Site icon వసుంధర అక్షరజాలం

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు- ఒక స్పందన

seethamma-vakitlo-sirimalle-chettu-images-045

పై చిత్రానికి లంకెః http://movies.sulekha.com/telugu/seethamma-vakitlo-sirimalle-chettu/pictures/1.htm   సులేఖా వారికి ధన్యవాదాలు.

హీరో పేరుని తారాగణంలో అందరు తారలతో పాటు మామూలుగా చూపించే రోజుల్లో నటులుగా ఎదిగారు- ఎన్టీఆర్, ఏయన్నార్. ఆ తర్వాత జనాలకి వాళ్లిద్దరూ అంటే అభిమానం దురభిమానంగా మారిపోతున్న రోజుల్లో కూడా- వాళ్లిద్దరూ   కలిసి నటించిన చిత్రాలు అడపా తడపా వచ్చేవి. మిస్సమ్మ, భూకైలాస్, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్ వాటిలో కొన్ని. ఆ చిత్రాలు వారిద్దరూ ఉన్నారని కాక- కథ, నిర్మాణ విలువలతోనే బాగా ఆడేయి. అప్పట్లో ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నారన్నది విశేషించి చర్చనీయాంశంగా ఉండేది కాదు.

ఆ తర్వాత వారిలో ఒకరు నటరత్నగా, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైతే- ఒకరు నటసామ్రాట్‍గా వెలిగారు. గుండమ్మ కథలో వారు కలిసి నటించడం ఒక సంచలన వార్తయింది. అయినా వారి ఎంపిక కథలో పాత్రల కోసమే జరిగింది తప్ప- వారికోసం పాత్రలు సృష్టించబడలేదు. ఆ తర్వాత వారిద్దరూ సినీరంగానికి తిరుగులేని నాయకులుగా మారిపోయినప్పుడు- వారిద్దరితో మరో రెండు చిత్రాలు వచ్చాయి. వారికోసమే పాత్రల్ని సృష్టించిన రామకృష్ణులు, పాత్రలకు బదులు నటులే కనిపించిన చాణక్య చంద్రగుప్త- ఘోర పరాజయాన్ని చవి చూశాయి.

నేడు అగ్రస్థానంలో ఉన్న వెంకటేష్, మహేష్ బాబులతో శ్రీకాంత్ అడ్డాల ఒక చిత్రాన్ని తలపెట్టడం, అది తియ్యడానికి అగ్రశ్రేణి నిర్మాత దిల్ రాజు పూనుకోవడం- జరిగినప్పుడు నాకీ  నేపథ్యం స్ఫురించింది. చిత్రసీమలో అహం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఈ ప్రయత్న ఫలితాన్ని చూడాలని చాలా కుతూహలం పుట్టింది. ఈ జనవరి 11న చిత్రం విడుదలైంది. మా చుట్టుపక్కల ఒకటికి మించి థియేటర్లలో విడుదలైతే- రద్దీ తగ్గేదాకా ఆగాలని  మూడు నాలుగు వారాలు ఆగాం. ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అని మీడియా ఘోషించింది కానీ మేము చూద్దామనుకునేసరికి ఈ చిత్రం మాకు దరిదాపుల్లో లేదు.  

ఇటీవల అంటే జూన్ 9న మాటివి వారు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. మామూలుగా ఐతే టివిలో వేసే సినిమాలు చూడ్డానికి మేము విముఖులం. రెండున్నర గంటల సినిమాని 4-5 గంటలు చూడాలి. ప్రతి ఐదూ పది నిముషాలకూ అంతరాయం వస్తే భరించాలి. అవి కాక కాలింగ్ బెల్, టెలిఫోన్ కలిగించే అంతరాయాలు అదనం. ఇవన్నీ పక్కన పెడితే- థియేటర్‍లో పెద్ద తెర ఇచ్చే అనుభూతి వేరే ఉంటుంది. టివిలో నచ్చని కొన్ని సినిమాలు థియేటర్లో నచ్చడం మాకు స్వానుభవం. థియేటర్లో నచ్చేక కూడా, బుల్లితెరపై నచ్చని చిత్రాలు కూడా ఉన్నాయి.

ఏది ఏమైనా ఈ చిత్రాన్ని చూడాలనుకున్నాం. టివిలో ఐతేనేం చూశాం. సినిమా తీసేది థియేటర్ కోసమే కాబట్టి- సాధారణంగా బుల్లి తెరపై చూసిన చిత్రాలను సమీక్షించడం సబబు కాదనుకుంటాం. అందుకే థియేటర్లో చూసిన వారి సమీక్షలు (ఒకటి, రెండు) ఇక్కడ ఇచ్చి- ఈ చిత్రం చూసేక మాలో కలిగిన భావాల్ని నలుగురితో సమీక్షగా కాక, స్పందనగా పంచుకుంటున్నాం.

మెచ్చుకోతగ్గ అంశాలు

హీరోలు అగ్రతారలైనా- వారికి చిత్రంలో ప్రత్యేకత ఆపాదించకపోవడం. చిత్రంలో పాత్రలేవీ నేల విడిచి సాము చెయ్యకపోవడం. ఎక్కువగా గ్రామీణ నేపథ్యం. మిగతా చిత్రాన్ని కూడా పూర్తిగా తెలుగునాటనే తియ్యడం. పాటల్లో చెప్పుకోతగ్గ తెలుగుతనం. మూస కథలకు భిన్నంగా తియ్యాలన్న అభిరుచి. ప్రకాష్ రాజ్ నటన, పాత్రచిత్రణ. రావు రమేష్ పలుకులు, పాత్రచిత్రణ. రవిబాబు నటన, పాత్రచిత్రణ, సన్నివేశాలు. మురళీమోహన్ పాత్ర. కోట శ్రీనివాసరావు నటన, పాత్ర. అంజలి పాత్రచిత్రణ.

అసంతృప్తి కలిగించిన అంశాలు

ఇది ఒక కుటుంబ కథా చిత్రం.  ఆ కుటుంబ సభ్యులు రోహిణి హత్తంగడి, ప్రకాష్ రాజ్, జయసుధ, వెంకటేష్, మహేష్ బాబు, అంజలి. చూసేవారికి అదొక కుటుంబంలా అనిపించదు. ఎవరికి వారు ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లు- తమ సంభాషణలు చెబుతూ ఏకపాత్రాభినయం చేస్తారు. మరో కుటుంబం రావు రమెష్‍ది. ఆ కుటుంబమూ అంతే.

తొక్క, దూల- ఈ పదాలు వ్యాపారాత్మక చిత్రాల్లో ఉన్నా వెగటుగా అనిపిస్తుంటే- కనీసం ఓ కుటుంబ కథా చిత్రంలో తప్పించలేమా?

ఈ చిత్రంలో అంజలి నటనకి చాలా పేరొచ్చింది. దీన్నిబట్టి జనం గ్లామర్ పాత్రలకి ఎంతగా విసిగిపోయారో తెలుస్తుంది. నిజానికి అంజలి పాత్ర గొప్పతనం నటనలో లేదు. విభిన్నతలో ఉంది. అంజలి కూడా గొప్పగా నటించక పోయినా విభిన్నతకు ప్రయత్నించింది. ఆమె సంభాషణలు అర్థవంతంగా ఉండడంవల్ల- సహజంగా లేకపోయినా రాణించాయి.

వెంకటేష్, మహేష్ బాబులు చూడ్డానికి అన్నదమ్ములుగా చాలా బాగున్నారు. కానీ వారి ప్రవర్తన మనమెరిగిన  అన్నదమ్ములకులా ఉండదు. వారు తిన్నగా ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోరు.  మిగతా చిత్రాలకు భిన్నంగా నటించాలన్న తాపత్రయంలో వారి నటన ఏదోలా ఉంది. ఇక మహేష్ బాబు ఐతే గతంలో- అర్జున్, నాని, ఒక్కడు వగైరా కుటుంబ చిత్రాల్లో నటించినది ఇతడేనా అనిపించింది. బిజినెస్ మాన్ చిత్రంలోలా ఎటో చూస్తూ, ఇబ్బందిగా నవ్వుతూ, టెన్షన్ ముఖం పెడుతూ- అదే ఆత్మీయతని చూపడం అనుకోమన్నట్లున్నాడు. గతంలో హిందీ నటుడు దేవానంద్ ఎటువంటి సన్నివేశంలోనైనా- ముఖంలో అదో రకం చిరునవ్వుతో, కాళ్లూ చేతులూ వ్రేలాడేస్తూ- ఒకే తరహా నటన చూపేవాడు. అతడిది సమ్మోహన రూపం కావడంవల్ల అదే ఒక స్టయిలై అభిమానులు అనుకరించేదాకా వెళ్లింది. మహేష్ బాబుదీ సమ్మోహన రూపం కాబట్టి అదే తరహాలో వెడుతున్నాడేమో తెలియదు. ఇక వెంకటేష్ విషయానికొస్తే- తమ్ముడిపై ప్రేమ చూపడానికి అతడికున్న ఏకైక మార్గం- తమ్ముడు ఊరెడుతున్నప్పుడు బలవంతపెట్టిడబ్బివ్వడం. పలుమార్లు కన్పించే ఆ సన్నివేశం కావాలని పెట్టినట్లుంది. ఆపైన వెంకటేష్‍కి ఉద్యోగమూ లేదు, ఆదాయమూ  లేదు.

వెంకటేష్‍ది ఆత్మాభిమానమున్న పాత్ర అని దర్శకుడి ఉద్దేశ్యం. కానీ చిత్రం చూస్తే అతడు ఉత్తపుణ్యాన ఇతరుల్ని విసుక్కునే తరహా అనిపిస్తుంది. ముఖ్యంగా అంజలిపట్ల అతడి తీరు సమర్థనీయంగా అనిపించదు. మహేష్ బాబు తనని ఇష్టపడ్ద అమ్మాయిల్ని చిన్నబుచ్చడం- ఈ చిత్రంలో హాస్యమైంది. అది హీరో పాత్రకి మచ్చ. ఇష్టపడ్డందుకు చిన్నబుచ్చితే- మహేష్ బాబునైనా నిరసించగలమని అమ్మాయిలు పత్రికాముఖంగా చెప్పకపోతే- బయట అబ్బాయిలు తాము మహేష్ బాబులమనుకుని అనుకరించే ప్రమాదముంది. ఆ విషయం దర్శకుడికీ స్ఫురించిందేమో- చివర్లో ఓ అమ్మయిచేత మహేష్ బాబుకి రిటార్ట్ ఇప్పించారు. ఏది ఏమైనా ఈ అన్నదమ్ములిద్దర్నీ తలిదండ్రులు సరిగ్గా పెంచలేదనిపిస్తుంది.

నేటి గ్రామాలు మునుపటిలా లేకపోవచ్చు. కానీ ఈ చిత్రంలోలా ఉంటాయని అనిపించదు. మాకైతే ఈ చిత్రంలో గ్రామీణ వాతావరణం చూడగానే ఓ కథ గుర్తుకొచ్చింది. ఒక ధనిక విద్యార్థిని పేదరికం మీద వ్యాసం వ్రాయమంటే- ‘రాముడు పేదవాడు. అతడి తండ్రి పేదవాడు. అతడి మేడ నిండా పేదరికం. అతడి పనివాళ్లు, కారు డ్రైవరు, తోటమాలి- అంతా  పేదవాళ్లు…’ అని వ్రాసుకుంటూ పోయాడట. అదే తరహా అవగాహన ఈ చిత్రంలో గ్రామీణ వాతావరణానిది. కథ, పాత్రలు గ్రామంలో ఉంటే గ్రామీణ కథా చిత్రం అయిపోదు. గ్రామం ఆయువుపట్టుని చూపగలగాలి. అందుకు దర్శకులు సినీ పరిజ్ఞానానికి మించిన కృషి చెయ్యాలి. లేదూ ఇప్పటికే పల్లెలకు ఆమడ దూరంలో ఉంటున్న నవతరం- మన పల్లెలు, అక్కడి పాత్రలు ఇలాగే ఉంటాయనుకోగలరు.

ఈ చిత్ర కథ, సందేశం అద్భుతం. ఎటొచ్చీ చిత్రీకరణలో ‘కొత్త బంగారులోకం’ అవగాహన కనపడదు. అనుకోవాలి కానీ అభిరుచి ఉన్న దర్శక నిర్మాతలకు అవగాహన ఓ సమస్యా? ఈ చిత్రం ఈ జంటనుంచి గొప్ప, మంచి చిత్రాల్ని ఆశించేలా చేస్తుందని మా నమ్మకం.

Exit mobile version