నవంబర్ 27, 2013
హాస్యంలో నవరసాల రేలంగి
తెలుగునాట రేలంగి వెంకట్రామయ్య పేరు తెలియనివారుండరు. వెండితెరపై హాస్యానికి చిరునామా రేలంగి వెంకట్రామయ్య. ఆ తర్వాత ఎవరు వచ్చినా చిరునామా అదే. వివిధ పాత్రలలో ఆయన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. వాటిలో కొన్ని ఇక్కడ ఇచ్చాం. అప్పట్లో ఏ చిత్రంలోనైనా ఆ నటుడికి ఊతపదం ఉంటే అది తెలుగునాట మార్మ్రోగిపోయేది. కారణం ఆ పదాన్ని ఆయన ఉచ్చరించిన తీరు. 1956లో భలేరాముడు చిత్రంలో జూలకటక, 1958లో ఇంటిగుట్టు చిత్రంలో జంబలకిడి పంబ- అప్పట్లో గొప్ప సంచలనం కలిగించాయి. ఇంటిగుట్టు చిత్రవిజయానికి ఎన్టి రామారావుతో పాటు రేలంగికీ సమాన హోదా ఇచ్చారు. ఆ చిత్రం శతదినోత్సవం జరుపుకున్నాక తెలుగునాట అనేక పట్నాలకు వెడుతూ, ఆ మహానటుడు రాజమండ్రి కూడా వచ్చారు. నేను చదివే Government Arts Collegeకి ఆయన్ని ఆహ్వానించారు. అప్పుడు విద్యార్థులంతా ఆయన్నిజంబలకిడి పంబ అనమని బలవంతపెట్టారు. ఆయన ముందు ఒప్పుకోలేదు. చివరికి కాస్త బాధగా ముఖం పెట్టి, ‘నేను చాలా సమావేశాలకి వెళ్ళాను. అంతా నన్నీ ఊతపదం చెప్పమన్నారు. తప్పనిసరై చెప్పాను. ఇది కాలేజీ కదా, ఇక్కడ విద్యాధికులుంటారు, వారు నన్ను మరింత ఉదాత్తమైనది అడుగుతారనుకున్నాను. కానీ మీకూ వాళ్లకూ తేడా లేకపోవడం బాధగా ఉంది’ అని ఆ ఊతపదాన్ని చెప్పారు. అంతా చప్పట్లు కొట్టి వినోదించారేతప్ప చిన్నబుచ్చుకోవాలని అనుకోలేదు. కానీ నాకా రోజు ఆయన మాటల్లో ఓ గొప్ప సందేశం వినిపించింది. సినిమాల ఆదరణలో మనలో అన్ని వర్గాలవారూ ఒక్కలాగే ఉండడంవల్ల- మన సినిమాల స్థాయి కూడా అలాగే ఉంటోంది. మన సినిమాలు ఉదాత్తంగా ఉండాలని రేలంగి వంటివారు ఆశిస్తున్నారు కానీ, అది సాగక అసంతృప్తితో ఉన్నారు. మన సినిమాలను నిరసించేవారు, ముఖ్యంగా విద్యార్థులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయమిది. నవంబర్ 26న శ్రీ రేలంగి వర్ధంతి సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాం.
Leave a Reply