మే 9, 2013
రామ్ చరణ్ మానస్
నటనతో జనాన్ని మెప్పించి జనబలాన్ని ధనబలంగా మార్చుకున్న మెగా స్టార్ చిరంజీవి. ఆ జనానికి సేవ చెయ్యాలన్న గాఢ ఆకాంక్షతో రాజకీయాల్లో చేరాలనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీవల్ల ప్రజాసేవ సాధ్యం కాదని తనే ప్రజారాజ్యం పేరిట ఓ పార్టీ పెట్టాడు. ప్రజాసేవకి మంత్రి పదవి అవసరమని ఎన్నికల్లో పోటీ చేశాడు. తల్లి పుట్టిల్లు మేనమామకి తెలియడంవల్లనో ఏమో- స్వంత ఊరు పాలకొల్లులో ప్రజలు అతణ్ణి ఎన్నుకోలేదు. రాష్ట్ర ప్రజలు కూడా మంత్రిపదవి వచ్చేటంతగా అతడి పార్టీ అభ్యర్థుల్నిఆదరించలేదు. పార్టీకంటే ప్రజాసేవే ముఖ్యమని- అందుకు మంత్రి పదవే ముఖ్యమని- ఆ పదవికోసం తాను ఒకప్పుడు నిరసించిన కాంగ్రెస్ పార్టీలోనే చేరి- ఓపికగా ఎదురుచూసి చివరికి మంత్రి కాగలిగాడు. నటుల సేవ ఎప్పుడూ పరోక్షంగానే ఉంటుందని తెలిసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు- అతడికి పరోక్షంగానే జనసేవ చేసుకునేందుకు వీలుగా పర్యాటక శాఖ ఇచ్చారు. ఏది ఏమైనా ఆయన మంత్రి అనిపించుకున్నాడు.
ఇక తాను ప్రజల మనిషి అని తన వీరాభిమానులకు అనిపించడమే కాక, తార్కికంగానూ అందరికీ అనిపించాల్సి ఉంది. ఈ విషయమై ఆయన ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా. అందులోనూ రచ్చకు పేరుపడ్డ తనయుడు రామ్ చరణ్ తేజ ఇంట్లో ఉన్నాడు. ఆపైన మన రాజకీయాల్లో చాలామంది నేతలకు తమ చేతలతో పాటు ‘సన్’స్ట్రోక్ మామూలు. ఆపైన ఇది ఎండా కాలం.
చదువులో మధ్యతరగతికి చెందిన రామ్ చరణ్- ధనంలో మధ్యతరగతికి చెందిన విద్యాధికులతో గొడవపడి- తన బాడీగార్డ్స్ చేత అడవి ఫణీష్ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరునీ, అతడి మిత్రుణ్ణీ నడి రోడ్డుమీదనే కొట్టించినట్లు పత్రికల్లో వార్తలూ, ఫొటోలూ వచ్చాయి. తన దారికి అడ్డు వచ్చారనీ, తర్వాత తప్పు తెలుసుకుని షమార్పణ చెబుతూ పోలీసులకి కాగితం ఇచ్చారనీ రామ్ చరణ్ అంటున్నాడు. ధనబలానికీ, అధికార బలానికీ భయపడి ఫిర్యాదు చెయ్యలేదు కానీ- క్షమార్పణ ఎందుకు చెబుతాను- దెబ్బలు తిన్నందుకా- అని ఫణీష్ అంటున్నాడు. ఫణీష్ ఇచ్చిన కాగితంలో క్షమార్పణ అంశం లేదని పోలీసులు అంటున్నారు. ఈ వివరాలన్నింటికీ ఇక్కడ క్లిక్ చెయ్యండి. జరిగింది మామూలు సంఘటన అనీ. ఇది అవకాశంగా తీసుకుని ప్రత్యర్థులు రెచ్చిపోయి చిరంజీవిపై బురద చల్లుతారనీ అభిమానులు కలవరపడుతున్నారు.
ఒక్క విషయం ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. పత్రికల్లో కనిపించే ఫొటోల్ని బట్టి అడవి ఫణీష్ దెబ్బలు తిన్న మాటా, ఆ కొట్టింది రామ్ చరణ్ బాడీగార్డ్స్ అనీ, ఆ దృశ్యం రామ్ చరణ్ కళ్లముందే జరిగిందనీ అనిపిస్తుంది. కథనం చదువుతూంటే- సినిమాల్లో హీరోగా కనిపించే వ్యక్తి- విలన్ పద్ధతిలో వ్యవహరించినట్లు కూడా అనిపిస్తుంది. ఫణీష్, అతడి మిత్రుడూ- ప్రచారంకోసం ప్రయత్నించిన మాట నిజమే అనుకున్నా కూడా- తప్పెవరిదైనా కూడా మనిషిని మనిషి కొట్టడం- అదీ నడి బజార్లో- నేరం అనిపించుకుంటుంది. అది తప్పు అని- చేసినవారు అంగీకరించాలి. అదీ జనం అభిమానించే (?) హీరో, జనసేవకు మంత్రిపదవిలో ఉన్న ఒక ప్రజానాయకుడి తనయుడు- ముందుగా తన బాడీగార్డ్స్ చర్యని నిరసించాలి. లేదా వారు ఫణీష్ని కొట్టలేదనీ, కొడితే కనుక- కొట్టినవారూ, కొట్టించిన వారూ అథములని తానే ఒక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది.
భక్త హృదయాల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న శ్రీరాముడు కూడా- వాలిని చెట్టుచాటునుంచి చంపినందుకూ, సీతని అడవులకి పంపించినందుకూ- ఎన్నో సంజాయిషీలు ఇచ్చుకున్నాడు. ఆయన భక్తులు కూడా ఇప్పటికీ వాటిని సమర్థించుకుందుకు తర్కానికి దిగుతున్నారే తప్ప- సంజాయిషీ అవసరం లేదని పేలేసి చెప్పడం లేదు. జనం వల్ల ధనం తెచ్చుకుంటున్న మనుషులకి, జనం నమ్మిన మనుషులకి, జనానికి నాయకులు అనిపించుకోవాలనుకుంటున్నవారికి- జనంతో వ్యవహరించేటప్పుడు అహాన్ని వదలక తప్పదని శ్రీరాముడి ఆదర్శం మనకి చెబుతోంది. తప్పెవరిదని కాక- తప్పు జరిగినప్పుడు- అందులో తన పేరూ వినిపిస్తున్నప్పుడు- ముందుగా ఇవ్వాల్సింది వివరణ, సంజాయిషీ- అని రామ్ చరణ్ గుర్తించాలి. అతడి మానసమందేమున్నా- అందుకు అనుగుణంగా చిరంజీవి తనయుణ్ణి సిద్ధం చెయ్యాలి. తప్పు అతడిది కాకపోతే- పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదన్నది- లబ్దప్రతిష్ఠులకు మరింతగా వర్తిస్తుంది. తల విలువ నోరు చెబుతుందని మన పెద్దల మాట!
sankari said,
మే 11, 2013 at 12:07 ఉద.
కొణిదెన ఆంజనేయ వర ప్రసాద్ గారి విషయములో సాటి సినిమా వ్యక్తులు, రాజశేఖర్ దంపతులకు జరిగిన ఘటనలో జరిగిన న్యాయం, తండ్రి నటనకేకాక బిరుదులకు కూడ వారసునిగా చెప్పుకొనే వారి తనయునికి సంబంధించిన ఘటనలో జరగబోయే న్యాయానికి ఏమి భేదముండదు. అందునా విదేశీ (‘ స్వదేశీ ‘ బహిష్కరణ ఎప్పుడో జరిగింది కదా ) కాగిరేసు పాలనలో చట్టం తనపని తను చేసుకొని పోవటం తప్ప పాలకులుగాని, రక్షక భటులు కాని చర్యలు తీసుకోరు. పరిపాలన కోర్టు కనుసన్నలలో జరగటం 21వ శతాబ్దములో – మేధావిగా ఒకప్పుడు పరిగణింపబడిన ప్రధాని గారి పాలనలో, మొండివాడిగా తనను తాను చట్ట సభలో ప్రకటించుకొనే ముఖ్య మంత్రిగారి ఏలుబడిలో దేశము, రాష్ట్రము సాధిస్తున్న ప్రగతికి నిలువెత్తు సాక్ష్యం. కొన్ని సందర్భాలలో మీడియాలో వచ్చిన వార్తల ఆధారముగా, ఫొటోల ఆధారముగా, విడియో క్లిప్పుల ఆధారముగా కేసులు నమోదుచేసే రక్షకభట శాఖ ఈ విషయములో నిర్లిప్తంగా ఉండటం తెరవెనుక వ్యవహారాలు జరిగినవన్న సామాన్యుల సణుగుళ్ళకు ఊతమిస్తున్నది. వెండితెరమీదదంతా నటనని, వ్యక్తిత్వాలు వేరని ఇప్పటికీ జనం గ్రహించలేక పోవటం దేశ దౌర్భాగ్యానికి సూచిక.
TVS SASTRY said,
మే 9, 2013 at 10:13 సా.
అలా ప్రవర్తించటం సామాజిక న్యాయం కోసమేమో!
టీవీయస్.శాస్త్రి