జూన్ 27, 2013

నర నారాయణులెక్కడ?

Posted in సాంఘికం-రాజకీయాలు at 1:17 సా. by వసుంధర

ఆపదలో ఆదుకునేందుకు ఉపయోగపడేవి శక్తి, భక్తి. భారతంలో శక్తికి ప్రతిరూపం నరుడు. భక్తికి ప్రతిరూపం నారాయణుడు.

గమ్యం ఒక పిట్ట కన్నుఅయితే అర్జునుడికి (నరుడు) ఆ పిట్ట ఉన్న చెట్టు సంగతి అటుంచి కనీసం పిట్ట కూడా కనిపించలేదు. ఆ పిట్ట కన్నొక్కటే కనిపించింది. భక్తుడైన గజేంద్రుడు ప్రాణాపాయస్థితిలో ఉంటే నారాయణుడు గజప్రాణావనోత్సాహియై- ‘సిరికిం జెప్పడు, శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబునను జీరడు, అభ్రగపతిం  బన్నింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము జక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు’.

ఉత్తరాఖండ్‍లో కనివిని ఎరుగని వరదలొచ్చి కేదారనాథ్‍లో మరణించిన జనం వేలాది. అస్తి నష్టం కోట్లలో. నిరాశ్రయులైన వారు లెక్కలేనంతమంది. ఈ ప్రమాదం గురించి తెలిసీ తెలియగానే జన ప్రాణావనోత్సాహులైన వారెందరో. ఆ సమయంలో వారందరి గమ్యం, కర్తవ్యం కేదారనాథ్‍తో- నర నారాయణుల స్థాయిలో ఉండాలి.

కానీ-  ఆ ప్రాంతంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో అది చాలా తాపీగా, నెమ్మదిగా స్పందిస్తోందని ప్రభుత్వేతర పక్షాలంటున్నాయి. సహాయానికి వచ్చినవారిలో అస్మదీయులు, తస్మదీయులు- స్పష్టంగా కనిపిస్తున్నారు ప్రభుత్వ పక్షానికి. వారు, వీరన్న భేదం స్ఫురణకు కూడా రాకూడని తరుణమిది. కానీ అందుకు నర నారాయణుల వ్యక్తిత్వాలు కావాలి. కేదారనాథ్‍లో అందుతున్న అనేక సహాయ కార్యకలాపాల్నిబట్టి నర నారాయణులున్నారని తెలుస్తోంది. కానీ వారు రాజకీయాల్లో ఉన్నట్లు తోచదు. ఉంటే- త్వరలోనే ఎన్నికలున్నాయి. వారిని గుర్తించి పట్టం కట్టడం మన బాధ్యత.

ఈ సందర్భంలో మనకి గర్వకారణం మన సైన్యం. రాజకీయవాదులు ఎంతలా దిగజారుతున్నా- తమ ఔన్నత్యంలో ఒక మెట్టు కూడా దిగని మన సైన్యం- అవసరమైతే తామే వంతెనగా మారి జన పాద ఘట్టనల్ని ఆహ్వానించారు. అలా వారు తమని ఏలేవారి అర్హతకి ప్రమాణాలు సృష్టిస్తున్నారు. వాటిని అనుసరించే బాధ్యత మనది.

ఒక చుక్క సారాకోసం, ఒక చిన్న లాభం కోసం, మనవాడన్న మమకారం కోసం కాక- మన మధ్యలో ఉన్న నర నారాయణులను వెదికి పట్టుకుని పట్టం కట్టేందుకే ఎన్నికలని మనం గుర్తించాలనే- భగవంతుడు వరదలతో ఈ ప్రళయాన్ని సృష్టించాడేమో. ఈ అవకాశాన్ని తీసుకుని మనం నర నారాయణుల్ని ఏలికలు చేసుకుంటే- మళ్లీ ఇలాంటి విపత్తులు రావు. దేశంలో ఎప్పటికీ నిరాశ్రయులుండరు.

 

3 వ్యాఖ్యలు »

  1. kslkss said,

    క్రియా శక్తి చంద్రబాబు, మైనో భక్తి తత్పరుడు కిరణ్. మొక్కుబడిగా పాత్రోచిత్రంగా వ్రాసి ఇచ్చిన సంభాషణలు పలికిపొయిన గాలికోడి కొణిదన. చాణూర ముష్టికులు హనుమంతరావు, ఉత్తం కుమార్, ( ఎలెక్ట్రానిక్ దృశ్యమాధ్యమాల ఆధారంగా )

  2. saarvabouma said,

    మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం. బగవంతుడు అందరికి అన్ని సార్లు అవకాశం ఇవ్వడు. కొన్ని సారులు మాత్రమే ఇస్తాడు. మన కళ్ళు తెరిపించాడానికేనా అన్నట్లు ఉత్తరాఖాండ్ వరద బీబత్సం వచ్చింది. ఈ సమయంలో ఏ రాజకీయ నాయకుడు ఎలా ప్రవర్తించాడు అనేది చూడటం అవసరం.దాని బట్టి రానున్న ఎన్నికల్లో మన నిర్ణయం ప్రకటించడమూ అత్యవసరం.దీనిని కూడా. చూడండ్ http://ssmanavu.blogspot.in/2013/06/blog-post_6908.html


Leave a Reply

%d bloggers like this: