Site icon వసుంధర అక్షరజాలం

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్- చిత్రసమీక్ష

Venkatadri-Express-Movie-trailer415x250

మన దేశంలో క్రమశిక్షణ కరువయింది. కానీ క్రమశిక్షణకు ప్రాణమిచ్చే ఓ రామ్మూర్తి (నాగినీడు) ఉన్నాడు.  మన దేశ ప్రజలు శ్రోతలు, ప్రేక్షకులుగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు తప్ప ఆవేశపడరు. కానీ తన  ఎదుట జరిగే చెడుకి శ్రోతగా, ప్రేక్షకుడిగా ఉండలేక ఆవేశపడే ఓ సందీప్ (సందీప్ కిషన్) ఉన్నాడు. అబ్బాయిలకి పెళ్లిళ్లు కావడం కష్టమైన ఈ రోజుల్లో పులిమీద పుట్రలా తండ్రి కూడా పెళ్లికి అడ్డుపుల్లలు వేస్తుంటే- ఎలాగో అలా తండ్రి చేతులమీదుగానే తన పెళ్లి జరగాలని తపించిపోతున్న ఓ ముదురు బెండకాయ బ్రహ్మచారి (బ్రహ్మాజీ) ఉన్నాడు. చదువంటే ఆసక్తి లేకపోయినా దేవుడి మ్రొక్కులతో పరీక్షలు ప్యాసై, ఉద్యోగం కూడా సంపాదించుకుని, ఎటిఎం కార్డు మెషిన్లో ఉండిపోయినా పట్టించుకోని ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి ప్రార్థన (రకుల్ ప్రీత్ సింగ్) ఉంది. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెడుతున్న ఓమూఢనమ్మకాల  దస్తగిరి (సప్తగిరి) ఉన్నాడు. వీరందరికీ అవసరపడి, అలవాటుగా లేటుగా నడుస్తుండే ఓ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్  ఉంది. అందులో ప్రయాణమే  ఆ ట్రయిన్ పేరుతో ఈ నవంబర్ 29న విడుదలైన చిత్రకథ.

 

బ్రహ్మాజీ పెళ్లికి సకుటుంబంగా బయల్దేరాడు రామ్మూర్తి. ఆయన భార్య పెళ్లికని చేయించిన మంగళ సూత్రాలు  ఇంట్లో మర్చిపోయింది. ఆ విషయాన్ని ట్రయిన్ ఎక్కేముందు గుర్తించింది. తల్లికి తండ్రి దగ్గిర మాట రాకూడదని సందీప్ అప్పటికప్పుడు పరుగున బయల్దేరాడు. అప్పుడే స్టేషన్ చేరిన ఓ ఆటోని హైజాక్ చేసి తన ఇంటికి వెళ్లి తాళాలు లేక తాళం కప్ప బద్దలుకొట్టి లోపలికెళ్లి తాళి తెచ్చుకొచ్చాదు. హైజాక్ చేసిన ఆటోలో ఉన్న ప్రార్థన, అతణ్ణి దొంగగా అపార్థం చేసుకుంది. ఇద్దరూ స్టేషన్ చేరేసరికి మనకైతే ఎప్పుడో ట్రయిన్ వెళ్లిపోయుండాలనిపిస్తుంది కానీ వాళ్లు కొద్ది సెకన్లలో మిస్సయ్యారు. అప్పట్నించి వాళ్లు ట్రయిన్ తిరుపతి చేరేలోగా దాన్ని అందుకోవాలని ప్రయత్నించడం, ట్రయిన్లో జరిగే విశేషాలు- మొదటి సగంలో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. రెండో సగంలో ప్రేక్షకుల్లో ఉత్కంఠని రేపుతాయి. చివర్లో జయప్రకాష్ రెడ్డితో జొనిపిన హాస్యం కాస్త విసుగనిపించినా సినిమా అర్థవంతంగా ముగుస్తుంది.

 

హాస్యపరంగా రచయితలోని సృజనాత్మకత మొదటి సగంలో ఐపోయిందనిపిస్తుంది. ట్రయిన్లో కవితా ప్రియుడైన టికెట్ కలెక్టర్‍గా శివన్నారాయణ నటన ఎంత గొప్పగా ఉన్నా, అందుకు ఎన్నుకున్న సన్నివేశాలు- జంధ్యాల వారు పనికిరావని వదిలేసినవి కాదుకదా అనిపిస్తాయి. చాలా సంఘటనలు నిర్ణీత సమయంలో జరుగడం అసాధ్యం అనిపించినా, ఒక్క నిరాయుధుడు వందమంది సాయుధుల్ని అవలీలగా ఎదిరించడాన్ని సహజంగా తీసుకోగల మనకవి అసాధ్యమనే అర్హత లేదు. 

 

ఈ చిత్రంలో సందీప్ కిషన్‍కి నటన రాదనిపించినా, నటించడానికి ప్రయత్నించకపోవడంతో ముచ్చటగా అనిపించాడు. అనుకరణకు మహేశ్‍బాబుని ఎన్నుకోవడం కూడా అతణ్ణి కొంత ఆదుకుంది. ఓ పాటలో అతడి స్టెప్స్ కూడా మహేష్ స్టెప్స్ లా క్లుప్తంగా ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ చూడ ముచ్చటగా ఉంది. ఆమెకు డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ అదీ ముచ్చటగా ఉంది. ఐశ్వర్యారాయ్‍ నటనని మెచ్చేవారందరూ, ఈమెను నటిగానూ మెచ్చుకోవచ్చు. పక్కింటి అమ్మాయిలా అనిపించే ఈ పంజాబీ పడుచు ఓ పాటలో కాస్త వళ్లు దాచుకోకుండా కనిపించినపుడు కాస్త ఇబ్బంది అనిపించింది. ఈ చిత్రంలో నటీనటులందరూ చక్కని సహజ నటనని ప్రదర్శించారు. నాగినీడు హుందాగా ఉంటే, బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్ తమ పాత్రల్లో జీవించారు. సప్తగిరి కడుపుబ్బ నవ్వించాదు. బ్రహ్మానందం పాత్రని ఎమ్మెస్ నారాయణకి ఇచ్చి ఎమ్మెస్ లాగే నటిస్తే ఎలాగుంటుందో అలా ఉంది ఈ చిత్రంలో ఎమ్మెస్ పాత్ర. ఇదివరలో వచ్చిన పిల్ల జమీందార్ చిత్రంలో విభిన్న పాత్రలో రాణించిన ఈ నటుడికి- విభిన్న పాత్రలు పోషించగల సత్తా ఉన్నదా అన్న అనుమానం కలుగుతుంది.

 

మాటలు బాగున్నాయి. పాటలు ఫరవాలేదు. మొదటి చిత్రానికి దర్శకత్వం ప్రతిభావంతం అనే చెప్పాలి. ఈ చిత్రం విజయం సాధించడం తథ్యం. ఐతే ఇది విజయంగా కాక తొలిమెట్టుగా భావించితే- ఈ దర్శకుడికి తిరుగులేని భవిష్యత్తు తథ్యం.

 

కొత్తదనానికీ, వినోదానికీ, కుటుంబసమేతంగా సత్కాలక్షేపానికీ ప్రతిఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రమిది. ఈ చిత్రనిర్మాణంలో పాత్ర వహించినవారందరికీ అభినందనలు. 

ఈ చిత్రంపై మరో సమీక్ష.

 

Exit mobile version