నవంబర్ 24, 2013
విశిష్ట పద్యాలు
అందరికీ వందనాలు.
రామరాజ భూషణుని “వసుచరిత్రము” నుండి ఒక అందమైన పద్యం:-
తమ్ముల బంపుదు సృణి శతమ్ములఁ బంపుదు రాజహంసపో
తమ్ములఁ బంపుదున్ బరిచితమ్ముల గానన దేవతాళి జా
తమ్ముల బంపుదున్ ద్రుతగతమ్ముల నేనును సారణీ ప్రపా
తమ్ముల వత్తు విశ్వవిదితా ముదితా మది తాపమేటికిన్
గిరిక-వసురాజుల వివాహమయింది. తల్లిదండ్రుల్నివిడిచి అత్తవారింటికి పయనమయ్యే సమయంలో విచారంగా ఉన్న కుమార్తెను తల్లి శుక్తిమతి ఓదారుస్తూ ఇలా అంటున్నది.
ఓ ముదితా! నీ తమ్ములను నీ వద్దకు పంపుతాను (తమ్ములు – అంటే కమలాలు అనే అర్థం కూడా ఉంది). అనేకములైన ముక్తామణులను (మణితమ్ములు) పంపుతాను. రాయంచ కొదమలనూ (రాజహంస పోతమ్ములన్) పంపుతాను. నీకు బాగా తెలిసిన వనదేవతలను – నీ సఖీ సమూహాన్నీ (పరిచితమ్ములను కానన దేవతాళి జాతమ్ములను) పంపుతాను. నేను కూడా అతివేగంగా (ద్రుతగతమ్ములన్) పిల్లకాలువ రూపంలో సెలయేటి రూపంలో (సారణీ ప్రపాతమ్ములన్) వస్తాను. జగత్ప్రసిద్ధురాలవు తల్లీ! నీ మనస్సుకు విచారమెందుకు? (విశ్వవిదితా! మరి తాపమేటికిన్?)
(‘తమ్ముల’ అనే పదం అర్థభేదంతో అలరారింది. కాబట్టి యమకాలంకారం అన్నారు పెద్దలు.)
(‘తమ్ముల’ అనే పదం అర్థభేదంతో అలరారింది. కాబట్టి యమకాలంకారం అన్నారు పెద్దలు.)
భవదీయుడు
రమణ బాలాంత్రపు
moorthy said,
నవంబర్ 25, 2013 at 12:26 సా.
అంతర్జాల ప్రచురణకు, అభిరుచి కి ధన్యవాదములు
మరికొన్ని ప్రచురించగలరు
TVS SASTRY said,
నవంబర్ 24, 2013 at 7:20 సా.
ఓహో !తెలుగు పద్యమా!! నీకు పాదా(పదా)భివందనాలు!!