సెప్టెంబర్ 9, 2013

దొరలు-గులాములు

Posted in సాంఘికం-రాజకీయాలు at 5:32 సా. by వసుంధర

hitler55

           (Picture from the USHMM, courtesy of Richard Freimark.)

ఇంగ్లండునుంచి తెల్ల దొరలు వచ్చారు. అనైక్యవాదంతో మనలో మనం కలహించుకుంటుంటే విభజించి పాలించే విధానం అనుసరించి వారు మనకి దొరలయ్యారు. వారు మనని దోచుకుంటుంటే మనం వారికి గులాములమై నిస్సహాయంగా చూస్తూండిపోయాం. ఇది ఇటీవల మన చరిత్రలో ఒక అంకం.

మహాత్ముడి నేతృత్వంలో పోరాటం సాగించి తెల్ల దొరలను తరిమి కొట్టాం. మీకు స్వతంత్రం వచ్చిందని అభినందిస్తూ నల్లదొరలు ఏలుబడికి వచ్చారు. అనైక్యవాదంతో మనలో మనం కలహించుకుంటుంటే విభజించి పాలించే విధానం అనుసరించి వారు కూడా మనకి దొరలయ్యారు. వారు మనని దోచుకుంటుంటే మనం వారికి గులాములమై నిస్సహాయంగా చూస్తూండిపోతున్నాం. ఇది ఇటీవల మన చరిత్రలో మరో అంకం.

అందరికీ సమాన హక్కులు అంటారు. అంతా సమానులంటారు. కానీ మనం కులం పేరిట, భాష పేరిట, ఇంకా ఏమేమో పేరిట ఒకరినొకరు ద్వేషిస్తున్నాం. మనని రెచ్చగొట్టినవారు రోజు రోజుకీ బలుస్తున్నారు.

మన రాజ్యాంగం అన్ని మతాలూ సమానమంది. కానీ కొన్ని మతాలవారిని మైనారిటీలు అంటాం. అందరికీ సమాన గౌరవ ప్రతిపత్తులున్న ఈ దేశంలో ఈ మైనారిటీ పదానికి ఇంత వాడుక ఎక్కణ్ణించి వచ్చింది?

అన్నింటికీ మూల కారణం మనం ఎన్నుకున్న ప్రతినిధులు మనకి దొరలుగా మారిపోవడం. మనని గులాములుగా ఉంచడమే వారి ధ్యేయం కావడం.

మనం కొట్టుకు చస్తున్నాం. చస్తూ కొట్టుకుంటున్నాం. మనని ఆందుకు ప్రోత్సహిస్తున్న దొరలు కోట్లకి పడగలెత్తి పొంగిపోతున్నారు.

మన ప్రగతికైనా, అథోగతికైనా బాధ్యత మన ప్రతినిధులది. ఇరుగు పొరుగులది కాదు. ఆ విషయం గుర్తించకపోతే మన ప్రతినిధులు మనకి దొరలౌతారు. వారికి మనం గులాములమౌతాము.

యుద్ధాలు జరిగితే చనిపోయేది సైనికులు. యుద్ధానంతరం కరచాలనం చేసి, కౌగలించుకుని స్నేహితులుగా మారిపోయేది దొరలు. దొరలకు పూర్వవైభవం తిరిగొస్తుంది. కానీ చనిపోయిన సైనికులు తిరిగి రారు.

పొరుగువాణ్ణి ప్రేమించమని ప్రతి మతమూ చెబుతుంది. ఒక్క రాజకీయమే అందుకు భిన్నం. మనది ప్రజాస్వామ్యం కాబట్టి ఈ రాజకీయంలో బాధ్యత మనది. కొందర్ని దొరల్ని చేసి మనం గులాములమైతే మాత్రం ప్రజాస్వామ్యంలో కూడా దొరలకే తప్ప ప్రజలకు మనుగడ ఉండదు. దేశంలో ప్రతి ప్రాంతంలోనూ పొరుగువాళ్లని ప్రేమించాలనీ, ద్వేషించడం కూడదనీ మనమంతా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే- మన దొరలు మళ్లీ ప్రతినిదులుగా మారతారు. మన బాగుకి పొరుగువారితో లంకె విడి, అది దొరల బాధ్యతగా మారుతుంది. లేదూ పరస్పర విద్వేషాలు కొనసాగిస్తామని మనం నిర్ణయిస్తే- 1994లో క్రాంతివీర్ చిత్రంలో నానా పటేకర్ చెప్పిన ఈ మాటలు వినండి. దేశంపట్ల మన తీరుకి ఈ చిన్న కవిత చదవండి.

అట్టుడికిపోతున్న దేశంలో యథాప్రకారం జరుగుతున్న నేటి పండుగ వేడుకల నివేదికలు చూశాక క్రాంతివీర్ చిత్రం గుర్తుకొచ్చింది.

మన దేశంలో రాజకీయం భ్రష్టు పట్టినట్లుంది. విద్యావంతులు నిదానంగా ఆలోచించి సామాన్యజనంపై పడుతున్న ఈ ప్రభావాన్ని అరికట్టాలి. ప్రతి ఇంటా కనీసం ఒకరైనా విద్యావంతులున్నకాలమిది. వారు పూనుకుంటే తప్ప మనకి గులాంగురీనుంచి మోక్షం ఉండదు. కానీ ఉంటుందనే ఆశిద్దాం. 

అక్షరజాలం వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

1 వ్యాఖ్య »

  1. శ్రీ సీతారామ శాస్త్రి గారి ప్రబోధగీతాలలో మచ్చుకొకటి: నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని అంటూ సాగుతుంది ఆ గీతం. మనిషన్నవాడిలో కనీస స్పందన కరువౌటం మానవత్వానికి మాయని మచ్చ. ప్రజాస్వామ్యములో హక్కులు చాలా ఉన్నాయి. కాని వెలిబుచ్చే సాహసమనేది ఒకరు ఇచ్చేది కాదు, బజారులో దొరికేది కాదు. ఈ వ్యాసంలోని విషయాలు అక్షర సత్యాలు. అందరికీ తెలిసిన నిజాలు. కాని నిర్వీర్యమైన ఈ జాతికి నిర్లిప్తత అనే మానని మాయరోగం వచ్చినట్లుంది. మందే ఇంతవరకు కనుగొనే శాస్త్రవేత్త ప్రభవించలేదు.


Leave a Reply

%d bloggers like this: