సెప్టెంబర్ 20, 2013

ద్విశతమానం భవతి- అక్కినేని!

Posted in కళారంగం at 11:36 ఉద. by వసుంధర

anr pencil drawingచలనచిత్రాలు వచ్చేక తెలుగు తెరకు కొత్త మలుపునీ, అర్థాన్నీ, గౌరవాన్నీ ఇచ్చిన మహానటుల్లో శ్రీ అక్కినేని నాగెశ్వరరావు ఒకరు.

చదువురాని వాడినంటూ ఆయన మహాకవిగా (తెనాలి రామకృష్ణుడు, కాళిదాసు) ఒప్పించారు. డాక్టరుగా (డాక్టర్ చక్రవర్తి), ఇంజనీరుగా (మనుషులు-మమతలు) మెప్పించారు.  

నాస్తికుడినంటూ ఆయన భక్తుడిగా (విప్రనారాయణ, తుకారాం) నప్పించారు.

నేడు హీరోల మనుగడకు ముఖ్యంగా మారిపోయిన ప్రణయ నృత్యాలకి (దసరా బుల్లోడు, ప్రేమనగర్) ఆద్యుడై వాటి వెలుగుకి ఆజ్యం పోశారు.

భగ్నప్రేమికుడి పతనాన్నీ (దేవదాసు), మూగప్రేమ లోతునీ (బాటసారి) ప్రదర్శించడంలో అద్వితీయుడయ్యారు. 

నలబై ఏళ్ల వయసులో ఆరోగ్యపరంగా అయిపోయాడనిపించుకున్నాక కొత్త రక్తంతో మున్నెన్నడూ ఎరుగని చిందులతో (ఆదృష్టవంతులు) మన హీరోల నాట్యాలకు కొత్త ఒరవడి పెట్టి ‘అయ్యయ్యో బ్రహ్మయ్యా’ అనిపించారు. నిత్య యౌవనుడు అనిపిస్తూ అరవైకి దగ్గర పడుతూ కూడా యువతారలు శ్రీదేవి, జయసుధలకు ప్రియుడిగా (ప్రేమాభిషేకం) రాణించి తెలుగు సినీచరిత్రలో చెరగని రికార్డు నెలకొల్పారు. కానీ నలబైలలోనే ఏళ్ల వయసులోనే తండ్రిగా (మంచి కుటుంబం) ఒప్పించీ, డెబ్బయికిలోపే తాతగానూ (సీతారామయ్యగారి మనవరాలు) సెబాసనిపించుకున్నారు. ఎనబై ఏళ్ల వయసులోనూ సినిమాలలో (శ్రీ రామదాసు, శ్రీరామరాజ్యం) , నటిస్తున్నారు. ఇప్పుడు తొంబయ్యవ ఏట అదుగుపెడుతూ తన కుటుంబంలో మూడు తరాల నటులతో మనముందుకు (మనం) రానున్నారు.

నిజంగా మనకు స్మకాలీనుడేనా అని ఆశ్చర్యానందాలను కలిగించే ఆ చారిత్రాత్మక మహాపురుషుడి గురించి ఎంత చెప్పినా కొండంత దేవుడికి నలకంత పత్రే అవుతుంది. మనం ముఖ్యంగా తెలుసుకోవలసినది- ఆయన తన నటనా చాతుర్యాన్నీ, సంపదనీ, ఆరోగ్యాన్నీ కాపాడుకుంటూ వచ్చిన తీరు, క్రమశిక్షణ ఏ తరానికైనా ఆదర్శమని!

ఈ రోజు శ్రీ అక్కినేని తొంబయ్యవ పుట్టినరోజు. ఆయన స్వయంకృషికీ, మన అవసరానికీ నూరేళ్టే  చాలవు. కానీ అత్యాశకు పోతే అసలుకే మోసం రావచ్చు కదా! అందుకే వాస్తవ దృక్పథంతో ద్విశతమానం భవతి అని కోరుకుంటున్నాం.

ఈ వ్యాసానికి పెన్సిల్ చిత్రాన్ని రచించి అందించిన శ్రీ పొన్నాడ మూర్తికి ధన్యవాదాలు.

3 వ్యాఖ్యలు »

  1. మహానటుడు ఏ.ఎన్.ఆర్. గురించి మీరు వ్రాసింది బాగుంది. కానీ ఎంత వ్రాసినా ఇంకా ఎంతో వ్రాయాల్సింది మిగిలివుందేమో అనిపించడం సహజం. నిన్న ఇంటర్వూలో తనను ఇంటర్వూ చేస్తున్న అమ్మాయిని ఉద్దేశించి తనను ఆశీర్వదించమని ఆయన అడిగిన విధానం ఆయన సంస్కారాన్ని చెపుతూంది.
    ఈ మహానటుడి గురించి తెలిపినందుకు అభినందనలు.


Leave a Reply

%d bloggers like this: