డిసెంబర్ 3, 2013

పండిత పరిష్కారం

Posted in సాంఘికం-రాజకీయాలు at 12:08 సా. by వసుంధర

ఒక రాజుకి తన పళ్లన్నీ ఊడిపోయినట్లు కల వచ్చింది. ఆస్థాన జ్యోతిష్కుణ్ణి [పిలిచి ఫలితం చెప్పమన్నాడు. నీ కళ్లముందే నీ బంధువులంతా చచ్చిపోతారని ఆ కలకి అర్థం అన్నాడు జ్యోతిష్కుడు. రాజుకి కోపం వచ్చి జ్యోతిష్కుణ్ణి కారాగారంలో వేయించాడు. ఇది తెలిసిన ఆస్థాన పండితుడు రాజును కలుసుకుని, ‘జ్యోతిష్కుడికి మాట తీరువు లేక అలా చెప్పాడు. నిజానికి ఆ కలకి అర్థం- నీ బంధువులందరికంటే నీవే ఎక్కువ ఆయుష్మంతుడవని’ అన్నాడు. రాజు సంతోషించి జ్యోతిష్కుణ్ణి కారాగారంనుంచి విడిపించాడు.

సమస్యలు, పరిష్కారపరంగా- రాజకీయానికీ, జ్ఞానానికీ, పాండిత్యానికీ ఉన్న భేదాన్ని చక్కగా వివరించే కథ ఇది. మాకు ప్రియతమ ఆచార్యులు డాక్టర్ మల్లాది నరసింహశాస్త్రి గారు- ఇటీవల తెలంగాణ సమస్యకు సూచించిన ఆసక్తికరమైన పరిష్కారం విన్నప్పుడు మాకీ కథ గుర్తుకొచ్చింది.

ఆ పరిష్కారం ఏమిటంటే-

సీమాంధ్రని తెలంగాణతో కలిపి సీమాంధ్ర తెలంగాణను ఏర్పర్చాలన్న భావన పుంజుకుంటోంది. దాన్ని బలపర్చడం సమంజసమేమో ఆలోచించమని!

ఇది విన్నప్పుడు మన దేశాన్ని రాజకీయవాదులు కాకుండా పండితులు నడిపితే బాగుండేదోమో అనిపించదూ! ఐతే మన తొలి ప్రధాని పేరే పండిత జవహర్‍లాల్ నెహ్రూ కాబట్టి- స్వతంత్ర భారత పాలన పండితునితోనే మొదలయింది. ఆ తర్వాతనుంచి మనని నడిపిస్తున్నవారు మాత్రం పండిత పుత్రీ పౌత్రులు కదూ! అదీ సంగతి- సామెతలు ఊరికే పుట్టవు మరి!

1 వ్యాఖ్య »

  1. C S Sarma said,

    Diplomacy is primary, to solve any issue.


Leave a Reply to C S Sarma Cancel reply

%d bloggers like this: