సెప్టెంబర్ 24, 2013

స్వాతి చినుకులు- ఈటివి సీరియల్

Posted in టీవీ సీరియల్స్ at 8:33 సా. by వసుంధర

Swathi-chinukulu-_footer టివిలో వచ్చే డెయిలీ సీరియల్స్ అనగానే అర్థం లేనితనానికి మారుపేరుగా చెప్పుకుంటే అతిశయోక్తి కాదు. చిప్పలోన పడ్డ చినుకు ముత్యంబయ్యె అన్నదానికి విరుద్ధంగా ముత్యంలాంటి కథ కూడా టివిలో పడితే మసిబొగ్గు కూడా కాదు, బూడిదైపోతుందనడానికి ఎన్నో ఋజువులున్నాయి. అడపాతడపా మనసు చూడతరమా (ఈటివి), ఎదురీత (మాటివి) లాంటి కొన్ని సీరియల్స్ ఇందుకు మినహాయింపుగా ఉంటున్నాయి.

ఐతే టివిలో డెయిలీ సీరియల్‍ చలనచిత్రమంత వేగవంతమైన కథనంతో, నవలంత సుస్పష్ట వివరణతో, అర్థవంతమైన కథతో, వినూత్న వాస్తవ పాత్రలతో, కళాత్మక విలువలతో, వ్యాపారచిత్రాలంత ఆసక్తికరంగా రూపొందడం మాత్రం ఇంతవరకూ జరిగిందనిపించదు- ఈ సెప్టెంబర్ 9న ఈటివిలో స్వాతి చినుకులు మొదలయ్యేదాకా. రెండు కథల్ని మార్చి మార్చి చూపే ఈ సీరియల్లో ఒక కథకి నేపథ్యం గ్రామం. మరో కథకి నేపథ్యం రుమేనియా.

గ్రామంలో మనసు ఎదగని ఓ బాలు తన మేనకోడలు నీలని ప్రేమించాడు, నీల ఓ రామకృష్ణని ప్రేమించి ఆ ప్రేమ ఫలించడానికి బాలు సాయం కోరింది.

రుమేనియాలో ప్రేమకోసం తపించిపోతూ వచ్చిన మైథిలికి శాడిస్టుగా అనిపించే పాణిగ్రాహి తటస్థ పడతాడు. ఆ పాణిగ్రాహితో మైథిలి ప్రేమలో పడితే అతడి తల్లి తులసే మైథిలికి కొడుకు గురించి చాలా చెడ్డగా చెబుతుంది.

ఈ రెండు కథలూ చలనచిత్రాలకు దీటొచ్చే వాతావరణంలో, అద్భుతమైన సంభాషణలతో కొనసాగుతున్నాయి. నటీనటులు కథకు పూర్తి న్యాయం కలగజేస్తూ, పాత్రలకు ప్రాణం పోస్తూ- కథనాన్ని ఆసక్తికరం చేస్తున్నారు. ఈ సీరియల్ ఇదే స్థాయిలో కొనసాగుతుందని ఆశిస్తున్నాం. మాకు ఇంతగా నచ్చిన  ఈ సీరియల్ మీరూ చూడాలనుకుంటే తొలి ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

 

Leave a Reply

%d bloggers like this: