జూన్ 26, 2013

ఇద్దరమ్మాయిలతో- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 4:22 సా. by వసుంధర

th_posters-iddarammayilatho1

బండ్ల గణేష్ ఓ పెద్ద నిర్మాత. పూరీ జగన్నాథ్ ఓ పెద్ద దర్శకుడు. అల్లు అర్జున్ ఓ పెద్ద నటుడు. దేవిశ్రీ ప్రసాద్ ఓ పెద్ద సంగీత దర్శకుడు.  వీరి పెద్దరికం- పేరు ప్రఖ్యాతుల్లో మాత్రమే. వయసులో వీరంతా బాగా చిన్నవారు. తమ పేరు ప్రఖ్యాతులకి న్యాయం చేకూర్చేటంత భారీగా తమ చిత్రాలుండాలన్నది నియమం. వారి చిత్ర కథలు మాత్రం వారి వయసుకి తగ్గట్లే ఉండడం ఇటీవల తరచుగా జరుగుతున్న విశేషం. అందుకు ఉదాహరణ ఈ మే 31న విడుదలైన ఇద్దరమ్మాయిలతో చిత్రం.

దర్శకుడు పూరీ హాస్యప్రియత్వానికీ, లోతైన ఆలోచనకీ సూచన ఈ చిత్రం పేరు. ఎందుకంటే తెలుగు సినిమా అంటేనే ఇద్దరు కథానాయికలు ఉండాలని నియమం కాని నియమం. సీనియర్ ఎన్టీఆర్ జయసింహ నుంచి అక్కినేని  ప్రేమాభిషేకం వరకూ అలాంటివి ఒకటా రెండా ఎన్నెన్నో. శోభన్‍బాబు హిట్ చిత్రాల్లో చాలావరకూ అలాంటివే. ఇక నేటి నటులైతే- చెప్పనే అక్కర్లేదు. అంటే ఏ తెలుగు సినిమాకైనా ఇద్దరమ్మాయిలతో అనే పేరు అతికినట్లు సరిపోవచ్చు. తనదీ అలాంటి మరో సినిమా అంటూ తెలుగు సినిమాలపై వ్యంగ్యాస్త్రంగా పూరీ చేసిన మరో ప్రయోగమిది అనుకోవచ్చు.

కథ అందుకు తగ్గట్లే ఉంటుంది. రావు రమేష్ కేంద్ర మంత్రి. ఆయనపై లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన కుమార్తె కేథరిన్ సైకాలజీలో పై చదువులకి గానూ బార్సిలోనా వెళ్లింది. అక్కడ తనుండే ఇంట్లో కనపడ్డ డైరీలో ఆమెకి అల్లు అర్జున్, అమలా పాల్‍ల ప్రేమ కథ తెలుస్తుంది. 

ఆ ప్రకారం అమలా పాల్ సంగీతప్రియుడైన తనికెళ్ల భరణి కుమార్తె. ఆమె ఫిడేల్ నేర్చుకునేందుకు బార్సిలోనా వెడుతుంది- తాతలనాటి ఫిడేల్ కూడా తెచ్చుకుని. అక్కడ ఆమె గురువు బ్రహ్మానందం. అనుకోకుండా ఆ ఫిడేల్ అర్జున్ ద్వారా విరిగి ముక్కలౌతుంది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమకి దారి తీస్తుంది.

డైరీలో కథ కొంతవరకే ఉండడంతో మిగతాది తెలుసుకుందుకు కేథరిన్ అర్జున్ కోసం అన్వేషించి పట్టుకుంటుంది. అమలా పాల్ చనిపోయిందని తెలిసి కన్నీళ్లు కార్చినా అర్జున్‍పై ప్రేమలో పడుతుంది. ఇంతకీ కేథరిన్‍కి అప్పటికే షవార్ ఆలీతో పెళ్లి నిశ్చయమైంది. షవార్ ఆలీ కరడు కట్టిన విలన్. రావు రమేష్ అనుచరుడు కూడా.

ఆ తర్వాత ఏం జరుగుతుందని అందరూ ఊహిస్తారో అదే జరిగి సినిమా సుఖాంతమౌతుంది.

ఈ మొత్తం కథ బార్సిలోనా, పారిస్‍లలో జరుగుతుంది. దృశ్యాలన్నీ ప్రేక్షకులకు కనువిందే. ఇక పాత్రచిత్రణ విషయానికొస్తే-

చదువున్నా విదేశాలకి వెళ్లేటంత ఆధునికమైనా కూడా ఈ చిత్రంలోని ఇద్దరమ్మాయిలూ కూడా ఆత్మగౌరవాన్నీ, ఆత్మాభిమానాన్నీ మరిచి (లేదా విడిచి)- అబ్బాయిలకి పడిపోవడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. హీరో కూడా వాళ్లని చులకనభావంతోనే చూస్తాడు. మనుషుల మనసుల్ని చదవడంలో తనకున్న సత్తాపై- సైకాలజీ చదివిన కేథరిన్‍కే నమ్మకం లేదు. ఇక హీరో అర్జున్‍కి లేకపోతే ఆశ్చర్యం ఏముంది? తనికెళ్ల భరణి సంగీత ప్రియుడు. ఉదాత్తంగా ఉండాల్సిన ఆ పాత్రలో అవకాశవాదంతో నిండిన అల్పత్వం ద్యోతకమౌతుంది. బ్రహ్మానందం విదేశాల్లో మన సంగీతాన్ని ప్రచారం చెయ్యాల్సిన వ్యక్తి. ఇలాంటి పాత్రల్ని గతంలో రేలంగి ఎంతో హుందాగా పోషించేవాడు. బ్రహ్మానందం తనపై పడిన ముద్రకు అనుగుణంగా నటించి సంగీతాన్ని అపహాస్యం చేశాడు.  తాతలనాటి ఫిడేలు విరిగి ముక్కలవడం మనసు కలుక్కుమనే సెంటిమెంటల్ సన్నివేశం. అందుకు కారకుడైన అర్జున్‍లో తనవల్ల తప్పు జరిగిందన్న భావమే ఉండదు. అర్జున్, అమలాపాల్, బ్రహ్మానందంలు ముగ్గురూ దాన్ని హాస్య సన్నివేశంగా  మార్చేశారు. మన ఆడవాళ్లు, సంస్కృతి, సంప్రదాయాలు- ఉదాత్త వ్యక్తిత్వాలపట్ల నేటి దర్శకులు ప్రదర్శిస్తున్న ఈ తేలిక  భావం ప్రభావం- యువతరంపై బాగా పడుతోంది.

అల్లు అర్జున్ పాత్రచిత్రణ ఏమాత్రం సహజంగా లేదు. అయితే అర్జున్ అవధుల మేరకు చక్కగా నటించాడనే చెప్పాలి. నృత్యాలైతే అవలీలగా చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడనొచ్చు. కేథరిన్ ముద్దుగా ఉంది. అమలాపాల్ కొన్నిచోట్ల ప్రియాంకా చోప్రాలా, కొన్ని చోట్ల దీపికా పడుకోనేలా అనిపించింది. ఆమె నటన బాగుంది. కానీ గురజాడ నాటి బ్రాహ్మణ కుటుంబపు సాగదీత డైలాగ్స్ ఆమె రూపానికీ, వేషధారణకీ నప్పలేదు. బ్రహ్మానందం పాత్ర పండలేదు. రావు రమేష్ పాత్ర చిన్నదైనా గుర్తుండిపోతుంది. షవార్ ఆలీ అనాసక్తికరమైన మూసలో నటించాడు. సుబ్బరాజుకి నటుడిగా ఎదుగుదల ఎప్పుడో ఆగిపోయిందా అనిపిస్తుంది. ఇంతకుమించి గుర్తుంచుకోతగ్గ పాత్రలు లేవు.

దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో ఊపుంది. చిత్రీకరణలోనూ ఊపుంది. పాటల్లో తెలుగుతనం అంతంతమాత్రమైనా వయోలిన్ పాట ఒకటి బాణీ, చిత్రీకరణ కూడా అద్భుతం. ఐతే పాట చిత్రీకరణలో- సంగీతంలో పాశ్చాత్యం, మన శాస్త్రీయాల్లో దేన్ని విశిష్టం చెయ్యాలా అని తికమకపడినట్లనిపిస్తుంది.  అర్జున్‍ని వీధి గాయకుడిగా చూపించే పాట చిత్రీకరణ కూడా గొప్పగా ఉంది. టాపు లేచిపోద్ది పాట బాణీలో హుషారుంది- కానీ ఆటలో ఇద్దరమ్మాయిలూ అవసరానికి మించి రెచ్చిపోయారు. హాలీవుడ్ నగ్నత్వానికీ, శృంగార దృశ్యాలకీ విముఖమౌతున్న ఈ రోజుల్లో మనం ఎక్కడికి పోతున్నామనిపిస్తుంది ఆ పాట చూస్తే.

పూరీ విషయానికొస్తే- సంభాషణలు పేలవం. దర్శకుడిగా ఆరంభంలో డైరీ ద్వారా కథ నడిపించిన తీరు మెచ్చుకోతగ్గది. కొత్తదనం ఏమాత్రం లేకుండా చూసిన సినిమానే చూస్తున్న అనుభూతినిచ్చే ఈ చిత్రం ఎక్కడా విసుగు పుట్టించదు. అందుకు దర్శకత్వమే కారణం అనుకోవాలి. ఈ చిత్రం వసూళ్లపరంగా సాధించిన విజయానికి పూరీ, దేవిశ్రీ, అర్జున్‍లు చాలావరకూ కారణం.

పూరీ జగన్నాథ్ ప్రతిభాశాలి అనడానికి ఎవరి యోగ్యతాపత్రమూ అవసరం లేదు. పోకిరి, బిజినెస్‍మాన్ చిత్రాలు చాలు. ఆ ప్రతిభ ఈ చిత్రంలో ఏమాత్రమూ లేదనడంలో సందేహం లేదు. బిజినెస్‍మాన్ తర్వాత అతడి దర్శకత్వంలో వచ్చిన మూడు తెలుగు చిత్రాల్నీ బట్టి- ఆ ప్రతిభను మళ్లీ చూడగలమా అన్న అనుమానం కలుగుతోంది. తదుపరి చిత్రం ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తుందని ఆశిద్దాం.

Leave a Reply

%d bloggers like this: