Site icon వసుంధర అక్షరజాలం

గుండె జారి గల్లంతయ్యిందే- చిత్రసమీక్ష

gunde jari gallantayyinde

మనిషెవరో తెలియకుండా ప్రియురాలిని ఊహించడం ఓ అకర్షణీయమైన కథాంశం. పాతతరంలో రాజకపూర్, నర్గీస్‍ల ప్రేమాయణంగా వచ్చిన ఆహ్ (తెలుగులో ప్రేమలేఖలు), నాగేశ్వరరావు, సావిత్రిల- ఆరాధన, 1997లో వచ్చిన ప్రేమలేఖ (హిందీలో సిర్ఫ్ తుమ్) చిత్రాల కథల్లో అలాంటి పోకడలున్నాయి. యండమూరి వీరేంద్రనాథ్ నవలల్లో పేరుపొందిన వెన్నెల్లో ఆడపిల్ల నవల కథాంశమూ అలాంటిదే. అయితే కథాంశంలో సామ్యం తప్పితే- వీటిలో ఏ ఒక్కటీ కథలో కానీ, కథనంలో కానీ ఒకదాన్నొకటి పోలిఉండవు. ఈ జాబితాలోకి కొత్తగా చేరుతుంది- ఈ ఏప్రిల్ 19న విడుదలైన గుండె జారి గల్లంతయ్యిందే చిత్రకథ.  

కార్తీక్ ఓ పెళ్లిలో శ్రుతిని చూసి ఇష్టపడ్డాడు. తానెవరో తెలియకుండా ఆమె తనని ప్రేమించేలా చెయ్యాలని అతడి కోరిక. ఆమె ఫోన్ నంబరు తెలుసుకుని- ఫోన్లో ప్రేమాయణం మొదలెడతాడు. అయితే పొరపాటున అతడికొచ్చిన ఫోను నంబరు శ్రావణి అనే అమ్మాయిది. తానెవరో తెలియకుండా తనని చూడకుండా తనని ప్రేమించే యువకుణ్ణి వివాహం చేసుకోవాలని ఆమె కోరిక.  అక్కణ్ణించి వారిద్దరి మధ్యా దాగుడుమూతల ఆట మొదలు. అది ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదభరితంగా నడిచి అర్థవంతంగా ప్రయోజనాత్మకంగా ముగియడమే- గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం.

ఈ చిత్రంలో నితిన్ ఆరంభంలో కాస్త మందకొడిగా అనిపించాడు. దర్శకుడు చెప్పింది చెయ్యడానికి ప్రయత్నిస్తున్న కొత్త నటుడిలా తోచాడు. ఐనా బాగున్నాడు. క్రమంగా పాత్రలో ఇమిడిపోయి నితిన్ బదులు కార్తీక్‍గా మారిపోయాడు. నటనలో కంటే నృత్యాల్లో ఎక్కువ బాగున్నాడు. నిత్యామీనన్ పొట్టిగా, బొద్దుగా, చాలా మామూలుగా పక్కింటి అమ్మాయిలా అనిపించింది. చిత్రం చూస్తుంటే ఆమె అందచందాలమీద కానీ, ఆడతనం మీద కానీ దృష్టి పోదు. మనకి బాగా తెలిసిన, మనం బాగా ఇష్టపడే ఓ పక్కింటి అమ్మాయి శ్రావణిలా అనిపిస్తుంది. చూసేవారు ఆమెకి మంచి జరగాలనీ, కీడు జరక్కూడదనీ తాపత్రయపడేలా చేస్తుంది. తను నవ్వితే నవ్వి, ఏడిస్తే ఏడవాలనిపిస్తుంది. హావభావాలు, సంభాషణలు పలికిన తీరు, అవసరమైన మేరకు ఆటపాటలు- ఇవన్నీ నేటి హీరోయిన్లకి పాఠాల్లా అనిపిస్తాయి. ఆమెకి హేట్సాఫ్. నితిన్ ప్రేమించిన శ్రుతి పాత్రలో ఇషా తల్వార్ అందంగా అప్పుడప్పుడు కొంచెంకొంచెం కత్రీనా కైఫ్‍లా కనిపించింది. నటనకు అవకాశం లేదో, చేతకాక తీసుకోలేదో అనిపించినా ఆ పాత్రకు పెద్దగా జరిగిన అన్యాయం మాత్రం లేదు. శ్రుతి ప్రియుడిగా నటించిన మధునందన్ ఆ పాత్రలో జీవించాడు. నితిన్ మిత్రుడిగా ఆలీ తనదైన శైలిలో ఒప్పించాడు. మిగతా వారందరూ పాత్రోచితంగా నటించారు. స్వలింగసంపర్కం పట్ల ఆసక్తి చూపే ఓ కామెడీ పాత్రలో జోష్ రవి అద్భుతంగా నటించాడు. సన్నివేశాల కల్పన కూడా బాగున్నా- అది కొందరికి చౌకబారుగా, కొందరికి వెగటుగా అనిపించొచ్చు. ఆ కొందరిలో మేమూ ఉన్నాం. హోమో సెక్సువల్సుని హాస్యానికి ఉపయోగించడం ఉత్తమాభిరుచి అనిపించుకోదని స్వాభిప్రాయం. ఈ చిత్రంలో ఒక నృత్యంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కనిపిస్తుంది. నటన, శరీరం కూడా ఆ దృశ్యానికి సరిపోలేదు. ఈ చిత్రంలో కనిపించడంవల్ల- చిత్రంకంటే జ్వాలాకే ఎక్కువ నష్టం అని చెప్పొచ్చు.

బుల్లితెరపై అమృతం పాత్రలో అలరించి, వెండితెరపై కూడా చిన్నపాత్రల్లోనే అయినా తనదంటూ ఒక బాణీ ఏర్పరచుకున్న ప్రతిభాశాలి- నటుడు హర్షవర్ధన్ ఈ చిత్రంలో స్క్రీన్‍ప్లే, సంభాషణల రచయితగా కూడా రాణించాడు.  తెరవెనుక అప్పుడప్పుడు వినపడిన అతడి గొంతు కూడా బాగుంది. పాటలు వినడంకంటే చూడ్డానికి ఎక్కువ బాగున్నాయి. నితిన్‍కి అనువుగా నృత్యాల్ని చిత్రీకరించిన కోరియోగ్రాఫర్- సహజనటి నిత్యామీనన్ కూడా ఇబ్బంది పడని విధంగా ఆమె కదలికల్ని రూపొందించడం విశేషం.   

నితిన్‍ పవన్‍కల్యాణ్‍కి వీరాభిమానిట. అందుకని తొలిప్రేమ చిత్రంలో ఓ పాట రీమిక్సయింది. ఆ పాట విషయం ఎలా ఉన్నా- ఖుషీ చిత్రంలో పవన్ భూమిక నడుముని చూసిన దృశ్యాన్ని ఈ చిత్రానికి ఉపయోగించుకున్న తీరు మెచ్చుకోతగ్గది.

సాధారణం అనిపించే కథకి అసాధారణం అనిపించే స్క్రీన్‍ప్లే, చిత్రీకరణ ఈ చిత్రాన్ని అద్భుతం చేశాయి. దర్శకుడు విజయ్ కుమార్ కొండా అభినందనీయుడు. ఆద్యంతం ఆసక్తికరం అనిపించే ఈ చిత్రంలో క్లైమాక్సుకి లీడ్ సన్నివేశాలు కాస్త గజిబిజిగా అనిపించి- కొంత విసుగును కూడా కలిగించొచ్చు. ఐతే చిత్రాన్ని ముగించిన తీరు అద్భుతం. ఓ గొప్ప కథకు గొప్ప కొసమెరుపులా అనిపించిన ముగింపు అర్థవంతం, సందేశాత్మకం, ప్రయోజనాత్మకం, ప్రతిభాత్మకం.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన యువత వ్యక్తిగత జీవితంలో తాగుడు, స్మోకింగ్ ఒక విడదీయరాని భాగం అని మన చిత్రాలు ఫిక్సయిపోయాయి. ఏ అలవాట్లూ లేకుండా కూడా ఎందరో రొమాంటిక్ జీవితాన్ని గడుపుతున్నారన్న విషయం వారు చిత్రాల్లో కూడా అంగీకరించాలి. ఈ చిత్రంలో నితిన్‍కి ఏ అలవాటూ లేకపోయినా కథకి, కథనానికి ఏ లోటూ రాదు. ప్రతిభ గల దర్శకులు ఈ విషయం దృష్టిలో ఉంచుకుని మన యువతని తప్పుదారి పట్టించడం మానుకోవాలని మనవి.

మరో విషయం.  చిత్ర విజయాన్ని హీరోకి అంటగట్టడం మనకో చెడ్డ సంప్రదాయమైంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నితిన్ తన తదుపరి చిత్రానికి పారితోషికం భారీగా పెంచనున్నాడని వినికిడి. అప్పుడు ఇచ్చుకున్నవారికి ఇచ్చుకున్నంత మహాదేవ. ఈ చిత్ర విజయానికి నితిన్ కారణం కాదు. అతడి స్థానంలో- కంటికి కాస్త నదురుగా ఉండి, ఒక మాదిరిగా నటించగల ఏ యువనటుడున్నా- ఈ చిత్రం ఇదే విజయాన్ని సాధించేది. నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో నితిన్ నటన ఇష్క్ చిత్రంలో నటనకి తీసికట్టుగా ఉంది. ఈ చిత్ర విజయానికి కారణం స్క్రీన్‍ప్లే, దర్శకత్వం. నటీనటుల విషయం చెప్పాలంటే- ఇది నిజానికి నిత్యామీనన్ చిత్రం.  ఆమె కాక మరెవరైనా ఉంటే ఈ చిత్రం ఇంత బాగుండేది కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. తెలుగు తెరకు ఇతర ప్రాంతమిచ్చిన ఓ అద్భుత సహజనటి నిత్యామీనన్- అని ఈ చిత్రం మరోసారి ఋజువు చేసింది.  

మొత్తం సినిమా చూసేక- ఓ గొప్ప అనుభూతితో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. కారణం ముగింపు. ప్రతిభకు కొత్త నిర్వచనమిచ్చి విజయవంతమైన చిత్రాన్ని తక్కువ ధరలో మనకందించిన దర్శకుణ్ణి అభినందిద్దాం. అతడు పెద్దతారలతో చిత్రం తీసినా- మరో రాజమౌళి అనిపించుకోవాలని ఆశిద్దాం.

Exit mobile version