మే 30, 2013

మిథునం- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 9:35 సా. by వసుంధర

mithunam

కన్యాశుల్కం వంటి నాటకాలు ఎప్పుడో కానీ రావు. శ్రీశ్రీ వంటి కవులు ఎప్పుడో కానీ పుట్టరు. ఇలాంటి ‘ఎప్పుడో కానీ’- అనతగ్గ విశేషాలు తెలుగు కళారంగంలో మరెన్నో ఉన్నాయి. మచ్చుకి- చలనచిత్రాల్లో మాయాబజార్, సినీగీతాల్లో మల్లీశ్వరి, సంభా షణల్లో ముత్యాల ముగ్గు,  చిత్రకారుల్లోబాపు, కథల్లో మిథునం ….

మిథునం కథారచయిత శ్రీరమణ. ఆయన ప్రతి రచనా నూటికి నూరు మార్కులదే అయితే మిథునం అంతకంటే మరికాస్త ఎక్కువ. ఆ కథ చదివిన బాపు- ఎంతలా స్పందించారంటే- మొత్తం కథని స్వహస్తాలతో తిరగవ్రాశారాయన. దాన్ని దస్తూరీతిలకంగా అభివర్ణిస్తూ- రచన శాయి తన పత్రికలో- యథాతథంగా ప్రచురించారు. అప్పుడు దేశవిదేశాల్లో ఆ కథకు లభించిన స్పందన అపూర్వం, అనూహ్యం. రచయిత శ్రీరమణకు జోహార్లు.

ఆ తర్వాత ఒక సాహితీప్రియుడు ఆ కథని చిన్ని పుస్తకంగా ప్రచురించి తన ఇంట జరిగిన ఓ వేడుకలో అతిథులకు అపూర్వ కానుకగా అందజేసి ఓ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అప్పుడా పుస్తకానికి ముందుమాట వ్రాసే అవకాశం మాకు లభించింది. ఆ సంప్రదాయాన్ని విస్తృతం చెయ్యాలని రచన శాయి- ఆ చిన్ని పుస్తకాన్ని అందరి వేడుకలకూ కానుక అయ్యే విధంగా ప్రచురించారు. ఈ పుస్తకంలో మాతోపాటు మరికొందరు ముందుమాటలు వ్రాశారు.

ఆ కథకు స్పందించిన ఒక అభిమాని మిథునాన్ని మళయాళంలో చలనచిత్రంగా తీశారుట. దాని సంగతి మనకంతగా తెలియదు కానీ ఈ కథను వెండితెర కెక్కించాలని ప్రముఖ కవి, భావుకుడు, సినీ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి సంకల్పించారు. ఆచరణలో పెట్టి మిథునం చిత్రం తీశారు. ఆయన అభిరుచికి జోహార్లు.

మిథునం కథ కేవలం- అప్పదాసు, బుచ్చిలక్ష్మి అనే ఇద్దరు వృద్ధ దంపతులమధ్య నడుస్తుంది. మొత్తం కథంతా ఓ గ్రామంలోని ఓ ఇంట్లోనూ, ఆ ఇంటి చుట్టూ ఉన్న పూలు, కూరగాయలు, ఫలవృక్షాల తోటలోనూ నడుస్తుంది. కథలో నవరసాలూ ఉన్నా- కమర్షియల్ ఎలిమెంట్స్ బొత్తిగా లేవు. ఇలాంటి కథని వెండితెరకి ఎన్నుకోవడానికి అభిరుచితోపాటు- ధైర్య సాహసాలూ, త్యాగగుణమూ పుష్కలంగా ఉండాలి. మొదటి రెండూ దర్శకుడివి. వాటితోపాటు మూడోది నిర్మాతది. ఈ బృందానికి జోహార్లు.

ఈ కథకి ప్రాణం ఓ ఇల్లు. ఆ ఇంటిచుట్టూ ఉన్న తోట. కథకి న్యాయం చేకూర్చడంకోసం- ఆ ఇంటినీ, తోటనీ  కథలో ఉన్నట్లే రూపొందించడం భరణి అంకితభావానికి నిదర్శనం. ఆ కథని మన అమ్మానాన్నల ప్రేమకథ అనడం కథపట్ల ఆయనకున్న అవగాహనకు నిదర్శనం.

ఇక చిత్రీకరణ విషయానికి వస్తే- భరణి కథని యథాతథంగా మనముందుంచడానికి ప్రయత్నించారు. వచ్చిన చిక్కేమిటంటే ఈ కథ సన్నివేశాల భరితం. కథగా చదువుకుందుకు అవి బాగుంటాయి. చలన చిత్రంలో ఐతే అవి కథ అనే దారానికి గుచ్చినప్పుడే పూలహారమౌతాయి. ఉదాహరణకి తెనాలి రామకృష్ణ, పరమానందయ్య శిష్యుల కథ. మనకి తెలిసిన సన్నివేశాలకు రచనా చమత్కృతి జతపర్చడానికి ఆ చిత్రాలు అద్భుతమైన ఉదాహరణలు. భరణి అటువంటి ప్రయత్నం చెయ్యకుండా- చిత్రాన్ని ఓ డాక్యుమెంటరీ చేశారు. ఐతే ఇది అందమైన డాక్యుమెంటరీ. ఎంతబాగున్నా డాక్యుమెంటరీని పలుమార్లు చూడాలనుకునేవారు తక్కువ.

నేపథ్యానికి ఇంటినీ, తోటనీ కథకి అనుగుణంగా అద్భుతంగా రూపొందించిన భరణి- ముఖ్యపాత్రల ఎంపికలో ఆ శ్రద్ధ తీసుకోలేదు.  ముఖ్యపాత్రలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి- చక్కని నటనను ప్రదర్శించారు. ఐతే మిథునం కథకు బాపు వేసిన చిత్రాలకు వారు ఏమాత్రమూ సమీపంలో లేరు.  ముఖ్యంగా బాలు నటనలో- ఎక్కువగా బాలు కనిపిస్తాదు. ఇటీవల ‘పాడుతా తీయగా’ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా మలచడానికి- ఆయన హాస్యస్ఫూరక హావభావాలు ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రంలో చాలాచోట్ల అవే కనిపిస్తాయి. అనేకచోట్ల హుందాగా ఉన్నా- కొన్నిచోట్ల పద్మనాభం మర్యాదరామన్న తరహా వెకిలితనం ఈ పాత్రకి అంతగా నప్పలేదనిపిస్తుంది.  మిథునంలో అప్పదాసుని పరిగణనలోకి తీసుకోకపోతే బాలు నటన గొప్పగానే ఉన్నదనుకోవచ్చు. ఆరంభంలో పాత్రల్ని పాదాలు మాత్రమే చూపించి పరిచయం చెయ్యడం బాగుంది. కానీ లక్ష్మి కట్టిన చీర బోర్డరు కిందనుంచీ ఎర్ర లంగా కనిపించగానే- ఈమె మిథునం కథలో బుచ్చిలక్ష్మి కాదనిపిస్తుంది. ఈ కథ 2012దని ఆరంభంలో స్పష్టం చేసినా- మిథునం చదివినవారికి- పాతకాలపు ముత్తయిదువే గుర్తొస్తుంది. నటన విషయంలో లక్ష్మి బుచ్చిలక్ష్మిగా కాకపోయినా- ఓ తెలుగు ముత్తైదువగా  అభినందనీయంగా నటించింది. మాకైతే అప్పదాసు పాత్రకి- కన్యాశుల్కంలో లుబ్దావధాన్లు పాత్రకి గోవిందరాజుల సుబ్బారావువంటి రంగస్థల నటుడు కావాలనిపించింది. ఐతే ఈ చిత్రానికి బాలుకంటే భరణి ఎక్కువ న్యాయం చేకూర్చగలరని కూడా అనిపించింది.  ఇంకా చెప్పాలంటే ఆ రెండు పాత్రలకీ వెండితెరకి తెలియని రంగస్థల నటీనటుల్ని ఎంపిక చేయాల్సిందనిపించింది. కె. విశ్వనాథ్ శంకరాభరణం చిత్రానికి వన్నెలు దిద్దినది జెవి సోమయాజులు అని మర్చిపోకూడదు.

ఈ చిత్రంలో కాఫీమీద ఓ చక్కని దండకముంది. ఆవకాయమీద సరదాపాట ఉంది. రెండూ కూడా బలవంతాన చిత్రంలో ఇమిడ్చినట్లు అనిపిస్తుంది తప్ప కథలో కలవవు. ఐతే విడిగా చూడ్డానికి మాత్రం చిత్రీకరణ గొప్పగా ఉంది. కథలో కలిసి చిత్రీకరణ గొప్పగా ఉన్న దృశ్యం లయవిన్యాసం. రేడియోలో వస్తున్న మృదంగనాదానికి అనుగుణంగా- అప్పదాసు పనసపొట్టు కొట్టడమూ, బుచ్చిలక్ష్మి తిరగలి విసరడమూ అద్భుతం. టైటిల్ సాంగ్ కూడా సాహిత్యపరంగా గొప్పగా అనిపించకపోయినా-  చిత్రీకరణ బాగుంది.

మిథునం టైటిల్స్ లో థు అక్షరంలోని చుక్కలో సూర్యుణ్ణి చూపడం బాగుంది. అప్పదాసు సకలకళా ప్రావీణ్యాన్ని కాస్త ఎక్కువ చేశారనిపించింది. అప్పదాసు గోమాతతో సంభాషించిన సన్నివేశకల్పన బాగున్నా- చిత్రంలో అంతర్భాగం కాలేదు. ఒకరోజు తువ్వాయి ఇంటికి రాదు. ఆ తర్వాత దాని జాడ తెలియదు. ఆ సన్నివేశానికి కళ్లు చెమర్చుతాయి. దాంపత్య జీవితానికి సంబంధించిన అనేక సరస విషాద సన్నివేశాలు కూడా హృద్యంగా ఉన్నాయి.

మాకైతే ఈ చిత్రం చూస్తుంటే అంత ఆసక్తిగా అనిపించలేదు. కథ చదివాం కాబట్టి తెలిసిన సన్నివేశాల చిత్రీకరణ పట్ల కుతూహలంతో చూశాం. చదువనివారికి ఈ చిత్రం ఆసక్తి పుట్టిస్తుందా అని కూడా అనిపించింది కానీ- ఈ చిత్రానికి లభించిన ప్రేక్షకాదరణ అనూహ్యం. అర్థంలేని వ్యాపార చిత్రాలతో పోల్చితే- ఈ చిత్రం చాలా ఉన్నతం కూడా. ఇలాంటి చిత్రాలకి  ప్రేక్షకాదరణ లభించాలని మనమందరం కోరుకోవాలి.

మండు వేసవిలో చిరుజల్లులా రావడంవల్ల- ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభించవచ్చు. అవార్డులు రావచ్చు. నటీనటులకు కూడా అవార్డులు రావచ్చు.  ఇతర చిత్రాలతో పోలిక లేకుండా రాణించగల గొప్ప చిత్రాన్ని- ఈ చిత్రబృందం నిర్మించడానికి ఉడతాభక్తి వ్యాఖ్య ఈ సమీక్ష. నిర్మాత-దర్శకుల్ని ప్రొత్సహించడానికి ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూడడం మంచి సినిమాల్ని అభిమానించేవారి కర్తవ్యం.

ఈ చిత్రం తియ్యాలన్న అభిరుచికీ,  చిత్రంలోని అద్భుత వాతావరణానికీ – ఈ చిత్ర బృందానికి అభివందనాలు.

9 వ్యాఖ్యలు »

  1. B.Ravikumar (Ex - Pune, Present Bangalore) said,

    ‘సినిమా కన్నా రివ్యూ బావుందీ… అనే కామెంట్ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది! మీ మిగతా రివ్యూలు కూడా చాలా కొత్త విషయాలతో మీ శైలి లో బావుంటాయి కాని, బాగా లేట్ గా వస్తాయి..అదొక్కటే కాస్త సలహా ఇవ్వగలిగిన విషయం మరి.. థాంక్యూ!

  2. bonagiri said,

    మీ సమీక్ష నిష్పాక్షికంగా ఉంది. మిధునం సినిమా నాకు చాల నచ్చింది. కొన్ని చిన్న చిన్న లోపాలున్నా, మొత్తంగా చూస్తే చిత్రం అద్భుతః

    భరణి గారు జోడించిన మాటలు చాలా బాగున్నాయి. నా దృష్టిలో అప్పదాసు పాత్రకి కీ. శే. పుచ్చా పూర్ణానందం గారి శరీరం, వాచకం సరైన న్యాయం చేయగలిగేవి. రెగ్యులర్ నటుడు కాబట్టి చంద్రమోహన్ అయినా ఇంకాస్త సహజంగా ఉండేది. అయినా బాలు గారు తన పాత్రని బాగా ఇష్టపడి చేసినట్టు అనిపించింది.

    మళయాళ చిత్రం కూడ చూసాను కాని, దానికంటే కథలోలాంటి తెలుగుదనం ఉన్న మిధునమే బాగుంది. రెండు గుండెల మైథునం అని నేను కూడ చిన్న సమీక్ష నా బ్లాగులో వ్రాసాను. సమయముంటే చదవగలరు.


Leave a Reply

%d bloggers like this: