జూన్ 6, 2013

బుల్లితెరపై జబర్దస్త్

Posted in టీవీ సీరియల్స్ at 9:59 సా. by వసుంధర

jabardast etv

మా చిన్నప్పుడు రోడ్ల ప్రక్కన కొన్ని బృందాలు ఇంద్రజాల విద్యను అద్భుతంగా ప్రదర్శించేవారు.  దాన్ని మోళీ అనేవారు. బృందంలో సాధారణంగా ముగ్గురు మనుషులుండేవారు. ఒక ఆడమనిషి మద్దెల వాయించేది. ఒకడు మధ్యమధ్య బుల్‍బుల్ వాయిస్తూ రకరకాల ట్రిక్స్ ప్రదర్శించేవాడు. అప్పటికప్పుడు మొక్కని మొలిపించి పళ్లు కాయించేవాడు. మనిషి శరీరంలో ఏ అవయవంనుంచైనా నాణేలు తీసేవాడు. ఇప్పుడు చాలామంది ప్రముఖ ఆధునిక ఐంద్రజాలికులు వేదికలపై చేస్తున్న ట్రిక్స్ అవలీలగా చేసేవాడు. మూడో వాడు కుర్రవాడు. వాడికి కళ్లకి గంతలు కట్టి చుట్టూ చేరినవారి వంటిమీద ఏమేమి వస్తువులు ఉన్నాయో చెప్పించేవాడు.  చివరగా ఆ కుర్రవాణ్ణి తన దగ్గిరున్న  పాముచేత కరిపించి- వాడు నురగలు కక్కుతుంటే తనవద్దనున్న తాయెత్తుని విషానికి విరుగుడుగా ఉపయోగించి- ఆతర్వాత ఆ తాయెత్తుని అమ్మకానికి పెట్టేవాడు. కడివెడు పాలలో ఒక ఉప్పరాయిలా ఇంత అద్భుతమైన మోళీలో ఉన్న ఒక దోషంవల్ల- మోళీని చూడ్డం ప్రేక్షకులకు గౌరవప్రదం అనిపించుకునేది కాదు. అదేమిటంటే మోళీ చేసేవాడు హాస్యం పేరిట చౌకబారు శృంగారపు జోక్సు వేసేవాడు. జనం అప్పటికప్పుడు నవ్వినా, ఆ హాస్యాన్ని మిత్రులతో పంచుకునేందుకు కూడా ఇబ్బందిగా అనుకునేవారు. ఈ మోళీని గుర్తు చేసింది ఇటీవల ఈటివిలో మొదలై ప్రతి గురువారం రాత్రి 9.30నుంచి ఓ గంట సేపు వచ్చే జబర్దస్త్ హాస్య కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో ఆరు హాస్యబృందాలున్నాయి. వాటికి నాయకులు ఆరుగురు సినీ కమేడియన్స్- చంద్ర, వేణు, రఘు, చంటి, రాఘవ, ధనరాజ్. సినిమాలలో చిన్న చిన్న వేషాల్లో తరచుగా కనిపించే ఈ నటుల ప్రతిభ అసమానం అనిపిస్తుంది ఈ కార్యక్రమం చూస్తుంటే.  ఈ కార్యక్రమానికి యాంకర్ అనసూయ అందంగా, ఆకర్షణీయంగా, చలాకీగా ఉంది. హుందాగా అనిపించే నాగబాబు ఒక న్యాయనిర్ణేత. సినీ కథానాయికగా ఓ వెలుగు వెలిగి, రాజకీయాల్లో వక్తగా రాణించి, కొన్ని టివి సీరియల్సులో యాంకర్‍గానూ పేరు తెచ్చుకుంటున్న రోజా మరొక న్యాయనిర్ణేత. అందువల్ల ఈ కార్యక్రమంపై ఆశ, ఆసక్తి బాగా పెరిగితే ఆశ్చర్యం లేదు. కానీ-

హాస్యబృందాలు ఎంపిక చేసుకున్న అంశాల్లో ఎక్కువ మగవాళ్లు ఆడవేషాలు వేసేవి. శృంగారపరంగా అక్రమ సంబంధాల్ని చతురోక్తులకు వాడుకునేవి. ఒకటి రెం డు సార్లు నవ్వొచ్చినా అన్నీ ఒకలాగే ఉండి విసుగునీ, జుగుప్సనీ కూడా కలిగించే ఈ ప్రహసనాల్లో- తిండి ఎక్కువై కడుపు బరువెక్కినప్పుడు- తేలిక పర్చుకునేందుకు వాయువుని  శబ్దపూరితంగా విడిచిపెట్టడం హాస్యంలా కాక ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఐతే- హం దిల్ దే చుకే సనమ్ చిత్రంలో సల్మాన్ ఖాన్‍కి ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఐశ్వర్యా రాయ్ చూసి పడిపడి నవ్వడాన్ని చిత్రీకరించడాన్ని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి  ఇబ్బందిగా అనుకోలేదన్న విషయం మనం గమనించాలి. ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లో కామెడీ పాత్రలకు ఇలాంటి దృశ్యాలు వచ్చాయి. ఒక తెలుగు చిత్రంలో బ్రహ్మానందం హరికథ చెబుతూ ఇలాంటి దృశ్యాన్ని అభినయించడం కూడా ఎవరికీ ఎబ్బెట్టు అనిపించినట్లు లేదు. ఏది ఏమైనా ఇది హాస్యంలో దిగజారుడు.  జనాలు హర్షిస్తున్నారని కాదు కానీ ఉపేక్షిస్తున్నారన్నది నిజం.

ఈ కార్యక్రమంలో కితకితలు పెట్టినా నవ్వురాని జోక్సుకి న్యాయనిర్ణేతలు పడిపడి నవ్వడం- వారి అభిరుచికి చిన్నతనం. మాటవరసకే రెండర్థాలనిపించే ఒకే అర్థపు అశ్లీలపదాలకి న్యాయనిర్ణేతలు స్పందించిన తీరు హుందాగా అనిపించదు. సమాజంలో వారికి ఉన్న హోదానిబట్టి వారికి కొన్ని బాధ్యతలు తప్పనిసరి. ఆ బాధ్యతల్ని వారు విస్మరించినట్లే అనిపిస్తుంది.

ప్రదర్శనలో నటులు అడపాతడపా న్యాయనిర్ణేతల్నీ, యాంకర్నీ  లక్ష్యం చేసుకోవడం సరదాగానే ఉంటుంది. కానీ ఈ హాస్యబృందాలు చీటికీమాటికీ వారిని లక్ష్యంగా చేసుకొనడం విసుగు పుట్టిస్తుంది.

ఇక యాంకర్ అనసూయ తనపై విసిరిన ఛలోక్తులకి చూపే హావభావాలు గొప్పగా ఉన్నాయి. కానీ ఆమెకు- మూడో నాలుగో మాత్రం పోజులున్నాయని నాలుగైదు కార్యక్రమాలు చూడగానే తెలిసిపోతుంది. ఐనా బాగానే అనిపించినా- ఈ కార్యక్రమం మరింత కాలం కొనసాగాలనుకుంటే ఆమె తన పోజుల పరిధిని విస్తృతం  చెయ్యాల్సి ఉంటుంది.

గతంలో మనకి చిలకమర్తి లక్ష్మీనరసింహం, భమిడిపాటి కామేశ్వరరావు, మునిమాణిక్యం నరసింహారావు వగైరాలు రచించిన అద్భుతమైన ప్రహసనాలున్నాయి. వాటిని నేటి ప్రేక్షకులు ఆదరించేలా రక్తి కట్టించగల సత్తా ఉన్న నటులు ఈ హాస్యబృందాల్లో ఉన్నారు. ఆ ప్రయత్నం చేస్తే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బృందానికి ప్రతిభకు తగిన గౌరవాన్ని సంతరించి పె డుతుంది. లేదూ ఇదొక చౌకబారు కార్యక్రమంగా మిగిలిపోయి- నిర్వాహక బృందానికి అప్రతిష్ఠ తేవడంలో సందేహం లేదు.

ప్రస్తుతం రెండు వారాలుగా న్యాయనిర్ణేతగా నాగబాబు స్థానంలో అల్లరి నరేష్ కనిపిస్తున్నారు.

 ఇలాంటి కార్యక్రమాలకు ఛానెల్సుని తప్పు పట్టలేం. ఛానెల్సు వారికి డబ్బిచ్చే స్పాన్సర్సు కావాలి. చూసే ప్రేక్షకులు కావాలి. ప్రేక్షకుల స్థాయి పెంచడానికి మయూరి, శ్రీవారికి ప్రేమలేఖ వంటి మహత్తర ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించిన ఉషాకిరణ్ మూవీస్ సంస్థతో సంబంధమున్న ఈటివి అభిరుచిని సందేహించేవారుండరు. జబర్దస్త్ వారి అభిరుచికి మచ్చ కావచ్చు. కానీ ఆ విషయం చెప్పాల్సిన బాధ్యత  ప్రేక్షకులది. ఉపేక్షాభావమున్న ప్రేక్షకులకు విమర్శించే హక్కు లేదు.

ఏది ఏమైనా ఈ కార్యక్రమంలో కొన్ని మంచివి, కలకాలం గుర్తుండిపోయేవి కూడా ఉన్నాయి. ఈ లంకెలు చూసి మంచిచెడ్డలు మీరే నిర్ణయించుకోగలరు.

లంకె 1    లంకె 2    లంకె 3     లంకె 4

ప్రభావశీలమైన బుల్లితెరపై ఉన్నత ప్రమాణాల కార్యక్రమాలు రావడానికి ఛానెల్సు కంటే ఎక్కువగా ప్రేక్షకులే కారణమౌతారన్న విషయం మనమంతా గుర్తించాలి.

2 వ్యాఖ్యలు »

  1. lakshmi gouri said,

    jabardast program is slowly becoming..cheap..we stopped watching this..i dare to say we cant make comedy without obscene expressions

  2. Mohana said,

    100% correct


Leave a Reply

%d bloggers like this: