జూన్ 25, 2013

ప్రేమకథా చిత్రమ్- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 4:00 సా. by వసుంధర

premakatha chitram

మనది ప్రజాస్వామ్యం. మన సంక్షేమంకోసం మన నాయకుల్ని మనమే ఎన్నుకుంటాం. అలా మనం ఎన్నుకున్న నాయకులు మనని దోచేస్తున్నారు. వాళ్లు గోచిపాతరాయుల దశనుంచి కుబేరుల దశకు ఎదిగిపోయి- మనని సాటివారే దోచేస్తున్నారని నమ్మిస్తున్నారు. మనం సంఖ్యలో కోట్లలో ఉండొచ్చు కానీ మనలో మనం కలహించుకుంటూ ఏకాకులమై దోపిడిదొంగలకి జయజయధ్వానాలు పలుకుతున్నాం. అష్టకష్టాలూ పడుతూ వాళ్ల వినోదమే మన వినోదమనే భ్రమలో ఉన్నాం. అలా మనకి మన ప్రజాస్వామ్యం  ఒక హారర్ స్టోరీ.

మన చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతి పెద్దదిగా భావించబడుతోంది. అది మనకి వినోదాన్ని అందిస్తున్నదన్న భ్రమతో- సినిమా హీరోల్నీ, హీరోయిన్లనీ, దర్శకుల్నీ దేవుళ్లకంటే ఎక్కువగా ఆరాధిస్తున్నాం. వాళ్లు మనుషులు చేసిన  దేవుళ్లని తెలిసినా సినీ నిర్మాతలు- మనుషుల్ని కొట్టి ఆ దేవుళ్లకి వేస్తున్నారు. ఆ దేవుళ్లలో కొందరైతే మనుషుల్ని కొట్టడానికి అంగరక్షకుల్ని కూడా వెంటబెట్టుకుని తిరుగుతున్నారు. అదలాగుంచితే వినోదం పేరిట వారందించే చిత్రాలు- వారినీ, వారి వంశజుల్నీ మానవాతీతులుగా చూపడానికే అనిపిస్తుంది. మూస కథలు, దృశ్యాలతో నిండిన వారి చిత్రాలు విసుగు పుట్టించడమే కాదు- వాటిని చూడ్డంవల్ల హారర్ పుడుతోంది.

‘ఈ భారీచిత్రాల బరువు మనకొద్దు. తక్కువ ఖర్చుతో చిన్న తారలతో తీసిన చిత్రాలు చూద్దాం’ అన్న మాట మాది కాదు. ఈ జూన్ 7న విడుదలైన ప్రేమ కథా చిత్రం థియేటర్ వద్ద యువతీయువకుల మాట. అది మేము స్వయంగా విన్నాం.

పెద్ద చిత్రాలు వినోదాన్ని హారర్ చేస్తుంటే- హారర్‍ని వినోదంగా మార్చి అందించడం ఈ చిన్న చిత్రం ప్రత్యేకత.

ఈ చిత్రానికి హీరో సుధీర్ బాబు. అతడు అలనాటి సూపర్ స్టార్ కృష్ణకి అల్లుడు. నేటి సూపర్ స్టార్ మహేష్ బాబుకి బావ. ఐనా పెద్దింటి ఇతర హీరోల్లా ఈ చిత్రం తనకోసం అనుకోక- తనే ఆ చిత్రకథలో ఓ భాగంగా ఇమిడిపోయాడు. మనిషికి అందముంది. ఒడ్డూ పొడవూ ఉంది. ఓ దృశ్యంలో నాట్యం చెయ్యగల సత్తానూ ప్రదర్శించాడు. చిత్రం పొడవునా అతడి ప్రవర్తన ఒక మామూలు యువకుడికిలాగే ఉంటుంది. ప్రేమిస్తాడు. ఫెయిలైతే నిరుత్సాహపడి ఆత్మహత్యకు సిద్ధపడతాడు. ఒకోసారి తెలివిగా, ఒకోసారి అమాయకంగా ఉంటాడు. నీతి నియమాల్ని నమ్ముతాడు. ఐతే బలహీన క్షణాల్లో తప్పుకీ పాల్పడతాడు. మామూలుగా ఎంత ధైర్యంగా ఉంటాడో, దెయ్యాన్ని చూస్తే మనలాగే భయపడతాడు. అసలుసిసలు వాస్తవ పాత్ర అతడిది. నటనలో అక్కడక్కడ తేలిపోయినా నూటికి అరవై తక్కువ కాని మార్కులు వెయ్యొచ్చు అతడికి.

కథానాయిక నందితకు నటిగా ఈ చిత్రం ఓ పరీక్ష. కాలేజి అమ్మాయిగా, ప్రియురాలిగా, దెయ్యం పూనిన వ్యక్తిగా- అన్నింటా  ఒప్పించిందామె. కొన్ని చోట్ల చాలా అందంగా ఉన్నా- పలువరుసలోని ఎగుడు దిగుడులవల్ల ఒకోసారి మేకప్ అవసరం లేకుండానే డ్రాక్యులాలా కనిపించింది. అమాయకత్వం, చిలిపితనం, శృంగారం, సందిగ్ధం వగైరాలన్నీ అవలీలగా ప్రదర్శించిన ఈమెకు నటిగా చాలా మంచి భవిష్యత్తుంది.

మిగతా నటులు ఆయా పాత్రలు తమకోసమే అన్నంత సహజంగానూ గొప్పగానూ నటించారు. హాస్యానికి పెద్ద కమేడియన్స్ పైనే ఆధారపడాల్సిన అవసరం పెద్ద హీరోల చిత్రాలకి మాత్రమే ఉందనిపిస్తుందీ చిత్రం చూస్తే.

ఈ చిత్రంలో పాటలకు ప్రత్యేకత లేదు కానీ బాగున్నాయి. తెలుగుతనం ఉందనిపించిన వెన్నెలైనా చీకటైనా పాట పచ్చని కాపురం చిత్రంలో పాటకి రీమిక్స్. ఆ పాట వింటే గుర్తొచ్చేది మల్లెపూవు చిత్రంలో చిన్నమాటా పాట. పాటల్లో తెలుగుతనం ఉంటే ఇంకా బాగుండేది. గతంలో ఎన్నో సస్పెన్స్ చిత్రాలు తెలుగుతనమున్న పాటలతో రాణించాయి. మచ్చుకి- అంతస్తులు చిత్రంలో నిను వీడని నీడను నేనే.

ఈ చిత్రం బలం స్క్రీన్‍ప్లేలో ఉంది. దానికి తగిన చిత్రీకరణలో ఉంది. ఆరంభంలో- అంతగా పట్టు లేకపోయినా ఏదో కొత్త కథలాగుందే అనిపిస్తుంది. అక్కణ్ణించి క్రమంగా ఆసక్తి పెరిగి కాసేపటికి ఉత్కంఠ అందుకుంటుంది. దెయ్యం పూనే సన్నివేశాలు ముందే తెలిసినా ఉత్కంఠ ఉంటుంది. ఆ దెయ్యం హీరోని, ఇతర పాత్రల్నీ వణికిస్తుంది కానీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. ఇదో చిత్రమైన విశేషం. పూర్వం ఫూల్ ఔర్ పథ్థర్, తలాష్ వంటి భారీ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ దర్శక నటుడు ఓపి రల్హన్- హల్‍చల్ అనే హాస్య సస్పెన్స్ చిత్రాన్ని తీశాడు. హారర్‍లో ఇటువంటి ప్రయోగం తెలుగులో ఇదే ప్రథమమేమో.

ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లు అశ్లీలం అనిపించేటంత దగ్గిరగా వచ్చే సన్నివేశాలున్నాయి. వాటిని సంసారులూ, సంస్కారులూ కూడా సమర్థించేలా రూపొందించడమే కాక ఉత్కంఠభరితంగా, హాస్యపూరితంగా మలచిన దర్సకత్వ ప్రతిభకు జోహార్లు. సంభాషణలు చాలావరకూ బాగున్నాయి కానీ- కొన్నిచోట్ల రెండర్థాలతోనూ, మరికొన్నిచోట్ల అసలు అర్థంతోనూ కూడా- అశ్లీలతకి  తావిచ్చిన విధం- చౌకబారు అభిరుచికి అద్దం పడుతుంది. ఐతే ఈ చిత్రానికి సంభాషణలందించినది మారుతి. ఆయన గత చిత్రాలు- ఈరోజుల్లో, బస్‍స్టాప్ లతో పోల్చితే- ఈ సంభాషణలు ఆననే ఆనవని కొందరు సరిపెట్టుకున్నారు. ఈ చిత్ర విజయానికీ ఆ సంభాషణలకీ ఏ సంబంధమూ లేదు. ఉందనుకుంటే అది మాటల రచయిత స్థాయి అని మనం సరిపెట్టుకోవాలి. మల్లెపూలని మురికి కాలువ పక్కన కూర్చుని ఆఘ్రాణిస్తున్నామన్న భావానికి దారితీసే ఆ సంభాషణలనుంచి బయటపడితే మారుతికి సంస్కారులు కూడా పెద్ద పీట వేస్తారు.

ఈ చిత్రం గొప్పదేం కాదు. కథ కూడా గొప్పది కాదు. చాలావరకూ ఉత్కంఠభరితంగా చెప్పినా క్లైమాక్స్ కూడా కాస్త చప్పగా ఉంది. ఐనా ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పెద్ద హీరోల భారీ చిత్రాలు ఈ చిత్రం పక్కన చిన్న గీతలు కావడంతో- ఇది పెద్ద గీత అయింది. ప్రేక్షకులు తృప్తిగా బయటికొస్తున్నారు. వారిలో మేమూ ఉన్నాం.

ఒక ధనికుడు తన కుమారుణ్ణి బడిలో వేసి- ‘మావాడు అల్లరి చేస్తే పక్కవాణ్ణి కొట్టండి. భయపడి మావాడు అల్లరి మానేస్తాడు’ అని టీచరుకి చెప్పాట్ట. ఈ చిత్రాన్ని ఆదరించడం ద్వారా మన ప్రేక్షకులు చిత్రసీమకు ఏం చెప్పదల్చుకున్నారో తెలుసుకుందుకు- ఈ కథ తెలుసుకుంటే చాలు.

2 వ్యాఖ్యలు »

  1. Narsimha said,

    ఆనాడు కృష్ణ గారు “కథా నాయకుడు” అనే మాటకి న్యాయం చేస్తూ సినిమాలు తీసాడు, దాన్ని మహేష్ బాబు పూర్తిగ కొనసాగించలేక విఫలమైతే ఆ తీరు ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం లో ఉన్నట్లున్నాడు ఈ సుధీర్ బాబు!.
    నిజంగా కథ కు అనుగుణమైన, అవసరమైన నటన ని మాత్రమే చూస్తాం ఈ సినిమాలో అందరు నటులు అవసరం మేరకి మాత్రమే నటీంచారు!.సుధీర్ ఇలాంటి కథా ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్స్ చేస్తే కెరీర్ బాగా సాగుతుంది.

  2. చిన్న చిత్రాలు విజయవంతమయితేనే తెలుగు చిత్రాలకు మంచిరోజులు వస్తాయి!చిత్రంలో హీరోను ఒక పాత్రగా భాగంగా చూపించాలి కాని అన్నిటికీ అతీతుడుగా చూపించరాదు!నిజ జీవితంలో కండలవీరుడు విలన్ ఒక్క తన్ను ఈడ్చి తంతే జీరో అయిన హీరో నడ్డివిరిగి 6 నెలలు దవఖానలో చికిత్స పొందుతాడు!తెలివిగా తీస్తే చిన్న చిత్రాలు విచిత్రచరిత్ర సృష్టించి బాక్షాఫేసును బద్దలుకొడతాయి కనుక కొత్తనిర్మాతలు కొత్త దర్శకులను ప్రోత్సహించి చిన్నచిత్రాలు నిర్మించి అసలుకు మోసం రాకుండా చూసుకోండి!


Leave a Reply

%d bloggers like this: