సెప్టెంబర్ 10, 2013

భారత రత్నం గుల్జారీలాల్ నందా

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:10 సా. by వసుంధర

gl nanda గుల్జారీలాల్ నందా (జూలై 4, 1898 – జనవరి 15, 1998) భారత జాతీయ రాజకీయనాయకుడు. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణము తరువాత. రెండవ సారి 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణము తర్వాత. రెండు సందర్భములలో ఈయన నెల రోజుల లోపే, భారత జాతీయ కాంగ్రేసు కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. 1997లో ఈయనకు భారత రత్న పురస్కారం లభించింది. మరణానంతరం వీరిని సంస్మరిస్తూ మన దేశం ఒక తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. కానీ….

వీరి చివరి రోజుల గురించి స్వాతి వారపత్రిక (6-9-2013) అందజేసిన వివరాలు నేటివారిని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి.

తన పిల్లలకి రాజకీయాల వాసన సోకనివ్వని ఆయన 1967  తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారుట. వృద్ధాప్యంలో పిల్లలమీద ఆధారపడక తను, భార్య ఒక అద్దెఇంట్లో ఉన్నారట. ఆయనకు వేరే ఆదాయం లేదు. తన సేవలకుగానూ దేశాన్ని ఆర్థిక సాయం కోరే మనస్తత్వం కాదాయనది. మిత్రులు బలవంతపెడితే స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే ఫించను కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 1983లో ఆంటే ఆయనకు 85 సంవత్సరాల వయసులో నెలకు 500 రూపాయల ఫించను మొదలైందిట. ఇంటద్దె సక్రమంగా చెల్లించడం లేదని ఇంటి యజమాని తరచుగా ఆయన్ను నానామాటలూ అనేవాడట. తన తిట్లు భరిస్తున్న వ్యక్తి- రెండుమార్లు దేశానికి ఆపద్ధర్మ ప్రధానిగా పని చేసినట్లు ఆ గృహ యజమానికి తెలియదు. ఆయనకే కాదు, చుట్టుపక్కల వారెవరికీ నందాజీ ఆ విషయం చెప్పలేదు. తిట్టినప్పుడు మన్నించమని ఓ దణ్ణం పెట్టి, ఉన్నప్పుడు ఎంతోకొంత బకాయి చెల్లవేసే ఆయన్ని కొన్నాళ్లు భరించినా, చివరికి ఆయన సామాను కొంత జప్తు చెయ్యాలనుకున్నాడు గృహయజమాని. కానీ ఆ ఇంట్లో ఒక పాత పరుపు, చాప, పాత వంట గిన్నెలు తప్ప మరేమీ లేక పోయేసరికి- ఆయన పరిస్థితి అర్థమైంది గృహ యజమానికి. దాంతో ఆ సామాను విసిరేసి నందాజీని ఇంట్లోంచి పంపేశాడు. అసహాయంగా రోడ్డెక్కి నిలబడ్డ ఆ బక్క మనిషి నందాజీ అని ఎవరికీ తెలియదు. ఓ పత్రికా విలేకరి ఆ దృశ్యం చూసి బాగుందనుకున్నాడు. ఫొటో తీసి ఓ పత్రికకిచ్చాడు. అప్పుడు బయటపడింది నందాజీ గురించి. ఆయన బ్రతికి ఉన్నారని ప్రజలకు తెలిసింది. ప్రభుత్వం కూడా నాలిక్కరుచుకుని ఆయనకు వసతి ఏర్పాట్లు చెయ్యబోయింది. ఐతే అప్పటికి 94 ఏళ్ల ఆ గాంధేయవాది అవసరానికి మించిన సాయం తీసుకోలేదు. మట్టిలో మాణిక్యంగా మిగిలిపోయిన ఆయన 98వ ఏట 1997లో దేశం ఆయనకు భారత రత్న బిరుదునిచ్చింది. ఆ గాంధేయవాది అది అరాయించుకోలేక పోయాడేమో, ఏడాది తిరక్కుండా మరణించాడాయన. (ఈ కథనం పూర్తి వివరాలు స్వాతి వారపత్రికలో చూడండి)

ఆ త్యాగధనుడు అసలు సిసలు భారత రత్నం. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాబట్టి – ఆ పార్టీవారు పదేపదే ఆయన గురించి గర్వంగా చెప్పుకోవాలి. కానీ అమ్మ (సోనియా) త్యాగశీలత గురించి నిద్రలో కూడా పలవరించేవారు త్యాగానికిచ్చే నిర్వచనమే వేరు. వారసుల పెళ్లిళ్లకి 50 కోట్లు అవలీలగా ఖర్చు చేయగలవారికి నందాజీ పేరైనా తెలియునో లేదో!

ఈ వివరాలు అందించిన స్వాతి వారపత్రికకు అభినందనలు. మనకి ఎటువంటి నాయకులు ఉండేవారో, ఇప్పటివారు ఎలా ఉన్నారో తెలుసుకుంటే – 2014 గురించి అలోచించుకుందుకు సహకరించవచ్చు.

                                                              కొసమెరుపుః నాటివారిది త్యాగధనం. సాటివారికి త్యాగమే ధనం

1 వ్యాఖ్య »

  1. Prof.GS Murty said,

    Excellent should get due attention among the new generation to get inspired and to bring in more and more such personalities into the parliament and legislative assemblies. Let us hope for a good governance times ahead.


Leave a Reply

%d bloggers like this: