నవంబర్ 5, 2013

అత్తారింటికి దారేది- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:26 సా. by వసుంధర

attarintiki-daredi_1374490818

సినిమాకి కథేంటీ అంటారు. అది నిజమే! సినిమాకి కొత్తదనమేంటీ అంటారు. అదీ నిజమే! సినిమాకి లాజిక్కేంటీ అంటారు. అదీ నిజమే! కథ, కొత్తదనం, లాజిక్కూ లేకుండా సినిమాయేంటీ అనేవారు కొందరుంటారు. వారికి సమాధానంగానూ, పై నిజాలన్నింటికీ నిదర్శనంగానూ ఈ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి వచ్చింది అత్తారింటికి దారేది సినిమా.

కథః కోటీశ్వరుడు బోమన్ ఇరానీ. ఆయన కూతురు నదియా. ఆమె ఓ పేదవాణ్ణి (రావు రమేష్) ప్రేమించింది. తండ్రి ఆ ప్రేమని అంగీకరించలేదు సరికదా, ఆ పేదవాడిపై తుపాకి కూడా పేల్చాడు. ఆ క్షణంనుంచీ తండ్రిని ఏవగించుకుని విడిగా వెళ్లిపోయింది నదియా. ఆ తర్వాత బోమన్ ఇరానీ ఇటలీలో తేలి లక్ష కోట్లు సంపాదించాడు. కొడుకు ముఖేష్ రుషి ఆయనకు తోడుగా ఉంటున్నాడు. మనవడు పవన్ కల్యాణ్ అంటే ఆయనకు ప్రేమ, నమ్మకం, ఆశ. నదియాకోసం తపించిపోతున్న తాతకి ధైర్యం చెప్పి, అత్తనీ తాతనీ కలపడానికి ఇండియా బయల్దేరాడు పవన్. సమయానుకూలంగా ప్రవర్తిస్తూ, డబ్బుని కోట్లలో వెదజల్లుతూ, అదృష్టం కలిసొస్తే ఉపయోగించుకుంటూ- చివరికి అనుకున్నది సాధించాడు పవన్. సమీక్ష 1   సమీక్ష 2  review

హీరోః ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ అద్భుతంగా అనిపించాడు. మౌనంగా ఉన్నప్పుడు కళ్లలో భావాలు ప్రకటించాడు.  మాట్లాడినప్పుడు పంచ్‍లైనా, దంచుడైనా వేటికి తగ్గట్లు వాటిని ఒప్పించాదు. నృత్యాల్లో, పోరాటాల్లో వేగం, చమక్కులు, సొగసుగా ఉండేలా చూసుకున్నాడు. ఈ చిత్రాన్ని పూర్తిగా తన భుజస్కంధాలమీద మోశాడు.

హీరోయిన్స్ః ఇద్దరున్నారు. ప్రణీత పాత్రని ఇద్దరుండాలని పెట్టినట్లుంది. సమంత గ్లామరస్‍గా అనిపించలేదు కానీ ఆమె పాదం మంచిదని ఈ చిత్రం మరోసారి ఋజువు చేసింది. నటన పరంగా ఇద్దరూ కూడా తేలికగా తీసుకున్నట్లే అనిపిస్తుంది. ఒకవేళ సత్తాయే అంతేమో తెలియదు.

కామెడీః ఆలీ సన్నివేశాలు సరదాగానూ, కొంత అర్థవంతంగానూ కూడా ఉన్నాయి. చివర్లో బ్రహ్మానందం పాత్ర సినిమాను పెంచడానికే అనిపిస్తుంది. అతడి పాత చిత్రాలు చూసినవారికి కాస్త పేలవంగా కూడా అనిపించొచ్చు. నాలుగు భాగాల స్కిట్ ఒకటి మరీ సుదీర్ఘం అనిపించింది. కానీ గబ్బర్ సింగ్‍లో అంతాక్షరిలా ఆ ప్రహసనం ప్రేక్షకులకి నచ్చిందనుకోవాలి. ఆ స్కిట్ ముగియగానే కాటమరాయుడా అన్న పవన్ పాడిన పాట రావడంతో జనాల్లో నీరసం (కలిగినవారుంటే) మటుమాయం ఔతుంది.

నదియాః పవన్ అత్తగా నటించిన నదియాది చిత్రానికే కీలక పాత్ర. ఆమె అందం, హుందాతనం, నటనలో అతి లేకుండా ఆ పాత్రకు న్యాయం చేకూర్చిన తీరు- ఈ చిత్ర విజయానికి కీలకాల్లో ఒకటి కావచ్చు.

