డిసెంబర్ 18, 2013

ఆలస్యానికి దారేది?

Posted in సాంఘికం-రాజకీయాలు at 3:30 సా. by వసుంధర

అనుకోవాలి కానీ అసాధ్యమేముంటుందీ- అనుకునేవారు- కాళ్లు లేకపోయినా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరొహించగలరు. అమ్మో, అదెంత పెద్దపనో అనుకునే వారు- కుక్కర్లో బియ్యం కూడా పెట్టలేరు. రెండవ విశేషానికి ఉదాహరణలు- మన పార్లమెంట్‍లో మహిళా బిల్లు, లోక్‍పాల్ బిల్లు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోవడంతో అధికారపక్షంలో వేడి పుట్టింది. ఒక రాష్ట్రంలో- అవినీతిపైకి బాణం ఎక్కుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి లభించిన అనూహ్య ప్రజాదరణతో, ప్రతిపక్షంలో ఉన్న బిజెపిలో వేడి పుట్టింది. ఆమ్ అద్మీ పార్టీ ముందు తన ఉద్యమం తేలిక పడిపోకూడదనుకున్న- అన్నా హజారేలో- కొంత సద్దుబాటుకి ఒప్పుకునైనా సరే- లోక్‍పాల్ బిల్లుని అమలులోకి తేవాలన్న వేడి పుట్టింది.  అంతే! ఏళ్ల తరబడి ముందుకెళ్లని లోక్‍పాల్ బిల్లు రెండు రోజుల్లో రాజ్యసభ, లోక్‍సభల అమోదాన్ని పొందింది. 

ఇప్పుడు లోక్‍పాల్ బిల్లు ఆమోదానికి ఘనత రాహుల్‍ది అని కాంగ్రెస్, కాదు మాదని బిజెపి- ప్రచారానికి సిద్ధపడుతున్నారు.

కానీ ప్రజలేమనుకుంటారు? దీనికి మహాభారతంలో ఓ కథ ఉంది. గురువు ద్రోణాచార్యుడు వంటవాళ్లని శాసించాడట- అర్జునుడికి చీకట్లో భోజనం పెట్టవద్దని. కానీ ఒకరోజు భోజన సమయంలో- గాలికి దీపాలు ఆరిపోయాయిట. అయినా ఆ చీకటి భోజనం చెయ్యడానికి అడ్డు రాలేదు. అప్పుడు అర్జునుడు అనుకున్నాట్ట- అలవాటైన పని చెయ్యడానికి చీకటి అడ్డు రాదని. అప్పట్నించీ చీకట్లో విలువిద్యని అభ్యసించడం ప్రారంభించి గురువు మెప్పుని పొందాడు అర్జునుడు. ఈ అంశంమీద గతంలో అర్జునుడూ-అనసూయమ్మా అనే మా కథ విజయ మాసపత్రికలో ప్రచురితమైంది. ఆ కథకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఇప్పుడు భారత పౌరుల ఆలోచనలు అర్జునుడి తరహాలో ఉండడం సహజం.  ప్రజలకు అత్యవసరమైన ప్రతి బిల్లూ ఇంత త్వరగా అమల్లోకి రావాలని వారు అనుకోవడం సహజం. 

ప్రజా ప్రతినిధులారా? లోక్‍పాల్ బిల్లుతో- అంతం కాదిది ఆరంభమనేలా- మీ పాలన ఉంటుందా? లేదా- ఆలస్యానికి దారేది- అని అన్వేషణ మొదలెడతారా?   

ఈ అంశంపై మరో కోణంగా నేటి కార్టూన్ ఒకటి ఈ క్రింద ఇస్తున్నాం.

cartoon dc

 

 

 

 

 

 

 

 

4 వ్యాఖ్యలు »

 1. ఆకునూరి మురళీకృష్ణ said,

  ‘అర్జునుడూ అనసూయమ్మ’ కథ బాగుంది. చాలా పాత కథ అనుకుంటాను, సందర్భానుసారంగా మీరు శ్రధ్ధగా స్కాన్ చేసి పెట్టిన విధానం ఆకట్టుకున్నాయి. మీరు కథ చెప్పే విధానం అద్భుతం !! అందుకోండి మరోసారి అభినందనలు !!

  • అప్పట్లో విజయ మాసపత్రిక కొత్తగా వచ్చిందని సరికొత్త కథలు ప్రత్యేకంగా వ్రాసి పంపితే- వరుసగా వెంటవెంటనే తిరిగొచ్చాయి. అవి వెంటవెంటనే ఇతర పత్రికలు ప్రచురించాయి. చివరకు ఓసారి చాలా పత్రికలు తిప్పి పంపిన ఈ అర్జునుడూ-అనసూయమ్మా కథని విజయకు పంపితే అది ప్రచురితమైంది. ఈ కథను చదివిన శ్రీ కొడవటిగంటి కుటుంబరావు- ‘ఈ వసుంధర ఎవరో కానీ- నాకు వారసత్వం స్వీకరించినట్లు అనిపిస్తోంది’ అన్నారని శ్రీ విజయ బాపినీడు తర్వాతెప్పుడో చెప్పారు. ఆ తర్వాత విజయ మాసపత్రికకు మేము ఆస్థాన రచయితలా అనిపించేటంతలా- మా కథలు, నవలలు ఆ పత్రికలో వచ్చాయి.
   మీ మెయిలుకి ధన్యవాదాలు.

 2. bonagiri said,

  బానే ఉంది కాని, ఉద్యమకారులు, జనం రోడ్లమీదకు వచ్చి గొడవ చేస్తే తప్ప శాసనాలు చెయ్యరా?
  ఇదేమి ప్రజాస్వామ్యం?

  • జనం రోడ్లమీదకు వచ్చినా వారికి పట్టదు. ఎన్నికలు మీదకు వచ్చినప్పుడే వారి స్పందన


Leave a Reply

%d bloggers like this: