అక్టోబర్ 28, 2013
పోటుగాడు- చిత్రసమీక్ష
తెలుగులో సినిమాలు తీసేవారు- కథలు లేవో అని ఒకటే గోల. కథలు లేక కాదు, కథలు చదవక. చదివినా వాటిని సినిమాలుగా మలచే ప్రతిభ లేక. మన వాళ్లు సినిమాలు ఎలా తీస్తారో తెలుసుకుందుకు ఇటీవల వసుంధర వ్రాసిన శ్రుతి-అపశ్రుతి అనే కథ చదవండి.
మనకి పాఠకులు కరువౌతున్నారు కానీ పత్రికల్లో చదవడానికి బాగుండే కథలు, నవలికలు, నవల్లు చాలా వస్తున్నాయి. వాటిని సినిమాగా తీస్తే కూడా చాలా బాగుంటాయి. అలాంటి కథ ఒకటి ఈ సెప్టెంబర్ 14న పోటుగాడు సినిమాగా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే మన సినిమావాళ్లు కథలు, నవలలు చదవడం మొదలెట్టారని పొరపాటు పడొద్దు. కన్నడంలో పవన్ వడియార్ అనే దర్శకుడు చలనచిత్రంగా మలచిన కథని అదే దర్శకుడితో తెలుగులో తీశారు. ఆ మేరకు చిత్ర నిర్మాతల అభిరుచిని అభినందొచ్చు. కానీ, ఇదే కథని ఏ తెలుగు రచయితైనా వినిపిస్తే మన నిర్మాతలూ, దర్శకులూ- ‘అబ్బే, మన ప్రేక్షకులకి ఇది ఎక్కదు’ అనడం గ్యారంటీ. అంటే ఇది కన్నడంలో పెద్ద హిట్ కావడమే మనవాళ్ల అభిరుచికి కారణమైంది. సమీక్ష 1 సమీక్ష 2 సమీక్ష 3
హీరో పేరు గోవిందం (మనోజ్). జీవితంమీద విరక్తి పుట్టి జీవితాన్ని కొండెక్కించుకుందుకు ఓ కొండెక్కాడు. అక్కడ అతడికి అలాంటి పనిమీదే వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకట్ (పోసాని కృష్ణమురళి) తటస్థపడ్డాడు. ఇద్దరూ ఒకరి కథలు ఒకరు చెప్పుకోవడంతో కొత్త రకంగా కథ నడుస్తుంది. బొత్తిగా ప్రిన్సిపుల్స్ లేని గోవిందం సినిమా మొదటి సగంలో వరుసగా నలుగురమ్మాయిల్ని ప్రేమించాడు. ముగ్గుర్ని తను మోసం చేస్తే, ఒకామె అతణ్ణి మోసం చేసింది. ఇది మామూలు కథే అనిపించినా చెప్పడం కొత్తగా ఉంది. చిత్రం రెండో సగంలో గోవిందం చేసిన తప్పుడు పనులని సమర్ధించడం 1960లలో వచ్చిన పరమానందయ్య శిష్యుల కథ చిత్రం స్థాయిలో జరిగింది. అదే ఈ చిత్రానికి హైలైట్.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే ప్రాణం. సంభాషణలు చాలా బాగున్నాయి. అక్కడక్కడ రెండర్థాలు కాస్త చివుక్కుమనిపించినా- మన సినిమాలకు అది మామూలే కదా!
నటీనటుల్లో మంచు మనోజ్ ఆకారం, డైలాగ్ టైమింగ్, ఫైట్స్‌లో టైమింగ్, కొంతవరకూ నృత్యాలు చాలా బాగున్నాయి. కానీ రూపం అభిమానులకు తప్ప భరించడం కష్టమే. ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణ పోసాని. ఇతడు నటుడిగా త్వరగా ఎదుగుతున్నాడనే చెప్పాలి. హీరోయిన్లు నలుగురివీ (సిమ్రాన్ కౌర్, సాక్షి చౌదరి, రేచల్, అనుప్రియ) చిన్న చిన్న పాత్రలు. వారి రూపురేఖలు, హావభావాలు చూస్తే అంతకంటే ఎక్కువ సమయం వారిని భరించలేమనిపిస్తుంది. వీరిలో రేచల్ విదేశీ వనితగా నటించడంవల్లనేమో సహజంగా అనిపించింది. సాక్షి కంటే అనుప్రియకి పెద్ద పాత్ర ఉంటే బాగుండుననిపించింది. మిగతా నటీనటులవి (చంద్రమోహన్, అలీలతో సహా) ప్రత్యేకత లేని ఇంకా చిన్న పాత్రలు.
పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ప్యార్‌మే పడిపోయా మై పాట తమాషాగా ఉంది. దర్శకత్వం ప్రతిభావంతం. ఈ చిత్రానికి కన్నడంలో గోవిందాయ నమః అని పేరు పెట్టారు. అది కథకి తగ్గట్లు డీసెంట్‌గా ఉంది. పోటుగాడు కి బదులు అదే పేరుని తెలుగులోనూ కొనసాగిస్తే, అభిరుచికి మరిన్ని మార్కులు పడేవి.
భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి చిత్రాలు కొంతవరకూ రిలీఫ్. కథల విషయంలో మన చిత్రాలు మరిన్ని ఈ ఒరవడిని అనుసరించగలవని ఆశిద్దాం.
ayurbless said,
అక్టోబర్ 29, 2013 at 7:37 ఉద.
‘very good website’
ayurbless team
visit my ayurveda free treatment website: http://ayurbless.blogspot.in