పోసానిః ఇటీవల ఈ నటుడు నటన, ఉచ్చారణల పరంగా ఎదుగుతున్నాడు. ఈ చిత్రంలో గుర్తుండిపోయే వారిలో ఇతడొకడు.

ఇతర తారలుః ఇంచుమించు అందరూ శత్రకాయలే. కోట శ్రీనివాసరావుది అర్థం లేని పాత్ర. బోమన్ ఇరానీది విగ్రహపుష్టి.

సంగీతముః దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు లయ ప్రధానమైనవి. చిత్రంలో ఊపునిస్తాయి. తర్వాత కూడా ఎన్నిమార్లు విన్నా హమ్ చేసుకోవాలనిపిస్తాయి.  మచ్చుకి బాపు గారి బొమ్మ, నిన్ను చూడగానె. రెండో పాటలో దేవిశ్రీప్రసాద్ కనిపిస్తాడు. హాల్లో అప్పుడు మ్రోగిన చప్పట్లు దేవిశ్రీ పాప్యులారిటీకి నిదర్శనం.

మాటలు-దర్సకత్వముః రెండూ త్రివిక్రమ్. ఈ చిత్ర విజయానికి ఈ రెండూ ముఖ్య కారణాలు. ఐతే త్రివిక్రమ్ గత చిత్రాల్లోలా కాక- ఇందులో అక్కడక్కడ పంచ్ సహజంగా అనిపించక కొంచెం తాపత్రయం పడినట్లు (ఉదాహరణకి ఇస్యూ, టిస్యూ) కనబడింది. కనీసం ఒకచోట పవన్ చేత ద్వంద్వార్థాల పదం ఉపయోగించడం- ఆ ఇద్దరికీ గౌరవం కాదు. మాటలు కొన్నిచోట్ల  అసందర్భంగానూ, కొన్నిచోట్ల పేలవంగానూ అనిపించాయి. ఐతే మొత్తంమీద ఈ చిత్రంలో సంభాషణలు గొప్పగా ఉన్నాయనక తప్పదు. కొన్ని సన్నివేశాలు (పవన్ చుట్టూ చూసి అప్పటికప్పుడు తన గురించి కథ చెప్పడం) విదేశీ చిత్రాల (The Usual Suspects) ప్రేరణతో వచ్చినా ఎన్నో సన్నివేశాలు కొత్తగానూ, మనోరంజకంగానూ అనిపించాయి. అదీ దర్శకత్వ ప్రతిభ. ఇక క్లయిమాక్స్ ఈ చిత్రానికి హైలైట్. నిజానికిది పూర్తిగా దర్శకుడి చిత్రం. ముందే అనుకున్నట్లు కథ లేదు, కొత్తదనం లేదు, తర్కానికందదు- ఐనా చిత్రం ఎక్కడా విసుగనిపించదు. థియేటర్లోంచి బయటికొచ్చాక- మనసుకి ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది.  అది త్రివిక్రమ్ మాయే అనుకోవాలి.

చివరి మాటః త్రివిక్రమ్ శ్రీనివాస్‍కి ఓ లెవెలుంది. ఈ చిత్రంలో ఆ లెవెల్ కాస్త పడింది. ఐనా ఈ చిత్రం అపూర్వమైన విజయం సాధించింది. ఎప్పుడూ ఇలాగే జరుగుతుందని గ్యారంటీ లేదు. కాబట్టి మున్ముందు చిత్రాల్లో త్రివిక్రమ్ తన లెవెల్ మర్చిపోడని ఆశిద్దాం.

7 వ్యాఖ్యలు »

  1. D.V.VSATYANARAYANA, SIRIWADA, PEDDAPURAM MANDAL, E.G DIST said,

    attarintikidaredi kutumbasametamgaa choose film. pillala kallu chevulu mooyavalasina ani lekundaa andaroo happyga enjoy ceyyavachu. item song kooda nindugaa dressvesaaru. thanks

  2. మీరు మీ విమర్శ ఇంత అద్భుతంగా చెప్పగలరని అనుకోలేదు. చాలా బాగుంది. నిజానికి బ్రహ్మానందం అనవసరం అనిపిస్తుంది. చాలా బాగా వ్రాసారు.


Leave a Reply

%d bloggers like this: