Site icon వసుంధర అక్షరజాలం

తప్పంటూ ఉంటే అది ఎవరిది?

మనం భారతీయులం. మనం తెలుగువారం. ఆధునికత కూడా ఈ మాటని తప్పనదు. కానీ పూర్తిగా వ్యక్తిగతమైన మతం, కులం పేరిట మనని మనం సాంఘికంగా విభజించుకోవడం ఆధునికత అనిపించుకోదు. కానీ మన రాజకీయాల్లో ఆధునికతకంటే అనాగరికతకే ఎక్కువ ప్రాధాన్యం.

అన్ని ప్రాంతాలవారూ సామరస్యంతో ఉంటే మన నాయకులకు నిద్ర పట్టదు. ఒకరిపై ఒకరి అనుమానాలు రేపి ఒకరిపై ఒకరిని ఉసిగొలిపి ఉద్యమాలు లేవనెత్తుతారు. తాము విలాసాల్లో మునిగి తేలుతూ- ‘మా కోర్కెలు తీర్చకపోతే, మా వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు’ అంటూంటారు. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో- సుత్తి వీరభద్రరావు మిశ్రోకి గుండు గీయిస్తానని మ్రొక్కుకుంటాడు. అలాగన్న మాట! పాపం- చాలామంది అమాయకులు నాయకుల మాటలకు ప్రభావితులై- ఆత్మహత్య చేసుకోవాలి కాబోలు అనుకుని చేసుకుంటారు. నాయకులు ఆత్మహత్యల పేరెత్తడం- ఆత్మహత్యలకు ప్రోద్బలించినట్లే కాబట్టి- చట్టప్రకారం అది నేరం. ఈ విషయంలో న్యాయస్థానం ఏమంటుందో! ప్రజా నాయకులారా- ఇకమీదట మీకు అసంతృప్తి కలిగితే మీరే ఆత్మహత్య చేసుకోండి (మీకు ఆత్మంటూ ఉంటే!). ఎవరో చేసుకుంటారనకండి.

తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే ప్రజాప్రతినిధుల ఆస్తిపాస్తుల్ని కాస్త వివేకంతో గమనించాలి. ఇంచుమించుగా అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులూ- పదవుల్లోకి వచ్చేక- లక్షాధికారులుగా ఉండేవాళ్లు మహా కోటీశ్వరులుగా మారినమాట వాస్తవం. ‘మీరింతగా బాగుపడిన వ్యవస్థలో మేమెందుకు బాగుపడలేదు? మీ ప్రగతికి అడ్డురాని పరిస్థితి, మా ప్రగతికి ఎందుకు అడ్డు వస్తోంది?’ అని ప్రజలు తమ ప్రతినిధుల్ని నిలదియ్యాలి. లేకుంటే కొత్త పరిస్థితుల్లోనూ వారే బాగుపడతారు. ప్రజలు మాత్రం కలిసి ఉండరు. అంతే! కానీ- ఒక సారా బుడ్డికో, వంద రూపాయల నోటుకో- తమ ఓటుని అమ్ముకునే వారికి నాయకుల్ని నిలదీయగల అర్హత, వివేకం, సామర్ధ్యం ఎక్కడుంటాయి? అలాంటి సామాన్యుల్లో సామాజిక స్పృహ కలిగించగల  అసామాన్య పౌరులు- తాము కూడా కుల, మత, ప్రాంత విభేదాలకు లోనైతే- ఇప్పుడున్న నాయకులు మరింత రెచ్చిపోయే అవకాశముంది. వారిని చూసి సామాన్యులు ఏమి నేర్చుకుంటారో- తెలుసుకుందుకు మార్చి (2013) రచన మాసపత్రికలో వచ్చిన ఈ కథ సహకరించవచ్చు.

సీమాంధ్ర ప్రాంతంనుంచి విడిపోవడం తెలంగాణ ఆంధ్రుల అభిలాష ఐతే- ఇరుప్రాంతాల సామరస్యాన్నీ దృష్టిలో ఉంచుకుని విభజన ప్రక్రియ కొనసాగాలి. విభజనకు కారణం పరిపాలకుల తప్పు కనుక ఐతే- ఆ తప్పు ఇతర ప్రాంతాల వారిది అనడం సమంజసం కాదు. ఆ విషయాన్ని నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో డాక్టర్ నవజీవన్ వ్యాసం అంతర్జాలంలో లేదా ఇక్కడ చదవండి.

మనలో అవగాహన ఉంటే రాజకీయం మన జీవితాల్నిగట్టెక్కిస్తుంది. మనలో అవగాహన లేకుంటే రాజకీయం మన జీవితాల్ని కొండెక్కిస్తుంది. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి.

 

 

 

 

 

Exit mobile version