మాటలు ఆయనవి కాదనీ, పార్టీవి మాత్రమేననీ అంటే ఇకమీదట ఎవరైనా ఏమైనా నోటికొచ్చిన మాట అనేసి పార్టీ మార్చేసి చేతులు దులుపుకోవచ్చా? ఒక మాఫియాలో పని చేసి హత్యలు చేసి- ఆ తర్వాత ఇంకో మాఫియాకి మారి- పాత హత్యలు పాత మాఫియావి అంటే చెల్లిపోతుందని మేస్టారు భావిస్తున్నారా? దీనికి ప్రజల స్పందన ఏమిటి? వారినుంచి స్పందన లేకపోతే ఇప్పుడు స్కాముల్లో ఉన్న ఎందరో కేంద్ర మంత్రులకు దారి చూపిన వారౌతారు. శ్రీ దాడి ఇంటర్వ్యూకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మనం మనుషులుగా ఉన్నప్పుడు అమానుషత్వాన్ని రాక్షసత్వం అనేవాళ్లం. మనమే రాక్షసులమనిపిస్తోందిప్పుడు. ఆదివిష్ణు ఇప్పుడు రాజకీయానికి ఏం పేరెడతారో? ఈ అరాక్షసత్వానికి మంచి పేరు మీరు కూడా వెదకండి.

 

 

 

Leave a Reply

%d bloggers like this: