సెప్టెంబర్ 18, 2013

అడ్డా- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:23 సా. by వసుంధర

adda poster

పరిచయ వ్యాఖ్య

కావడానికి మనది ప్రజాస్వామ్యమే ఐనా మన జనాలకి రాజరికమే ఇష్టం. ఇది రాజకీయాలకు మాత్రమే కాదు, సినిమా రంగానికి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు సినీ ప్రముఖులకు ఈ విషయం బాగా తెలుసు. వారు తాము సాగినంత కాలం రాజరికం వెలిగించి, ఆ తర్వాత తమ వారసుల్ని ప్రవేశపెడతారు. వారి అభిమానులు ఆ వారసుల రాక కోసం, విజయాల కోసం ఎదురు చూస్తుంటారు.  అలా అక్కినేని కుటుంబంనుంచి వచ్చిన మరో హీరో సుశాంత్.  2008లో తొలి చిత్రం కాళిదాసు విడుదలైంది. 2009లో కరెంట్ విడుదలైంది. రెండు చిత్రాలూ విజయం సాధించలేదు. ఓ నాలుగేళ్ల వ్యవధి ఇచ్చి మళ్లీ సుశాంత్‍ని ప్రేక్షకుల మెప్పుకి గురి చెయ్యాలన్న ప్రయత్నం- ఈ ఆగస్ట్ 15న విడుదలైన అడ్డా చిత్రం.

కథ

ఒకరినొకరు తెలుసుకోకుండా ప్రేమలో పడి పెళ్లి చేసుకుని, ఒకరికొకరు తెలిసాక విడాకులకు సిద్ధం ఔతున్న నేటి తరం ప్రేమికుల కోసం హీరో ఓ అడ్డా పెట్టాడు. పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరికి నిజాలు చెప్పి వాళ్ల  ప్రేమ పెళ్లికి దారి తియ్యకుండా ఆపడం కథాంశం. ఇది కొత్తగా అర్థవంతంగా ప్రయోజనాత్మకంగా ఉంది. శ్రీను వైట్ల ఫార్ములాతో విసిగిపోయిన వారికి ఇది కాస్త రిలీఫ్. మొత్తం కథ కొత్తగా ఉందనలేం కానీ నేడు చూస్తున్న చిత్రాలకు విభిన్నంగా ఉంది. ఆరంభానికీ ముగింపుకీ పెట్టిన లంకె చాలా బాగుంది.

హీరో

సుశాంత్ అందగాడు అనలేం కానీ సన్నగా, పొడుగ్గా బాగున్నాడు. ముఖంలో భావాలు  ప్రకటితం అయ్యాయి అనలేం కానీ, మూస హీరోలకు భిన్నంగా ఉండడంతో తాజాతనం అనిపించింది. సంభాషణలు పలికినా, నృత్యాలు చేసినా కొత్తగా అనిపించి మంచి మార్కులే తెచ్చుకున్నాడు. మొత్తం సినిమా తన చుట్టూ తిరిగినా విసుగు అనిపించకుండా ఉన్నాడు.

హీరోయిన్

శాన్వి చాలా అందంగా, ముద్దుగా అనిపించింది. ఇంట్లో పిల్లలా అనిపించడం వల్ల వళ్లు దాచని ఆధునిక దుస్తుల్లోనూ, రెచ్చిపోయిన నృత్యాల్లోనూ- చూసేవారి మనసు కాస్త చివుక్కుమనవచ్చు. ఐతే నటనకు అవకాశమున్న పాత్ర లభించడం, అది తాను చక్కగా ఉపయోగించుకోవడం మెచ్చుకోవాలి. ఈ చిత్రం ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టవచ్చు. తెలుగు తెరకు, అంతో ఇంతో ప్రతిభ ఉన్న మరో అందాల నటి వచ్చిందనే చెప్పాలి.

ఇతర నటీనటులు

చాలామంది పేరున్న నటీనటులు ఈ చిత్రంలో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తారు. వాటిలోహీరోయిన్ తండ్రిగా నాగినీడు , పెళ్లిళ్ల రిజిస్ట్రార్‍గా కోట హుందాగా ఉన్నారు. శాన్వి అక్కగా సుహాసిని, ఆమె ప్రియుడుగా అవసరాల శ్రీనివాస్ సహజంగా ఉన్నారు. టివి కార్యక్రమం జబర్దస్త్ తో పేరుకెక్కిన ధనరాజ్ వంటివారు కూడా అవధుల మేరకు రాణించారు. జయప్రకాష్, రఘుబాబు తమ పంథాలో నవ్వించారు. గుండె జారి గల్లంతయిందే చిత్రంలో అబ్బాయిల వెంటపడే అబ్బాయిగా జోష్ రవి  పాత్ర (ఎబ్బెట్టుగా అనిపించినా) ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షించిందన్న దురభిప్రాయం సినీ లోకంలో బాగా ఉన్నట్లుంది. ఈ చిత్రంలో అతడికి లభించిన ప్రాధాన్యం మరింత వెగటుగా అనిపించింది. విలన్‍గా దేవ్ గిల్ కృత్రిమంగా అనిపించాడు. ఐటమ్ డాన్స్ లో శ్వేతా భరద్వాజ్ అలాంటి పాటలకి ఆడపిల్లయితే చాలా అనిపించేలా ఆడిపాడింది.

పాటలు, నృత్యాలు

రూబెన్ సంగీతం పాడుకుందుకు అనువుగా చాలా బాగుంది. వరసలు హమ్ చేసుకుందుకు బాగున్నాయి. నృత్యాల చిత్రీకరణ బాగుంది.

కథనం

కథాంశానికి న్యాయం చేకూర్చేలా పట్టు, బిగువు ఉన్న  స్క్రీన్‍ప్లే తయారు చేసుకున్నాడు దర్శకుడు కార్తీక్ రెడ్డి. ఈ చిత్రం పూర్తిగా తనదే అనిపించేలా నడిపించడం అభినందనీయం. హీరో హీరోయిన్లు – లేని  ప్రేమ నటించినప్పుడు వారిలో నిజంగా ప్రేమ పుట్టడం; హీరో హీరోయిన్లు తమ తమ నేపథ్యాలు చెప్పడం- చిత్రీకరణ కారణంగా అద్భుతం అనిపించాయి. పెద్ద నటుల్ని చిన్న పాత్రల్లో ఇమడ్చడం, కామెడీ సీన్ల (గే కామెడీ మినహాయించి) టైమింగ్, సంభాషణల్ని ఉపయోగించుకున్న తీరు బాగున్నాయి. చిత్రం ఆద్యంతం రక్తి కట్టిందంటే అది దర్శకత్వపు ప్రతిభే అని ఒప్పుకోవాలి.

చివరగా

ఒక గొప్ప చిత్రాన్ని చూశామని అనిపించకపోవచ్చు. కానీ కాలక్షేపానికి తగిన మంచి చిత్రమిది. యువతరానికి చక్కని సందేశంతో, అంతో ఇంతో ప్రయోజనం కూడా ఉన్న ఈ చిత్రం- ప్రేక్షకుల ఆదరణ పొందింది. సమయానికి థియేటర్లలో పెద్ద తారల చిత్రాలు  లేకపోవడం కలిసొచ్చి ఉండొచ్చు. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే స్థాయిలో ఉన్నదీ చిత్రం. మున్ముందు ఈ బృందంనుంచి గొప్పవి అనిపించుకోగల చిత్రాలు కూడా రాగలవని ఆశిద్దాం.

Leave a Reply

%d bloggers like this: