జూలై 22, 2013
బలుపు- చిత్రసమీక్ష
‘మాట్లాడుకోవడాల్లేవు’ అంటూ చెలరేగాడు అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’. అయితే తెలుగు నాట హిట్ కొట్టాలనుకునే దర్శకులందరూ అనుసరించే సందేశం ‘ఆలోచించడాల్లేవు’.
‘ఆలోచించడాల్లేవు’ అనే మన నిర్మాతలకు డబ్బు బలుపు. మన దర్శకులకు పేరు బలుపు. మన హీరోలకు క్రేజ్ బలుపు. మన హీరోయిన్లకు గ్లామర్ బలుపు. మన కమేడియన్లకు తామే బలుపు. ఇన్ని బలుపులు కలిస్తే కథకు బలుపు అక్కర్లేదనుకునే మన చిత్రాలకు ప్రేక్షకులే బలుపు. అలాంటి బలుపు ఒకటి జూన్ 28న బలుపుగా మనముందుకు వచ్చింది.
ఒక ప్రముఖ సినీ తార (లక్ష్మీరాయ్)ఒక చారిటీ షోకి వస్తే- అక్కడ ఓ విలన్ (అడవి శేషు) అతడి బృందం తప్ప ఉండరు. వారామెపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కాపాడేవారే లేరు. ఆమె ఎలాగో తప్పించుకుని రోడ్డెక్కితే- ఆమెను కాపాడగలిగిన ఒకే ఒక్కడు (రవితేజ) తెరమీద ప్రత్యక్షమౌతాడు.
అందమైన ఓ అమ్మాయి (శ్రుతి హాసన్), తన అంకుల్‌తో కలిసి- అమాయకులైన అబ్బాయిల్ని మోసం చేసి వినోదిస్తూంటుంది. ఆ మోసాన్ని ఎదుర్కుని ఆమెకు బుద్ధి చెప్పగలవాడు హీరో ఒక్కడే. అప్పుడు ఆమె హీరోతో ప్రేమలో పడుతుంది.
హీరోకి జోడు వెదకడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్న తండ్రి (ప్రకాష్ రాజ్)- కనిపించిన యువతులని వేసిన ప్రశ్నలకు వారిచేత అనుమానించబడి జైలు పాలవుతూంటాడు. హీరో కోసం ఓ పెద్ద గూండా (అసుతోష్ రాణా) వెదుకుతూ- ఓ పెళ్లి వేడుకలో హీరోనీ, అతడి తండ్రినీ చూసి- వీళ్లిద్దరూ బద్ధశత్రువులు కదా- తండ్రీ కొడుకులెలాగయ్యారూ అని ఆశ్చర్యపోయిన మెలికతో విశ్రాంతి.
విశ్రాంతి తర్వాత ఫ్లాష్‌బ్యాక్. ఓ పెద్ద గూండా కూతురు (అంజలి) హింసను ద్వేషించే డాక్టరు.
‘ఆలోచించడాల్లేవు’ అనడానికి మచ్చుగా కథకి సంబంధించిన కొన్ని వివరాలివి. మొత్తం కథంతా ఇలాగే కొనసాగుతుంది.
చిత్రమేమిటంటే- ఆదినుంచి అంతందాకా ఈ చిత్రం హాల్లో ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుంటుంది. చిత్రం పూర్తి మూసగానే అనిపించడంవల్ల- ఆ ఘనత ఎవరికివ్వాలో చెప్పడం కష్టం.
హీరో రవితేజ నటనలో ఏ మాత్రం కొత్తదనం లేకపోయినా తనదైన మూసలో ఒప్పించాడు, రాణించాడు. శ్రుతి హాసన్ అందంగా ఉంది. తన అందాల్ని ప్రేక్షకులకి వివరించడానికి వీలైనంత ప్రయత్నించింది. ఒక పాటలో కాజల్‌ని అనుకరించిందా అనిపించింది. ఆమె హీరోయిన్ మాత్రమేననేమో- నటిగా అంజలిని తీసుకున్నారు. అంజలి ఎంత అందంగా ఉందో అంత అందంగానూ నటించింది. ఆరంభంలో కనిపించిన లక్ష్మీరాయ్- అందమైన ఆంటీలా ఉంది, బాగుంది. ప్రకాష్ రాజ్ తన పాత్రకు న్యాయం చేకూర్చాడు. నాజర్ ప్రతిభకి న్యాయం చేకూర్చే పాత్ర లభించలేదు. అసుతోష్ రాణా భయపెట్టే పాత్రలో నవ్వొచ్చేలా నటించాడు. ఆ పాత్రకి శాయాజీ షింధే అయితే ఇంకా బాగా నప్పేవాడనిపించింది. అడవి శేషు చూడ చక్కగా ఉన్నప్పటికీ ‘పంజా’ స్థాయి నటన ప్రదర్శించలేకపోయాడు. బ్రహ్మానందం ఆశించినంతగానూ నవ్వుల పంట పండించాడు. గంగ్నమ్ స్టైల్ కి వన్నె తేవడమే కాక- యూ ట్యూబులో సంచలనం సృష్టించిన ఆ నృత్యం అసలు స్థాయిని నిరూపించాడు. ఆలీ హుందాగా నటించాడు. అతడికి డాక్టర్ సావిత్రి అని పేరు పెట్టడం– ఎందుకో తెలియలేదు. హాస్యం పేరు దగ్గిరే ఆగిపోవడంవల్ల – ఆలీ అని పేరు పెట్టినా సరిపోయేది. మిగతా నటీనటులు పాత్రోచితంగా అనిపించారు.
సంభాషణలు జనాకర్షకంగా ఉన్నాయి. పాటలు కొత్తగా లేవు కానీ తమాషాగా ఉన్నాయి. చిత్రీకరణ కూడా బాగుంది. నృత్యాల్లో అభిమానులు కానివారికి రవితేజని భరించడం కష్టమే. అమ్మాయిలందరూ బాగున్నారు. శ్రుతి చాలా బాగుంది. అంజలి తప్ప మిగతా ఇద్దరూ కాస్త రెచ్చిపోయారనిపించింది- కానీ మన సినిమాలకు కొత్త అనిపించేంతలా కాదు.
ఆద్యంతం ఆసక్తికరంగా, వీలైనంత వినోదాత్మకంగా రూపొందించడంలో ఈ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని అభినందనీయుడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కౄరత్వానికి ప్రాధాన్యమున్న చోట- పాటని పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించిన తీరు మరువలేము. నిర్మాత బలుపుకి సహకరించగల ఈ చిత్ర విజయం- ఈ బృందంనుంచి- ‘ఆలోచించడాలున్నాయ్’ అనిపించే సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే హిట్ చిత్రాల్నికూడా మున్ముందు ఆశించవచ్చు.
shri said,
జూలై 23, 2013 at 4:44 సా.
అహా..ఎమి టైటిల్!
సినిమాల కథలే కాదు పెట్టాలంటే పేర్లు కూడా తగ్గిపోతున్నాయి
శ్రీదేవి
surya prakash apkari said,
జూలై 23, 2013 at 6:51 ఉద.
రవితేజ పెద్దనటులకు తక్కువ,చిన్న నటులకు ఎక్కువ!అతని సినిమాలు ఈ మధ్య ఎందుకో వరుసగా విఫలమవుతున్నాయి!ఎందుకో అతనికి బాగా తెలిసి ఉండాలి!సరైన కథ కథనం లేకపోవడం వలన!ఈ సమీక్షకుడు చెప్పినదాన్నిబట్టి ఈ కథకూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లుంది!such feedback is very valuable!The audience is smarter than we think they are!
వసుంధర said,
జూలై 23, 2013 at 10:37 ఉద.
ఈ సినిమా బాగా హిట్టయింది.